పల్లెపల్లెనా గులాబీ దళం

Sat,September 8, 2018 12:55 AM

- అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రధాన అస్ర్తాలు..
- గ్రామస్థాయిలో బలోపేతమైన టీఆర్‌ఎస్
- సీఎం వ్యూహంతో కకావికలమవుతున్న విపక్ష పార్టీలు
- కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ అంటున్న ప్రజలు
- మంత్రి తుమ్మల సారథ్యంలో పది స్థానాలు గెలుస్తామంటున్న నాయకులు
ఎన్నికల ధూం ధాం మొదలైంది. ఎవరి అంచనాలకు అందకుండా టీఆర్‌ఎస్ పార్టీ ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు తెరదించింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒకడుగు ముందుకేసి ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించారు. గురి చూసి బరి గీసిన కేసీఆర్.. ప్రగతి చక్రం ఆగొద్దని ప్రజాకోర్టులో తేల్చుకుందామంటూ విపక్షాలకు సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్, తెదేపా, వామపక్ష పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. పల్లె పల్లెకూ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని గులాబీ బాస్ అభ్యర్థులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు నూతనోత్తేజంతో పల్లెల్లోకి అడుగుపెడుతున్నారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రధాన అస్ర్తాలుగా చేసుకుని ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో టిక్కెట్ ఖరారు చేసుకుని శుక్రవారం నగరానికి చేరుకున్న అజేయుడికి ఉద్యమ గుమ్మం నీరాజనం పలికింది. వైరా అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం తొలిసారిగా కొణిజర్ల, వైరా మండలాలకు విచ్చేసిన మదన్‌లాల్‌కు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.

కేసీఆర్ పనితీరు నచ్చే..
పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమాన్ని నిర్వహించి ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ప్రజాస్వామిక పద్ధతుల్లో రక్తపుబొట్టు చిందించకుండా రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ పట్టుదల, సంకల్పం కారణంగానే అనేక పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరిగాయి.. ఎంతటి కఠోర దీక్షతోనైతే ఉద్యమాన్ని నిర్వహించి రాష్ర్టాన్ని సాధించారో అంత కంటే రెట్టింపు స్థాయిలో తెలంగాణాను ప్రపంచ చిత్రపటంలో ఒక ఐకాన్‌గా చూపించేందుకు సీఎం పడుతున్న కష్టాన్ని ప్రజలు ప్రతీ ఒక్కరు గుర్తిస్తున్నారు. దీని కారణంగానే టీఆర్‌ఎస్ జెండాను మరింత బలోపేతం చేసేలా ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తీరుగానే బంగారు తెలంగాణాను సాధించి తీరుతారని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, ఆదాయ వనరులు, ప్రజా సమస్యలు, నీటి వనరులు తదితర విషయాల్లో సీఎం కేసీఆర్‌కు ఉన్న అవగాహన రాష్ట్రంలో మరో నాయకునికి లేదనేది అందరూ అంగీకరించే విషయమే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గులాబీ జెండా కిందకు వచ్చారు. దీంతో రాష్ట్రంలో అత్యంత బలమైన పార్టీగా టీఆర్‌ఎస్ నిలబడింది. ఆంధ్రా పార్టీగా అవతరించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో అడ్రస్ లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్న నాయకత్వం మొత్తం మొదట్లోనే టీఆర్‌ఎస్ గూటికి వచ్చింది. ఇక కొద్ది మంది వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలోనే నాయకులు మిగిలి ఉన్నారు. వారు కూడా కారులో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అవకాశాలు రాక అలాగే ఉండిపోయారు. కాంగ్రెస్ పరిస్థితి దాదాపు ఇదేవిధంగా ఉంది. ఇకపోతే రాష్ట్రంలోనే కమ్యూనిస్టులకు గుండెకాయలా నిలిచిన ఒకనాటి ఖమ్మం నేడు గులాబీ జిల్లాగా అవతరించింది. ఆ పార్టీలోని ప్రధాన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరూ టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. నామమాత్రంగా ఉన్న బీజేపీలో కూడా నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది..

విప్లవపార్టీ నుంచి వలసల జోరు..
విప్లవ పార్టీలకు ప్రధాన కేంద్రంగా ఇల్లెందు ఉంది. ఇక్కడి నుంచి సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. రాష్ట్రంలోని ఏకైక విప్లవపార్టీ నియోజకవర్గంగా ఒకనాడు ఇల్లెందు ఉండేది. అలాంటిది నేడు ఆ పార్టీకి బీటలు వారాయి. క్షేత్రస్థాయిలోని నాయకులు మొత్తం గ్రామాలకు గ్రామాలు గులాబీ గూట్లోకి వలసలు వస్తున్నాయి. దీంతో ఇల్లెందు, గుండాల, బయ్యారం, టేకులపల్లి, గార్ల మండలాల్లో న్యూడెమోక్రసీ తమ ఆనవాళ్లను వెతుక్కునే పనిలో పడింది. ఇక పార్టీ రెండుగా చీలిపోవడంతో ప్రజలు వాస్తవ విషయాలను తెలుసుకుని గులాబీకి పట్టం గడుతున్నారు. అనేక గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతోంది. అంతేకాకుండా మైదాన ప్రాంతంలో బలంగా ఉన్న పిండిప్రోలు గ్రామ ఎంపీటీసీ సైతం టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. చంద్రన్న గ్రూప్‌నకు చెందిన అనేక మంది కార్యకర్తలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో ఆ పార్టీలో సరైన నాయకత్వం లేకపోవడం, ఉన్న నాయకత్వాన్ని కార్యకర్తలు విశ్వసించకపోవడం కూడా వలసలకు మరో కారణంగా భావిస్తున్నారు.

పథకాల పైనే ప్రధాన చర్చలు..
ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్‌లా పనిచేస్తారా? అని ప్రతీచోట మాట్లాడుకోవడం జరుగుతుంది. కేసీఆర్‌లా పేదోడికి మూడెకరాల భూమి పంచుతారా..? పంట పెట్టుబడి పథకం కింద ఎకరానికి రూ. 8వేలు ఇస్తారా..? రైతు చనిపోతే రూ. 5 లక్షల బీమా కల్పిస్తారా..? పండు ముసలి బతకడానికి రూ. 1000 పింఛన్ ఇస్తారా..? హాస్టల్ పిల్లలకు సన్నబియ్యంతో బువ్వ పెడతారా..? అంటూ సంక్షేమ పథకాల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ కమ్యూనిస్టు పార్టీలే ఈ విధంగా చేస్తారని భావించినా ఆశలు మాత్రం కలగడం లేదు. ఎందుకంటే మూడు దశాబ్దాలు పశ్చిమబెంగాల్, రెండు దశాబ్దాలు, కేరళ, త్రిపుర రాష్ర్టాలను పాలించారు. అక్కడ ఇలాంటి సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదు.. దున్నే వానికి భూమి ఎందుకు ఇవ్వలేదు లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో నేటి కమ్యూనిస్టులు లేరు. అందుకే సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ పట్టం గడుతున్నారు.

నాలుగేళ్లుగా కొనసాగుతున్న వలసలు..
నిన్నా.. మొన్నటి వరకు సైకిల్‌పై పయనం చేసిన నాయకులు... సుత్తీ కొడవలి నక్షత్రం చూస్తే రక్తం సలసలమండే నాయకులు... హస్తం గుర్తే పంచ ప్రాణాలుగా భావించిన నేతలు.. విప్లవ పాఠాలే జీవితంగా బతికిన వారు... తామర పుష్పంను గుండెలపై పెట్టుకునే నాయకులందరూ... కారులో పయనించడానికి పోటీ పడుతున్నారు. ఇప్పటికే అన్నిరకాల ప్రయాణికులతో కిటకిటలాడుతున్న కారులో చోటు కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీలో మరోమారు వలసల ప్రవాహం కొనసాగుతోంది. ప్రతీ రోజు ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోట టీఆర్‌ఎస్‌లో తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ సహా విప్లవ పార్టీల నుంచి వందలమంది కార్యకర్తలు గులాబీ గూటిలోకి చేరుతున్నారు. గ్రామ స్థాయి కార్యకర్త మొదలుకుని మండల స్థాయి నాయకుని నుంచి జిల్లా స్థాయి నాయకుని వరకు ఈ వలసల జోరులో ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా సాధారణ అభిమానులు కూడా టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇదే కాకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారు. దీంతో ఆ పార్టీ జిల్లాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్‌ఎస్ దూకుడుతో ప్రతిపక్ష పార్టీలు కకావికలం అవుతున్నాయి.
ఆ పార్టీలలోని కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు అనేక కుయుక్తులను పన్నుతున్నారు. అయినప్పటికీ వలసల జోరును నివారించడం ఎవరి తరం కావడం లేదు.

సాగునీటికే తొలి ప్రాధాన్యత..
తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా నిర్మించడానికి సీఎం కేసీఆర్ పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో దేశ చరిత్రలో ఎక్కడా నిర్మించని విధంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించే లక్ష్యంతో సుమారు 1000 కోట్లతో సీతారామ ఎత్తి పోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. ఇవేకాకుండా కృష్ణా, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టులను నిర్మించేందుకు సీఎం ప్రణాళికలను రూపొందించారు. ఇవికాకుండా రాష్ట్రంలో ఉన్న చిన్నచిన్న నదులు, వాగులపై కూడా ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేశారు. ఒకనాడు కరువు కాటకాలతో అల్లాడిన ఖమ్మం జిల్లా నేడు సస్యశ్యామలంగా కళకళలాడుతుంది. మిషన్ కాకతీయతో చిన్ననీటి వనరులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. పాటు ఇంటింటికీ సురక్షితమైన మంచినీటిని అందించే లక్ష్యంతో మిషన్ భగీరథను ప్రారంభించారు.

సంక్షేమ పథకాల్లోనూ ముందడుగే..
అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ రంగానికి సమాన ప్రాధాన్యతనిస్తున్నారు సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతిగా అవతరించారు. ఇప్పటికే రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకాలను అందించడంతో పాటు పంట పెట్టుబడి పథకం కింద ఎకరానికి రూ. 8వేలను ప్రకటించారు. ఇప్పటికే రూ. 4వేల చొప్పున పంపిణీ కూడా చేశారు. ఇవేకాకుండా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ పథకాలను అనుభవిస్తున్న ప్రజలు ఇంతకంటే మరే ముఖ్యమంత్రి చేయడని భావిస్తున్నారు. అందుకనే గులాబీ జెండాను గుండెకు అద్దుకుంటున్నారు. కారులో పయనించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

233
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles