దేశ సేవకు ఇదే అవకాశం

Thu,August 22, 2019 02:14 AM

-పది రోజులపాటు ఎంపిక పరీక్షలు
-రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులకు అవకాశం
-రేపటి నుంచి వచ్చే నెల 22 దాకా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
-23 నుంచి అడ్మిట్ కార్డులు
-ఎనిమిది, పది, ఐటీఐ, ఇంటర్,డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులు
-పదిహేడున్నరేళ్ల నుంచి 23ఏళ్ల లోపు యువకులకు చాన్స్

కరీంనగర్ స్పోర్ట్స్:మీరు 17 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న యువకులా..? భారత సైన్యంలో చేరి, దేశ సేవ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకిదే అవకాశం! అక్టోబర్ 7 నుంచి 17 తేదీ వరకు కరీంనగర్ జిల్లాకేంద్రంగా నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, రాష్ట్రంలోని 33జిల్లాల అభ్యర్థులకు స్వాగతం పలుకబోతున్నది. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మన్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్.. ఇలా పలు విభాగాల్లో ఎంపిక ప్రక్రియ జరగనుండగా, రేపటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుకాబోతున్నది.- కరీంనగర్ స్పోర్ట్స్

భారత సైన్యంలో చేరి, దేశ సేవ చేయాలనే యువకులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు స్వాగతం పలుకుతున్నది. పదిహేడున్నరేళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులకు సువర్ణావకాశం కల్పిస్తున్నది. అక్టోబర్ 7 నుంచి 17 తేదీ వరకు కరీంనగర్ జిల్లాకేంద్రంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని 33జిల్లాల అభ్యర్థులకు అవకాశముండగా, రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నది. - కరీంనగర్ స్పోర్ట్స్

నిజమైన హీరోలు సైనికులు. కుటుంబాలను వదిలి ఎక్కడో దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేది వీరే. అందుకే జై జవాన్ అన్నారు. అలాంటి సైనికులంటే యువతకు ప్రత్యేక అభిమానం. తాము కూడా దేశ రక్షణ రంగంలో చేరి, సేవ చేయాలనున్నా, ఎప్పుడో ఒకసారి గానీ అవకాశం రాదు. కానీ, ఇప్పుడా చాన్స్ తలుపు తడుతున్నది. భారత సైన్యంలో చేరాలనుకునే పదిహేడున్నరేళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న యువకులకు సువర్ణావకాశం వచ్చింది. అక్టోబర్ 7 నుంచి 17 తేదీ వరకు కరీంనగర్ జిల్లాకేంద్రంగా నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులకు స్వాగతం పలుకుతున్నది. డా.బీఆర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా ఎంపిక ప్రక్రియ కొనసాగనుండగా, చెన్నైలోని హెడ్‌క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ దీనిని నిర్వహించనున్నది. శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై, వచ్చే నెల 22 వరకు ముగుస్తుంది. సెప్టెంబర్ 23 నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశమున్నది. అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతోపాటు అందులో పొందుపరిచిన ధ్రువ పత్రాలను ర్యాలీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థి ఏ రోజు, ఏ సమయంలో రావాలో అడ్మిట్ కార్డుపై రాసి ఉంటుంది.

ఇవీ పోస్టులు..
సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ ఏవియేషన్ అండ్ అమ్యూనేషన్ ఎగ్జామినర్, నర్సింగ్, వెటర్నరీ అసిస్టెంట్, క్లర్క్ /స్టోర్ కీపర్, సిఫాయి (ఫార్మా), ట్రేడ్స్‌మన్

ఎంపిక ఇలా..
డాక్యుమెంట్ల పరిశీలన, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అక్టోబర్ 8 నుంచి ర్యాలీ ప్రదేశంలోనే వైద్య పరీక్షలు చేస్తారు. డాక్యుమెంట్ల పరిశీలన, ఫిట్‌నెస్ టెస్ట్, శారీరక కొలతల పరీక్ష సమయం, తేదీలను అడ్మిట్ కార్డుల ద్వారా తెలియజేస్తారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ 23 తర్వాత అడ్మిట్ కార్డును ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ) : 1.6 కిమీ దూరాన్ని జీపీ-1 అభ్యర్థులు 5 నిమిషాల 30 సెకండ్లలోగా పూర్తి చేయాలి. జీపీ-2 అభ్యర్థులు 5 నిమిషాల 31 సెకండ్ల నుంచి ఐదు నిమిషాల 45 సెకండ్లలోగా చేరుకోవాలి. తొమ్మిది అడుగుల డిచ్ జంప్, పుష్‌అప్స్, బ్యాలెన్సింగ్ బీమ్ అర్హత సాధించాలి.
ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) : ఆయా పోస్టులకు సరిపడా శారీరక ప్రమాణాలను కొలుస్తారు. ఎత్తు, బరువు, ఛాతి పరీక్షలు చేస్తారు.
వైద్య పరీక్షలు : ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు సికింద్రాబాద్ మిలిటరీ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
ఎంట్రెన్స్ టెస్ట్ : ఆర్మీ ర్యాలీతోపాటు, సికింద్రాబాద్ మిలిటరీ దవాఖానలో వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన వారికి సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ అధికారి ఆధ్వర్యంలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను తర్వాత తెలియజేస్తారు.

ర్యాలీకి ఇలా రావాలి..
అడ్మిట్ కార్డులో పేర్కొన్న తేదీ, సమయం ప్రకారం అభ్యర్థులు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంకు చేరుకోవాలి. అడ్మిట్ కార్డుతోపాటు అందులో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాలను తప్పని సరిగా తీసుకెళ్లాలి. గ్రేడ్లు కాకుండా క్లాస్‌లో వచ్చిన మార్కుల జాబితాలను తీసుకురావాలి. గ్రేడ్ సిస్టమ్‌తో కూడిన ఎస్సెస్సీ సర్టిఫికెట్ అనుమతించరు. మార్కుల జాబితా కలిగి ఉండని అభ్యర్థులను నియామక ర్యాలీకి అనుమతించరు. నీట్ షేవ్ లేకున్నా, పర్మినెంట్ ట్యాటూలు ఉన్నా లోపలికి పంపించరు.

తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు..
అర్హత పరీక్షలకు సంబంధించిన ఒరిజనల్ సర్టిఫికెట్స్‌ను తీసుకెళ్లాలి. ఆన్‌లైన్‌లో జిల్లాల ప్రకారం దరఖాస్తు చేసుకొన్నప్పటికీ సర్టిఫికెట్స్ మాత్రం కొత్త 33 జిల్లాల ప్రకారం ఉండాలి. సర్టిఫికెట్స్‌ను ల్యామినేషన్ చేసి, వరుసక్రమంలో ఫైల్ చేసుకొని రావాలి. ఒక సెట్ జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారి (స్టాంప్ ఇంగ్లిష్‌లో ఉండాలి)తో అటెస్ట్ చేయించాలి. పదో తరగతి మార్కుల షీట్, ఇంటర్ మార్కుల షీట్, సర్టిఫికెట్స్, డిగ్రీ మార్కుల షీట్, సర్టిఫికెట్, స్థానికత, కమ్యూనిటీ, కులం, పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రాలు (కొత్త జిల్లాల ప్రకారం), చివరగా చదివిన విద్యా సంస్థ నుంచి ఆరు నెలలలోపు తీసుకున్న స్టడీ, కండక్ట్ సర్టిఫికెట్, గ్రామ సర్పంచ్ / వీఏవో నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ (ఇంగ్లిష్‌లో), ఎన్‌సీసీ, క్రీడలు, ఐటీఐ, కంప్యూటర్‌కు సంబంధించిన ఏమైనా అర్హతలు ఉన్న సర్టిఫికెట్స్, ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles