స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత

Fri,December 6, 2019 02:25 AM

మానకొండూర్‌ (శంకరపట్నం): స్వచ్ఛత అందరి బాధ్యత అనీ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ ఆహ్మద్‌ పిలుపునిచ్చారు. శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామంలో యునిసెఫ్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘అంతర్జాతీయ వలంటీర్ల దినోత్సవ’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గ్రామంలో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం పూర్తికావడంపై సంతోషం వ్యక్తం చేశారు. బహిరంగ మలవిసర్జనరహిత గ్రామం అనేది ప్రకటనతో అగిపోకుండా..

ఈ ప్రక్రియ నిరంతరం సుస్థిరంగా కొనసాగాలన్నారు. అందుకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి వలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు వలంటీర్లు అవగాహన కల్పించాలన్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలు 80 శాతం సంరక్షించడంపై అధికారులను అభినందించారు. పైప్‌ కంపోస్టు విధానం ద్వారా గ్రామంలో తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని ప్రశంసించారు. యునిసెఫ్‌ ప్రాంతీయ కార్యాలయ అధికారి వెంకటేశ్‌ మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4000 మంది వలంటీర్లు గ్రామాల్లో సుస్థిర పారిశుధ్యం దిశగా గ్రామ పంచాయతీలకు సహకరిస్తున్నారని తెలిపారు. పలువురు వలంటీర్లకు వారి సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందజేసి, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ బైరి సంపత్‌, ఎంపీటీసీ గాండ్ల తిరుపతి, తాసిల్దార్‌ జగత్‌సింగ్‌, ఎంపీడీవో వినోద, యునిసెఫ్‌ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ కిషన్‌స్వామి, ఎస్‌బీఎం రమేశ్‌, ఫెసిలిటేటర్‌ కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles