సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి

Tue,December 10, 2019 01:20 AM

-శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి
-సమూల మార్పుకోసం బోధన జరగాలి
-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌
-చొప్పదండిలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

చొప్పదండి, నమస్తే తెలంగాణ: విద్యార్థులు సాంకేతికను సద్వినియోగం చేసుకుంటూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. చొప్పదండిలోని ఝాన్సీ విద్యాలయంలో ఏర్పాటు చేసిన 47వ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయాలన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన చొప్పదండి నియోజకవర్గంలోని లక్ష్మిపూర్‌ పంపుహౌస్‌ సైన్స్‌పరిజ్ఞానంవల్లే సాధ్యమైందనీ, అది ఒక అద్భుతమని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దేశాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందంజలో నిలిపే బాధ్యత నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. నేటికాలంలో యువత స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంతో బంధాలకు దూరమవుతూ పక్కదారికి పడుతూ అనాగకరిక చర్యలకు పాల్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువులు మార్కుల కోసం కాకుండా సమాజంలో సమూల మార్పుకోసం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించి ఉత్తమపౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా విభజన అనంతరం మొదటిసారిగా నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను చొప్పదండిలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు నైతిక విలువలతో ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎగ్జిబిషన్‌ను మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పరిశీలించారు. విద్యార్థులు తమ ఎగ్జిబిట్స్‌ గురించి వారికి వివరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు చిలుక రవీందర్‌, శ్రీరాం మధుకర్‌, విజయ, జడ్పీటీసీ పొనుగోటి ప్రశాంతి, సింగిల్‌విండో చైర్మన్‌ పద్మాకర్‌రెడ్డి, సైన్స్‌ అధికారి మారం స్వదేశీ కుమార్‌, ఎంఈవో రాజస్వామి, బాలల కాంగ్రెస్‌ సమన్వయకర్త కేఎస్‌ అనంతాచార్య, అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ చాడ జయపాల్‌రెడ్డి, ప్రైవేట్‌ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles