కొచ్చెరువు నీళ్లొచ్చె..

Wed,August 21, 2019 04:35 AM

- కాళేశ్వరంతో జలకళ
- ప్రాజెక్టునీటితో నిండుతున్న మొదటి చెరువు
- తీరుతున్న 15 ఏండ్ల నీటి కష్టాలు
- కొత్తపల్లి మండలం నాగుల మల్యాల రైతుల హర్షం
- బోర్లలో ఊట పెరిగిందంటున్న సమీప రైతులు
- ప్రతి రోజూ వచ్చి చూస్తున్న చుట్టు పక్కల జనాలు
- సస్యశ్యామం కానున్న ఆరు గ్రామాల భూములు
- త్వరలో అన్ని చెరువులకు నీళ్లిస్తాం : ఎమ్మెల్యే గంగుల
(కేస్ స్టడీ ఫొటో నం. 1670 మొగిలిపాలెం వేణు)
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:పదిహేనేండ్ల కింద మా బాయిల ఫుళ్లు నీళ్లుండేవి. వరద కాలువ తవ్వినప్పటి నుంచి మెల్లమెల్లగ ఎండిపోయింది. పంటలు పండించుకోను బాయిలనే 300 ఫీట్ల బోరేసినం. రెండుమూడేండ్లు ఎల్లదీసినం. ఆ తర్వాత అదీ ఎండిపోయింది. ఇంకోకాడ 700 ఫీట్ల బోరేసినం. కొంచెం కొంచెం పోసింది. రెండు మూడేండ్ల సంది అదీ ఎండి పోయింది. మల్లోకాడ 570 ఫీట్ల బోరేసినం. కొద్ది కొద్దిగా వచ్చే నీళ్లతోని ఎకరం.. అరెకం సాగు చేసుకుని బతుకుతున్నం. మా కొచ్చెరువులకు నీళ్ల ఎప్పుడైతే వచ్చుడు మొదలైందో.. చెరువుకు దగ్గర్నే ఉన్న మా బోరులో ఊట పెరిగింది. ఐదారు రోజులైతంది. ఇపుడు 570 ఫీట్ల బోరుతోనే ఐదెకరాల పొలం పారిస్తున్న. మా ఊరి చెరువుకు కాళేశ్వరం నీళ్లచ్చిన కారణంగానే మా బోర్లకి నీళ్లచ్చినయ్. నీళ్లు తెప్పించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు ధన్యవాదాలు. ఇక నుంచి ఎప్పటికీ నీళ్లస్తయట. సంతోషంగా ఉంది. అని అంటున్నాడు కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామానికి చెందిన మొగిపాలెం వేణు. ఇది ఒక్క వేణు సంతోషమే కాదు.. నాగుల మల్యాల, బావుపేట, బద్దిపల్లి, కమన్‌పూర్, కొండాపూర్ గ్రామాలకు చెందిన ప్రతి రైతు ఆనందం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా జిల్లాలోని నాగుల మల్యాల కొచ్చెరువులోకి నీళ్లు వస్తున్నాయి. పదిహేనేండ్ల తమ నీటి కష్టాలు తీరుతున్నాయని ఈ గ్రామాల రైతులు సంబురాలు చేసుకుంటున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మొదటి ఫలితం కరీంనగర్ జిల్లాకే ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పదే పదే చెప్పేవారు. ఆయన అన్నట్లుగానే కాళేశ్వరం జలాలు మొదటిసారిగా జిల్లాలోని కొత్తపల్లి మండలం నాగులమల్యాల కొచ్చెరువులోకి తరలివచ్చాయి. ఇది కలా.. నిజమా అని ఈ ప్రాంత రైతులు తేరుకునేలోపే చెరువు క్రమంగా నిండుతోంది. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్ నుంచి వదలకాలువ ద్వారా శ్రీరాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు)కు తరలుతున్న జలాలు ఇంతకు ముందే గంగాధర మండలం ఆచంపల్లి వద్ద ఏర్పాటు చేసిన తూము నుంచి ఫీడర్ ఛానల్ ద్వారా కొచ్చెరువుకు చేరుతున్నాయి. ఈ నెల 16న కరీంనగర్, చొప్పదండి ఎమ్మెల్యేలు ఈ తూమును ప్రారంభించగా, 45 మిలియన్ క్యూబిక్ పీట్ల (ఎంసీఎఫ్‌టీ) సామర్ధ్యంగల ఈ చెరువులోకి ఇప్పటికే 40 శాతం చేరుకున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి సామర్ధ్యం మేరకు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి గొలుసుకట్ట చెరువులుగా ఉన్న కొండాపూర్‌లోని కుడుప కుంట, బావుపేటలోని బావు చెరువు, ఎలగందులలోని పెద్దచెరువు, అలాగే కొండాపూర్‌లోని కొడుపకుంట నుంచి బద్దిపల్లి పెద్దచెరువు, అక్కడి నుంచి కమాన్‌పూర్‌లోని మరో పెద్ద చెరువుకు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గొలుసు కట్టు చెరువులకు నీరు వెళ్లే మార్గాల్లోని చెట్లు, ముళ్ల పొదలను తొలగిస్తున్నారు.

తీరనున్న 15 ఏండ్ల కష్టాలు..
మధ్యమానేరు రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు 2004 ప్రాంతంలో ఎప్పుడైతే వరద కాలువ నిర్మాణం పూర్తయ్యిందో కొత్తపల్లి మండలం నాగులమల్యాల, కొండాపూర్, బావుపేట, బద్దిపల్లి, కమాన్‌పూర్, ఎలగందుల గ్రామాల పరిధిలో ఉన్న గొలుసుకట్టు చెరువుల్లోకి వరకు అడ్డుకట్ట పడింది. గంగాధర మండలం ఆచంపల్లి పరిధిలోని కాట్రేనికుంట నిండి ఈ చెరువుల్లోకి నీళ్లు వచ్చేవి. వరదకాలువ నిర్మాణంలో కాట్రేని కుంట కనుమరుగై పోయింది. దీంతో ఈ గ్రామాల పరిధిలోని చెరువుల్లోకి నీళ్లు రావడం ఆగిపోయింది. సరిగ్గా పదిహేనేండ్ల కింద రైతులకు సాగునీటి సమస్య మొదలైంది. బావులు, బోర్లు ఎండి పోయాయి. 700 నుంచి వెయ్యి అంతకంటే ఎక్కువ ఫీట్ల బోర్లు వేసినా ఊట జాడ లేని పరిస్థితి. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పనులు వెతుక్కోసాగారు. సారవంతమైన భూములు వదిలి అనేక మంది రైతులు కూలీలుగా మారి స్థానిక గ్రానైట్ కంపెనీల్లో రోజుకు రూ.250, రూ.300లకు కూలీకి వెళ్లేవారు. ఇక్కడ ఉపాధి దొరకని పరిస్థితుల్లో కరీంనగర్‌కు వచ్చి భవన నిర్మాణ పనుల్లో కూలీ చేసుకుని బతుకులు వెళ్లదీస్తున్నారు. ఈ ఆరు గ్రామాల రైతుల్లో చాలా మంది ముంబయి, దుబాయ్‌కు వెళ్లి కుటుంబాలను పోషిస్తున్నారు. గతంలో రెండు మూడు పంటలు తీసుకున్న భూముల్లో ఒక్క పంట పండడం కూడా కష్టమైపోయింది. వర్షాధారంగా వేసుకునే పంటలు చేతికి వచ్చే వరకు నమ్మకం ఉండేది కాదు. ఐదారెకరాలున్న రైతులు ఒకట్రెండు ఎకరాలు సాగు చేసినా అప్పులే మిగిలేవి. ఒక్క సాగు నీటికే కాకుండా ఈ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి తాగు నీటికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ చెరువుల్లోకి తరలి వస్తున్న కాళేశ్వరం జలాలను చూసి ఈ గ్రామాల రైతులు మురిసి పోతున్నారు. నీళ్లొస్తున్నాయని తెలిసి వలస బాటలు పట్టి రైతులు ఇంటి బాట పడుతున్నారు. ముంబాయి, దుబాయిలో ఉండే రైతులు ఇక్కడి తమ వాళ్లకు ఫోన్లు చేసి తెలుసుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరో భగీరథుడిగా గంగుల..
కొత్తపల్లి మండలంలో ఇన్నాళ్లూ నీటి ఎద్దడిని ఎదుర్కొన్న ఆ ఆరు గ్రామాల్లో ఇపుడు ఏ రైతు నోట విన్నా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నామస్మరణే వినిపిస్తోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆశయాలకు అనుగుణంగా తమ గ్రామాల కోసం ఆయన భగీరథ ప్రయత్నం చేసి నీళ్లు తెప్పించారని ఈ గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎందరో ఎమ్మెల్యేలు వచ్చి పోయారనీ, తమ బాధలు వినేవారు కాదనీ, అదే ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమ గ్రామాల నీటి కష్టాలను తీర్చేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయకుండా ముందుకు వెళ్లి, ప్రభుత్వాన్ని ఒప్పించి, వరదకాలువకు తూము ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఫీడర్ ఛానల్ తవ్విచారని చెబుతున్నారు. తమకు ఈ పథకాన్ని మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేను ఎప్పటికీ మర్చి పోమని చెబుతున్నారు. పది హేనేండ్లుగా ఈ గ్రామాల రైతులు పడుతున్న నీటి కష్టాలను తీర్చేందుకు ఎమ్మెల్యే గంగుల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేకసార్లు ఇచ్చిన విజ్ఞప్తులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు సరికదా తిరస్కరించింది. తెలంగాణ వచ్చిన తర్వాత పట్టు వీడని విక్రమార్కుడిలా మళ్లీ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అందించి ఫీడర్ చానల్ నిర్మాణానికి రూ.2 కోట్ల 64 లక్షల 60 వేలు మంజూరు చేయించారు. ఆచంపల్లి నుంచి ఫీడర్ ఛానల్ తవ్వేందుకు 7.06 ఎకరాల భూ సేకరణకు రూ.92 లక్షలు మంజూరు చేయించారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన రైతుల వద్దకు స్వయంగా వెళ్లి వారిని ఒప్పించి ఫీడర్ చానల్ నిర్మాణం పూర్తి చేయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కాగానే దీని ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. ఆరు గొలుసు కట్టు చెరువుల పరిధిలోని వందలాది ఎకరాల ఆయకట్టుకు నీరందడమే కాకుండా తమ గ్రామాల పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల పరిధిలో భూగర్భ జలాలు వృద్ధి చెంది ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రెండేండ్లు పంటలు పండుతయ్.. (ఫొటో నం. 1634)
కొచ్చెరువులకు ఒక్కసారి నీళ్లస్తే రెండేండ్లు పంటలు పండించుకోవచ్చు. ఇపుడు నీళ్లు రావట్టి ఐదు రోజులైతంది. ఇప్పుడే బావులు ఉబ్బినయ్. పదిహేనేండ్ల కింద సాలీన మూడు పంటలు తీసుకునేటోళ్లం. ఇప్పుడు అట్లనే పంటలు తీసుకుంటమన్న ఆశైతే కనిపిస్తున్నది. నీళ్లు చెరువుల్లకు వచ్చినయంటే అదీ మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దయతోనే.. ఆయన చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోం
- కుంట అంజయ్య, కొండాపూర్

మా కష్టాల ఇక తీరినట్లే బిడ్డా.. (ఫొటో నం. 1639)
కొచ్చెరువులకు నీళ్లొస్తే కొత్తకు చిప్పెడు గంజి దొరుకుద్దని ఎన్కటికి సామెత ఉండేది. ఈ పదిహేనేండ్లు నీళ్ల కోసం అష్టకష్టాలు పడ్డం. ఇపుడు కొచ్చెరువులకు నీళ్లస్తన్నయ్. ఇక మా ఊరి సామెత నిజమైతది. గతంల మా కష్టాలు ఒక్కలు పట్టించుకోలే. ఎమ్మెల్యే గంగుల లేకుంటే ఈ నీళ్లచ్చేటియి కాదు. గతంల యాసంగి, అసినికార్తి పంటలకు నీళ్లు వాడుకునేటోళ్లం. ఇపుడు అట్లనే చేసుకుంటం. చాలా సంతోషంగ ఉంది.
- బోయిని శంకరయ్య, నాగులమల్యాల

ఆచంపల్లి రైతులను మెప్పించిండు.. (ఫొటో నం. 1653)
మా ఊరి మీదున్న ఆచంపల్లి రైతులు భూములు ఇవ్వమంటే మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒప్పించిండు. ఒక్కో ఎకరానికి పదిన్నర లచ్చలు ఇప్పించిండు. చాన సార్లు మాతోని, ఆచంపల్లి రైతులతోని మీటింగు పెట్టి అందరినీ ఒప్పించిండు. ఆచంపల్లి కాడ వరదకాలువ తవ్వినంక మా ఊళ్లకు వరద వచ్చుడు నిలిచి పోయింది. ఇపుడు నీళ్గొస్లున్నయి. ఎంతో సంతోషంగా ఉన్నది.
- కట్ల అంజయ్య, నాగులమల్యాల

మా ఊరికీ నీళ్లొస్తయ్.. (ఫొటో నం. 1654)
నాగులమల్యాల కొచ్చెరువులోని నీళ్లొచ్చినయంటే ఇక మా ఊరికి కూడా నీళ్లస్తయన్న ఆశ మొదలైంది. ఈ చెరువు నిండిన తర్వాత కొండాపూర్‌లోని కుడుపుకుంట, బావుపేటలోని బావుకుంట నుంచి మా ఊరి పెద్ద చెరువులోకి నీళ్లొస్తయ్. 15 ఏండ్లయితంది మా చెరువులకు చుక్క నీరు రాక. ఇపుడు ఈ చెరువు కిందనే నేను చెప్పిన చెరువులన్నీ ఉంటయ్. ఈ ఒక్క చెరువు నిండినా మా ఊరికి నీళ్లస్తయ్. ఇదంతా ఎమ్మెల్యే కృషితోనే సాధ్యమైంది.
- ఎనుపోతుల మల్లేశం, ఎలగందుల

దుబాయ్ నుంచి ఫోన్లు వస్తున్నయ్.. (ఫొటో నం. 1655)
మా ఊర్లకు నీళ్లు రాక 15 ఏండ్లు అయితంది. బతుకుదెరువు లేక ఈ ఊర్లలోని రైతులు ఎక్కడెక్కడికో వలసవెళ్లిన్రు. ఇపుడు దుబాయ్, ముంబాయ్ నుంచి ఫోన్లు వస్తున్నయ్. నీళ్లస్తున్నయని తెలవంగనే ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుంటమనే ఆశ పుడుతుందంటున్నరు.. చాలా మంది ఇండ్లకు తిరిగి వస్తున్నరు. నిజం చెప్పాలంటే మా ఎమ్మెల్యే గంగుల లేకుంటే ఇదంతా అయ్యేది కాదు. ఆయన మేలు ఎప్పటికీ మర్చి పోం.
- బోనాల సురేందర్, కమాన్‌పూర్

అందరికీ బతుకుదెరువు (ఫొటో నం. 1669)
చెరువు నిండితే ఒక్క రైతులకే కాదు. ప్రతొక్కలకు బతుకుదెరువు ఉంటది. పంటలు పండితే బతుకులు బాగుపడుతయ్. కూలి పని చేసుకునెటోళ్లు ఎక్కడికో పోయి పని చేసుకునే కష్టం తప్పుది. ఊళ్లెనే పని దొరుకుతది. గొడ్డూ గోదకు నీళ్లు దొరుకుతయ్. ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ మర్సిపోయి మంచి మంచి పంటలేసుకుంటం. ఇప్పటిదాకా 700 నుంచి వెయ్యి ఫీట్లు కొట్టినా బోర్లళ్ల నీళ్లు రాకుండే. ఇపుడు అవన్నీ పనిచేస్తయ్..
- బుర్ర మల్లయ్య, కొండాపూర్

ఎమ్మెల్యే కృషితోనే నీళ్లు (ఫొటో నం. 1234)
మా ఎమ్మెల్యే గంగుల కృషితోనే మా ఊరికి కాళేశ్వరం నీళ్లొచ్చినయ్. 15 ఏండ్ల నుంచి కొచ్చెరువులో నీటి చుక్క లేదు. ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులకు పడ్డరు. ఏటేటా మా పంట పొలాలు ఎండిపోయినయ్. మా ఎమ్మెల్యే కృషితోని ఇపుడు మా ఊళ్లో కాళేశ్వరం నీళ్లు చూస్తున్నం. చాలా సంతోషంగా ఉంది. మా చిరకాల వాంఛ తీర్చిన ఎమ్మెల్యేకు జన్మంతా రుణపడి ఉంటం.
- గోదల రంజిత్‌కుమార్, నాగులమల్యాల

నా చిరకాల వాంఛ నెరవేరుతోంది..
కొత్తపల్లి మండలంలోని సగానికంటే ఎక్కువ గ్రామాలు అవి. పదిహేనేండ్ల నుంచి సాగు, తాగు నీటికి పడరాని పాట్లు పడ్డారు. ఆచంపల్లి నుంచి వచ్చే వరదకు అడ్డంగా ఎపుడైతే వరదకాలువ నిర్మించారో అప్పటి నుంచి నాగులమల్యాల, కొండాపూర్, బద్దిపల్లి, కమాన్‌పూర్, బావుపేట, ఎలగందుల గ్రామాల గొలుసుకట్టు చెరువులకు వరద రావడం ఆగిపోయింది. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. నేనెపుడూ ఈ గ్రామాల్లోకి వెళ్లినా ప్రతి ఒక్కరూ ఒక్కటే విషయం చెప్పెవాళ్లు. మాకు నీళ్లు తెప్పించండి సారు అని. వాళ్లు పడుతున్న బాధలు కండ్లారా చూసిన. ఈ గ్రామాలకు నీళ్లు తేవడం నా చిరకాల వాంఛగా పెట్టుకున్న. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే ప్రయత్నం ప్రారంభించిన. అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పైగా తిరస్కరించాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ప్రయత్నించాను. సీఎం కేసీఆర్‌ను, మంత్రులను కలిసి అనేక విజ్ఞప్తులు చేశా. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలిపాను. నిధులు మంజూరు చేసిన తర్వాత త్వరితగతిన పనులు పూర్తి చేయించాం. ఇపుడు నాగుల మల్యాల చెరువులోకి మొట్ట మొదటిసారిగా కాళేశ్వరం జలాలు వస్తున్నాయి. ప్రాజెక్టు ఫలితాన్ని మొదటి సారి మనమే అనుభవిస్తున్నాం. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. నాగులమల్యాల చెరువు నిండగానే కొండాపూర్ కుడుపుకుంటకు అక్కడి నుంచి ఎడమవైపు ఉన్న బద్దిపల్లి, అక్కడి నుంచి కమాన్‌పూర్‌కు నీళ్లు తరలిస్తాం. కుడివైపు నుంచి బావుపేటకు అక్కడి నుంచి ఎలగందులకు నీళ్లు తరలిస్తాం. నా చిరకాల వాంఛ తీరుతోంది.
- గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే

137
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles