అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి

Sun,September 9, 2018 01:46 AM

ఖమ్మం, నమస్తేతెలంగాణ: నాలుగేండ్ల మూడు నెలల కా లంలో వీలైనంత మేరకు ఖమ్మాన్ని అభివృద్ధి చేశా.. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది యావత్ తెలంగాణకే ఆదర్శంగా నిలిపేందుకు అహర్నిశలు కష్టపడ్డా.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అందరూ కలిసి ఆశీర్వదించండి.. అని ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. శనివారం త్రీటౌన్‌లోని గాంధీగంజ్ ప్రాంతంలో వర్తక వ్యాపారులు, టీఆర్‌ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఖ మ్మం అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లాలో అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేశానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి అనునిత్యం స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేశానని తెలిపారు. అనతికాలంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ సహకారంతో ఎంతో మందికి ఆసరాగా నిలిచినందుకు ఎంతో సంతృప్తి కలిగిందన్నారు. ఎవరి వ్యాపారాలు వారు స్వేచ్చగా చేసుకునే వెసులుబాటు కల్పించి, వర్తక వ్యాపారులకు అన్ని విధాలుగా సహకరించిన విషయాన్ని అజయ్‌కుమార్ గుర్తుచేశారు. త్రీ టౌన్ ప్రాంతానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన మురికి కూపం గోళ్లపాడు చానెల్ ప్రక్షాళనతో ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలికామన్నారు.

నగరంలోని నిరుపేదల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు నేరుగా ఇవ్వడం ఆనందాన్ని, తృప్తిని మిగిల్చిందన్నారు. ఆక్రమంలో తనకు పేదల కుటుంబ మనిషిని అన్న భావన కలిగిందన్నారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులను విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. త్రీటౌన్‌లోని హర్కార బావి సెంటర్‌నుండి ప్రకాశ్‌నగర్ వరకు రూ. 7.40 కోట్లతో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. ప్రజావసరాలకు అనుగుణంగా కూరగాయాల మర్కెట్, చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేశామన్నారు. బోసు బొమ్మ సెంటర్‌లో సుభాష్‌చంద్రబోస్ కాంస్య విగ్రహం ఏర్పాటుచేసి, సర్కిల్ అభివృద్ధితోపాటు గాంధీచౌక్ సర్కిల్ ఆధునీకరణ పనులు మంజూరు చేసిన విషయం విధితమేనన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తనను ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

దుష్ప్రచారాలకు తావులేకుండా అన్నివర్గాలు కలిసి తనను మరోసారి గెలిపిస్తే అభివృద్ధి పనులన్నీ కొనసాగిస్తామని, పెండింగ్ ప్రాజెక్ట్‌లను సైతం పూర్తిచేసి ఖమ్మాన్ని ఆదర్శంగా నిలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని అజయ్‌కుమార్ స్పష్టంచేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పాలడుగు పాపారావు, పోతుగంటి వాణి, మాటేటి నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ నాయకులు నున్నా మాదవరావు, మాదిరాజు వెంకటేశ్వర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొప్పు నరేష్, వేములపల్లి వెంకటేశ్వర్లు, కొత్తా వెంకటేశ్వరరావు, పసుమర్తి రాంమోహన్, వెంపటి లక్ష్మినారాయణ, సురేంద్రనాధ్ గుఫ్తా, మేళ్ళచెర్వు వెంకటేశ్వర్లు, దివాకర్ గుప్తా, గార్లపాటి సంతోష్, డోకుపర్తి సుబ్బారావు, వేములపల్లి రాంబాబు, బిచ్చాల తిరుమలరావు, కురువెళ్ళ ప్రవీణ్, మాటేటి రామారావు, అకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

234
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles