మేలైన రకాలతో అధిక దిగుబడి

Thu,July 11, 2019 01:48 AM

జగిత్యాల టౌన్: సమయానుకూలంగా మేలైన రకాలను ఎంచుకొంటే అధిక దిగుబడులు పొందవచ్చని పొలాస పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్ ఉమారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిశోధన స్థానంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో వర్షాలు నెల ఆలస్యంగా రావడంతో రైతులు జూలై 15 తర్వాత తెలంగాణ సోనా వరి నార్లు పోసుకోవాలన్నారు. వర్షాధార పరిస్థితుల్లో తేలిక పాటి నేలల్లో పత్తి, సోయా విత్తకూడదన్నారు. పంట విత్తిన వెంటనే కలుపు మందు పిచికారి చేసి 25 నుంచి 30 రోజుల వరకు కలుపును నివారించుకోవాలన్నారు. మధ్యస్థ కాలిక రకాలైన జగిత్యాల మషూరి, ప్రాణహిత, కరీంనగర్ సాంబా, మాసేర్ సోనా, పొలాస ప్రభ, విజేత రకాలను జూలై 15 వరకు, స్వల్ప కాలిక రకాలైన బతుకమ్మ, కూనారం సన్నాలు, తెలంగాణ సోనా, కాటన్‌దొర సన్నాలు, తెల్ల హంస, అంజన, జగిత్యాల సన్నాల రకాలను జూలై 30 నుంచి ఆగస్టు వరకు విత్తుకోవచ్చన్నారు. విత్తిన తర్వాత నారుమడిలో బ్యూటాక్లోర్ 50 మిల్లీలీటర్లు లేదా ప్రిటిలాక్లోర్, సీఫ్‌నర్ 25 మిల్లీలీటర్లు కలుపు మందు ను పిచికారి చేయాలన్నారు. మక్కజొన్నను ఎకరానికి 8 కిలోల చొప్పున జూలై 15 వరకు విత్తుకోవచ్చనీ, కాప్టాన్ లేదా మాంకోజెబ్, థైరం 3 గ్రాములు కేజీ విత్తనంతో విత్తన శుద్ధి చేసుకుంటే దిగుబడిని పెంచుకోవచ్చన్నారు.

నేల తేమగా ఉంటే పంట విత్తిన 24 నుంచి 48 గంటల్లో ఎకరాకు 1 నుంచి 1.5 కిలోల అట్రాజిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. సోయా రకాలైన జేఎస్ 335, ఏఎస్‌బీ 22, ఎల్‌ఎస్‌బీ 19 రకాలను ఎకరాకు 25 నుంచి 35 కిలోల చొప్పు న ఈ నెల 15 వరకు విత్తుకోవాలన్నారు. ఈ రకానికి థైరం 2.0 గ్రాములు, కార్భెండజిమ్, 1.0 గ్రాముల కేజీ లేదా థైరం లేదా కాప్టాన్ 3.0 గ్రాములు ఒక లీటరు నీటితో కలిపి కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలన్నారు. పెండిమిథాలిన్ 30 శాతం ఎకరాకు 1.2 లీటర్లు 200లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే మరుసటి రోజుగాని పిచికారి చే యాలన్నారు. పెసర, మినుములతో పాటు కందు ల రకాలైన ఎల్‌ఆర్‌జి 41, ఐసీపీఎల్ 85063, ఐసీపీఎల్ 87119, ఐసీపీఎల్ 8863, డబ్ల్యూఆర్‌జీ 27, పీఆర్‌జీ 158, ఎంఆర్‌జీ 1004, డబ్ల్యూఆర్‌జీ 53, ఆర్‌జీటీ 1, డబ్ల్యూర్‌జీ 65, టీడీఆర్‌జీ 4, పీఆర్‌జీ 176, ఐసీపీహెచ్ 2740 రకాలను ఈ నెల 15వరకు విత్తుకొని పిండిమిథాలిన్ 30 శాతం ఎకరాకు 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గానీ, లేదంటే మరుసటి రోజు గాని పిచికారి చేయడం ద్వారా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చని రైతులకు సూచించారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles