భూమి పట్టా చేయడం లేదని రైతు ఆమరణ నిరాహార దీక్ష

Sat,June 15, 2019 02:37 AM

శంకరపట్నం: తమ వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు పట్టా చేయడం లేదని శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన కొక్కిస స్వామి గురువారం తాసిల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. దీక్ష చేపట్టిన వెంటనే అధికారులు అతడిని సముదాయించి విరమింపజేశారు. ఆముదాలపల్లి శివారులోని 55, 430, 449 సర్వే నంబర్లలో తన తండ్రి కొక్కిస పోచయ్య పేరున 2.35 ఎకరాలు వ్యవసాయ భూమి ఉందని స్వామి తెలిపాడు. ఇందుకు సంబంధించిన పాసు పుస్తకాలు ఉన్నాయనీ, తమ భూమిని ఆన్‌లైన్‌ చేసి పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఈ విషయమై గతంలో పలువురు వీఆర్వోలు, తాసిల్దార్లకు లంచాలు కూడా ఇచ్చినట్లు తెలిపాడు. ఇక ఓపిక నశించి తన తండ్రి పోచయ్యతో వచ్చి ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు వెల్లడించాడు. అయితే, అతడు దీక్ష చేపట్టిన కొద్దిసేపటికే అధికారులు గిర్దావర్‌ శ్రీనివాస్‌, నాయబ్‌ తాసిల్దార్‌ నాగార్జున వెళ్లి అతడిని సముదాయించారు. శనివారం మోఖా మీదకు వచ్చి పరిశీలించి, చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతు పోచయ్య వద్ద సరైన ఆధారాలు లేకనే అతడి పేరున భూమి పట్టా చేయలేకపోయామని నాయబ్‌ తాసిల్దార్‌ నాగార్జున, వీఆర్వో విజయ్‌కుమార్‌ తెలిపారు. సదరు రైతు ఇంత వరకు మోఖా మీద లేడనీ, ఆ సర్వే నంబర్లలోని కొంత భాగం కోర్టు వివాదంలో ఉందని వారు వెల్లడించారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles