దవాఖానాల బంద్‌ ప్రశాంతం

Tue,June 18, 2019 01:26 AM

కరీంనగర్‌ హెల్త్‌ : వైద్యులు, దవాఖానలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు బంద్‌ పాటించాయి. ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేశాయి. కేవలం అత్యవసర వైద్య సేవలను మాత్రమే కొనసాగించాయి. జిల్లావ్యాప్తంగా దవాఖానల బంద్‌ సంపూర్ణంగా జరిగినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్‌లో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ బీఎన్‌ రావు, తెలంగాణ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సాగర్‌రావు, తెలంగాణ ఫిజీషియన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీసీ తిరుపతిరావు, కరీంనగర్‌ బ్రాంచ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పోలాడి శ్రీనివాస్‌రావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నేషనల్‌ కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఇంతపెద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఇదే ప్రథమమన్నారు. వైద్యులపై దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. వైద్యులపై దాడులు చేస్తే సామాన్య ప్రజలే నష్టపోతారన్నారు. దేశంలోనే దవాఖానాలు, వైద్యులపై దాడులు చేస్తే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత మన రాష్ర్టానిదేనన్నారు.

ఇలాంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. తానా రాష్ట్ర అధ్యక్షుడు సాగర్‌రావు మాట్లాడుతూ దాడులను అరికట్టే ప్రత్యేకమైన చట్టాలను తీసుకువస్తేనే వైద్యం చేసే పరిస్థితి నెలకొందన్నారు. డాక్టర్‌ తిరుపతిరావు మాట్లాడుతూ కొన్ని కారణాలతో రోగులు మృత్యువాత పడుతుంటే దానికి వైద్యులను బాధ్యులు చేస్తూ దాడులు చేయడం దారుణమన్నారు. పొలాడి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ వైద్యం చేయాలంటేనే ఆందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై దాడులు జరుగకుండా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలనీ, అప్పుడే నిర్భయంగా వైద్యం అందించవచ్చన్నారు. ఈ పార్లమెంట్‌లో వెంటనే ఈ చట్టాన్ని అమోదించాలన్నారు. డాక్టర్‌ అలీం మాట్లాడుతూ దవాఖానాల్లో సురక్షితమైన వాతవారణాన్ని కల్పించేదిశగా కేంద్రం కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. డాక్టర్‌ విజయలక్ష్మీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం చేయలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు వైద్యం అందకపోవడంతో పాటు ఆర్ధికభారం పడుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి మెడికల్‌ రిప్స్‌ అసోసియేషన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ అసోసియేషన్‌, డెంటల్‌ డాక్టర్లు సంఘీభావం ప్రకటించారు. ఈ సమావేశంలో రఘురామన్‌, విజయమోహన్‌రెడ్డి, ఎనమల్ల నరేశ్‌, బంగారి స్వామి, వెంకట్‌రెడ్డి, శ్రీలతారెడ్డి, వెంకటేశ్వర్లు, త్రినాధరెడ్డి, బాస శ్రీనివాస్‌, శశికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles