బ్యాంకర్లూ.. ఇదేం తీరు!

Wed,December 4, 2019 02:12 AM


-రుణాలు ఇస్తున్నరు.. బీమా మరుస్తున్నరు..
-ప్రీమియం చెల్లింపులో అలసత్వం
-కర్షకుల్లో ఆందోళన
-బుక్ అడ్జస్ట్‌మెంట్‌తో గందరగోళం


కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనా పథకం రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంది. బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకునే రైతులకు బ్యాంకర్లే ప్రీమియం కట్ చేసి సంబంధిత బీమా కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాలతో పంట దెబ్బతిన్నపుడు సంబంధిత బీమా కంపెనీ రైతులకు నష్టపరిహారం చెల్లిస్తుంది. కానీ, జిల్లాలోని కొందరు బ్యాంకర్లు పంటల బీమా విషయంలో రైతులకు సహకరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

పంట రుణాలు ఇస్తున్న బ్యాంకర్లు చాలా మంది రైతుల నుంచి ప్రీమియం మినహాయించుకోవడం లేదని తెలుస్తోంది. అంతే కాకుండా కొందరికి కట్ చేసిన ప్రీమియంను గడువులోగా సంబంధిత బీమా కంపెనీకి చెల్లించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత కంపెనీ ఎన్ని సార్లు విన్నవించినా అనేక మంది బ్యాంకర్లకు పెడచెవిన పెడుతున్నారని తెలుస్తోంది. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలోని 17 బ్యాంకుల ద్వారా 57,173 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. కానీ, వీరిలో 30,715 మందికి మాత్రమే ప్రీమియం కట్ చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఇంకా 26,45 మంది రైతులను బ్యాంకర్లు విస్మరించారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.


అన్ని బ్యాంకులదీ అదే తీరు
ప్రతీ సీజన్‌లో పంట రుణాల కోసం వచ్చే రైతులకు పంటల బీమా పథకం గురించి ముందుగానే వివరించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పథకంలో రైతుల వాటా నామ మాత్రంగా ఉంటుంది. బ్యాంకర్లు పంట రుణం ఇచ్చే ముందు సాగు చేసే పంట, విస్తీర్ణం మేరకు స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ నిబంధన మేరకు రైతులకు రుణాలు ఇవ్వాలి. ముందుగానే రైతుల నుంచి ఈ వివరాలు సేకరించుకుని రైతులు చెప్పిన పంటకు రుణం ఇచ్చి, బీమా ప్రీమియం కట్ చేసి వెంటనే బీమా కంపెనీకి సదరు రైతు పేరిట జమ చేయాలి.

కానీ, బ్యాంకర్లు రైతులను అడగకుండానే ఏదో ఒక పంట పేరు రాసుకోవడం, రైతుకు తెలియకుండానే బీమా ప్రీమియం కట్ చేసుకోవడం, కట్ చేసుకున్న ప్రీమియం కంపెనీలకు చెల్లించక పోవడం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. దీంతో బ్యాంకులో పంట రుణాలు తీసుకునే రైతులు తాము ఏ పంటకు రుణం తీసుకున్నామో, బీమా ప్రీమియం చెల్లించామో లేదో తెలిసే పరిస్థితి లేకుండా పోయింది.
గత వానాకాలం సీజన్‌లో అకాల వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని మండలాల్లో 15,599.6 హెక్టార్లలో వరి, 41. హెక్టార్లలో మక్క, 11 హెక్టార్లలో పత్తి పంట దెబ్బతిన్నది. పంటలు దెబ్బతిన్న రైతుల్లో పంట రుణాలు తీసుకున్న వారు ఎంత మంది ఉన్నారు. రుణాలు తీసుకున్న రైతుల్లో బీమా ప్రీమియం కట్ చేసుకున్న వారు ఉన్నారా?, లేదా?, ప్రీమియం కట్ చేస్తే బ్యాంకర్లు సంబంధిత బీమా కంపెనీకి చెల్లించారా,? లేదా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.


బుక్ అడ్జస్ట్‌మెంట్‌కే ప్రాధాన్యం
చాలా మంది బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలో అవలంభిస్తున్న విధానాల కారణంగానే రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా కొన్ని పెద్ద బ్యాంకులు రైతులు తీసుకున్న రుణాలపై వడ్డీ కట్టించుకుని బుక్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నాయని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత శాఖలు ఉన్న ఓ బ్యాంకు గత సీజన్‌లో 11 వేల మంది రైతులకు పైగా రుణాలు ఇచ్చి కేవలం 720 మందికి మాత్రమే బీమా ప్రీమియం కట్ చేసినట్లు తెలుస్తోంది. మరో ప్రధాన బ్యాంకు పరిస్థితి చూస్తే 2,700 మందికి రుణాలిచ్చి 1,11 మందికి మాత్రమే ప్రీమియం కట్ చేసుకుంది. 1,00 మందికి రుణాలిచ్చిన మరో బ్యాంకు 945 మందికి, 2,360 మందికి రుణాలిచ్చిన ఇంకో బ్యాంకు 1,773 మందికి మాత్రమే ప్రీమియం కట్ చేసుకున్నాయి.

ఇలా ప్రతి బ్యాంక్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రైతులతో చాలా సన్నిహితంగా ఉండే ఒక పెద్ద బ్యాంకులో 11 వేలకు పైగా రైతులు రుణాలు తీసుకున్నట్లు కేవలం బుక్ అడ్జెస్ట్‌మెంట్ మాత్రమే చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బ్యాంకులో కొత్తగా రుణాలు తీసుకున్న 720 మందికి మాత్రమే బీమా ప్రీమియం కట్ చేసుకున్నట్లు స్పష్టమవుతున్నది. మిగతా బ్యాంకులు కూడా ఇదే దారిలో నడిచినట్లు తెలుస్తోంది.

అయితే పంట రుణంపై కట్ చేసుకున్న ప్రీమియం చెల్లించడంలో కూడా బ్యాంకర్లు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. రైతుల నుంచి సేకరించిన అన్ని పంటల బీమా ప్రీమియంను ఆగస్టు 30 వరకు సంబంధిత కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. సదరు కంపెనీ పదే పదే విన్నవించినా ఏ బ్యాంకు కూడా స్పందించడం లేదని తెలుస్తోంది. దీంతో గత నెల (నవంబర్) 15 వరకు బీమా కంపెనీ గడువు విధించుకున్నా ఇప్పటికీ పలు బ్యాంకులు చెల్లించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుంటే తప్ప తమకు న్యాయం జరిగే పరిస్థితి ఉండదని జిల్లా రైతులు వాపోతున్నారు.

102
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles