మున్సి‘పోల్స్‌'పై ఉత్కంఠ

Mon,July 15, 2019 12:56 AM

- రోజు రోజుకూ మారుతున్న షెడ్యూల్‌
- 16న తుది ఓటరు జాబితా
- అదేరోజు ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల ప్రకటన
- 21న తుది జాబితా
కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ రోజు రోజుకూ మారుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నగరపాలక, పురపాలక సంస్థల్లో డివిజన్లు, వార్డుల విభజన పూర్తి కాగా, ప్రస్తుతం ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఓటరు జాబితాతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటరు తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం తుది ఓటరు జాబితా వెల్లడించాల్సి ఉండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి ఈ షెడ్యూల్‌ను మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ చట్టం చేసేందుకు ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్‌ కేటాయింపులు ఎలా ఉంటాయన్న విషయంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

మారిన షెడ్యూల్‌
నగరపాలక, పురపాలక సంస్థల్లో ఈ నెల 14న తుది ఓటరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటరు జాబితా ప్రకటించాల్సి ఉంది. అయితే పలు మున్సిపాలిటీల్లో ఇప్పటికీ లెక్కలు పూర్తి కాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి ఈ జాబితా ప్రకటనకు సంబంధించి షెడ్యూల్‌ను పొడగిస్తూ అవకాశం కల్పించింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 16న తుది ఓటరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటరు జాబితా ప్రకటించనున్నారు. దీంతోపాటు పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు విషయంలోనూ మార్పులు చేశారు. గతంలో ఈనెల 19న తుది పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పూర్తి చేయాల్సి ఉంది. కానీ మారిన తేదీల ప్రకారం ఈ నెల 16న ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితా విడుదల చేయనున్నారు. ఈ నెల 17న సాయంత్రం 3 గంటలకు ఆయా మున్సిపల్‌ పరిధిలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి, ఈ నెల 19న తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాను సిద్ధం చేసి జిల్లా ఎన్నికల అధికారికి అప్పగించాలి. ఈ నెల 21న జిల్లా ఎన్నికల అధికారి అనుమతితో తుది జాబితా ప్రకటిస్తారు.

రిజర్వేషన్లపై జోరుగా చర్చలు
కాగా, ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లపైనే జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని నగరపాలక, పురపాలక సంస్థల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించడంతో ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీ ఓటర్లను అనుసరించి ఏయే డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్న విషయంలో ఆశావహులు అంచనాలు వేస్తున్నారు. తమకు ఏ డివిజన్‌లో అవకాశం ఉంటుందన్న విషయంలో లెక్కలు వేసుకొని ముందుగానే ప్రచారాలకు దిగుతున్నారు. తాము ఉన్న డివిజన్‌ రిజర్వేషన్‌ ప్రకారం అనుకూలించకపోతే పక్క డివిజన్లు, వార్డుల నుంచి పోటీ చేసేందుకు కూడా ఔత్సాహికులు తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఎవరికి వారు లెక్కలు వేసి పలానా డివిజన్లు, వార్డులు రిజర్వేషన్లు ఖరారు అయినట్లుగా జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles