13న జాతీయ లోక్ అదాలత్

Fri,July 5, 2019 03:16 AM

-న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి మాధవికృష్ణ
కరీంనగర్ లీగల్ : రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కరీంనగర్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి మాధవికృష్ణ తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో 28,945 కేసులు జూన్ 29 నాటికి పెండింగ్‌లో ఉన్నాయనీ, ఇందులో రాజీకి ఆమోదం అయిన 1,471 కేసులను గుర్తించామని పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, మోటార్ వాహన చట్టం నష్ట పరిహార కేసులను ఇరువర్గాల సమన్వయంతో పరిష్కరించి, వెంటనే తీర్పు వెల్లడిస్తామన్నారు. కోర్టులో దాఖలు కాకుండా నేరుగా న్యాయసేవా అధికార సంస్థలో దాఖలైన ప్రీలిటిగేషన్ 686 కేసులు కూడా లోక్ అదాలత్‌లో ఇరువర్గాల సమక్షంలో పరిష్కరిస్తామని వివరించారు. రాజీకి నమోదైన అన్ని కేసుల్లో కక్షిదారులకు న్యాయసేవాధికార సంస్థ తరుపున నోటీసులు జారీ చేశామన్నారు. గత లోక్ అదాలత్‌లో 1,339 కేసులు గుర్తించగా 1753 కేసులు పరిష్కరించి రాష్ట్రస్థాయిలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. మోటార్ వాహనాల చట్టం కింద సుమారు 50కి పైగా కేసులు పరిష్కరించగా, రూ.2.36 కోట్ల నష్ట పరిహారం కక్షిదారులకు అందేలా చేశామన్నారు. కాగా, ఈ నెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ గురించి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు, బీమా సంస్థల అధికారులతో వేర్వేరుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి సమావేశాలు నిర్వహించారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles