సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయం

Thu,December 5, 2019 03:01 AM

-బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములవ్వాలి
-కరీంనగర్‌పై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ
-రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌
-అంబేద్కర్‌ మెమోరియల్‌ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభం

సుభాష్‌నగర్‌: సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. స్థానిక ఇందిరానగర్‌లో రూ.25లక్షల వ్యయంతో నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మెమోరియల్‌ కమ్యూనిటీ హాల్‌ను బుధవారం మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్‌ మెమోరియల్‌ కమ్యూనిటీ హాల్‌లో అన్ని వసతులు కల్పించేందుకు మరో రూ.10లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గత సమైక్యపాలనలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్లు, నిధులు, నియామకాలు, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. తగిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్‌పై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందనీ, నగర సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించారని గుర్తుచేశారు. రోజు రోజుకూ విస్తరిస్తున్న నగరంలో నూతనరోడ్లు, సైడ్‌డ్రైన్లు, నిరంతర తాగునీటి సరఫరా, నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నామని చెప్పారు. పేదల కడుపు నింపేందుకు ఒక్కొక్కరికి 6కిలోల బియ్యం, వృద్ధాప్య, వితంతువు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు పెంచి ఇస్తూ భరోసా కల్పించామని పేర్కొన్నారు.

అలాగే పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద రూ.లక్షా నూటపదహార్లు అందిస్తూ అండగా నిలుస్తున్నామని చెప్పారు. కరీంనగర్‌లో ఐటీ టవర్‌, ఎల్‌ఎండీలో బోటింగ్‌, తీగెల వంతెనల నిర్మాణాలు పూర్తయితే 4వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తెలంగాణ సర్కార్‌ అమలుచేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి గంగులకు స్థానిక కమ్యూనిటీ హాల్‌ నిర్వాహకులు, దళితసంఘ నాయకులు ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్ల రమేశ్‌, మాజీ కార్పొరేటర్లు యూదగిరి సునీల్‌రావు, లంక రవీందర్‌, బండారి వేణు, ఎడ్ల అశోక్‌, నాయకులు బైరం పద్మయ్య, సంపత్‌గౌడ్‌, అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్వాహక కమిటీ సభ్యులు, ఇందిరానగర్‌ వాసులు పాల్గొన్నారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles