ప్రజా సేవకులకే గుర్తింపు

Thu,July 4, 2019 04:52 AM

- పదవులు శాశ్వాతం కాదు
- నిజమైన నాయకులకు విరామం లేదు
- ప్రజలను నమ్ముకున్నోళ్లు ఏనాటికి చెడిపోరు
- తుల ఉమ అధ్యక్ష పదవి గౌరవం పెంచారు
- ఉమ్మడి జడ్పీ వీడ్కోలు సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్
- జడ్పీ అధ్యక్షురాలు ఉమ, సభ్యులు, ఎంపీపీలకు ఘన సన్మానం

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పదవులు శాశ్వతం కాదనీ, ప్రజాసేవ చేసిన వారికే గుర్తింపు ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి స్పష్టం చేశారు. నిజమైన నాయకుడికి విరామం ఉండదనీ, వారు నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ధర్మాన్ని, న్యాయాన్ని, శ్రమను, ప్రజలను నమ్ముకున్న నాయకులకు ఏనాటికీ చెడిపోరని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులకు విరమణ ఉండదనీ, ప్రజాప్రతినిధులుగా కాకుండా నాయకులుగా ప్రజలకు నిత్యం సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. బుధవారం ఉమ్మడి జడ్పీలో జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమతోపాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఘనంగా సన్మానించారు. వారితో కలిసి గ్రూపు ఫొటోలు దిగారు. అనంతరం మంత్రి మాట్లాడారు. నాయకులకు పదవి అనేది అలంకారం, హోదా కాదనీ, అది బాధ్యత అని పేర్కొన్నారు. జడ్పీ సభలు మీ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచాయని సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. అనేక ప్రజా సమస్యలను పరిష్కరించగలిగారని ప్రశంసించారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో సమస్యలు నెలకొని ఉండేవనీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు ఒక్కొక్కటీ పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. గతంలో ఏగ్రామానికి వెళ్లినా సమస్యలు చెప్పుకోనివారు ఉండేవారు కాదన్నారు.

ప్రస్తుతం స్థానిక సంస్థలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు అధికారంలోకి రావడం వల్ల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయనే నమ్మకం తనకుందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులుగా గెలవడం పెద్ద పనికాదనీ, వార్డు సభ్యులుగా గెలవడం గొప్పని మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వార్డు సభ్యులకు సమస్యలపై అవగాహన ఉన్నంత మరే ప్రజాప్రతినిధికి ఉండదన్నారు. వార్డు సభ్యులు సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గ్రామాలు కుంటుపడుతాయని తెలిపారు. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలవగానే కొందరి దృక్పథం పూర్తిగా మారిపోతుందన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు జడ్పీలో అనేక సమస్యలు ప్రస్తావించే వాడిననీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా సమస్యలను పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. నాయకులుగా ప్రజా సమస్యలను పట్టించుకోవాలని కోరారు. అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులనే తేడా లేకుండా పాలన చేస్తున్నామని పేర్కొన్నారు. ఏ నాయకుడికి ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో తెలియదనీ, అందుకే నాయకులనే వారు నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ భిక్షతో తనలాంటి ఎందరో రాజకీయాల్లోకి వచ్చారనీ, గొప్పగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జడ్పీని ఐదేళ్లపాటు గొప్పగా పాలించారనీ, అందరి ఆమోదం, ప్రేమాభిమానాలను పొందిన అధ్యక్షురాలు తుల ఉమ ఆ పదవి గౌరవాన్ని పెంచారని ప్రశంసించారు. ఉమకు ఇంతకన్నా ప్రాముఖ్యతగల పదవి రావొచ్చనీ, ఆమె సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నారని పేర్కొన్నారు. మంచి ఆలోచనలు ఆచరణ పెట్టే వారే స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు అవుతారనీ, తెలంగాణలో పేదలకు మంచి ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం జరుగుతోందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

స్థానిక సమస్యలకు పరిష్కారం: ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
స్థానిక సంస్థల సమస్యలను సాధ్యమైనంత వరకు ప్రభుత్వం పరిష్కరిస్తోందని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జీ రాజేశంగౌడ్ పేర్కొన్నారు. 2014-2019 కాలంలో జడ్పీలకు ప్రాతినిధ్యం వహించిన ప్రజా ప్రతినిధులంతా చరిత్రలో నిలిచి పోతారన్నారు. కరీంనగర్ జడ్పీకి చారిత్రక నేపథ్యం ఉన్నదనీ, ప్రధాని స్థాయికి ఎదిగిన పీవీ నరసింహారావు, సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ కూడా ఒకప్పుడు ఎమ్మెల్యే, ఎంపీలుగా ఈ జడ్పీలో గౌరవ సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు. జడ్పీ అధ్యక్షులుగా పనిచేసిన ఎందరో రాష్ట్ర రాజకీయాల్లో రాణించారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకు నిధులు వరదలా వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

చెరగని ముద్ర వేశాం : జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ
జడ్పీలో నిధులు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యులమై ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశామని తెలిపారు. జడ్పీలో సభ్యులందరం ఒక కుటుంబంలా వ్యవహరించామనీ, అధికార, ప్రతిపక్ష పార్టీలనే తారతమ్యాన్ని ఏనాడు చూపలేదని స్పష్టం చేశారు. జడ్పీ ఉద్యోగులు కూడా తమ పాలక వర్గానికి ఎంతగానో సహకారాన్ని అందించారని తెలిపారు. ఒక ఉద్యమకారిణిగా ఉన్న తాను జడ్పీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత సంశయం ఉన్నా అందరి సహకారంతో ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా ముగించడం సంతోషంగా ఉందన్నారు. కాగా, ఐదు వసంతాలు.. అభివృద్ధికి అద్దం పేరుతో ముద్రించిన జడ్పీ ఐదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి ఈటల రాజేందర్, తదితరులు ఆవిష్కరించారు. పుస్తకానికి వ్యాసాలు అందించిన రచయితలను కూడా మంత్రి, జడ్పీ అధక్షురాలు ఉమ ఘనంగా సన్మానించారు.. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో డీ వెంకటమాధవ రావు, డిప్యూటీ సీఈవో గౌతంరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ ఉద్యోగులు పాల్గొన్నారు.

98
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles