అరవైయేళ్ల అనుబంధం

Wed,June 12, 2019 01:31 AM

-విడిపోతున్న ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్
-ఆరు దశాబ్దాల్లో 14 మంది అధ్యక్షుల ప్రాతినిధ్యం
-మొదటి అధ్యక్షుడిగా జే చొక్కారావు
-చివరి అధ్యక్షురాలిగా తుల ఉమ
-నేడు ఉమ్మడి జిల్లా ఆఖరి సమావేశం
-హాజరుకానున్న మంత్రులు ఎర్రబెల్లి, ఈటల, కొప్పుల
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:అనేక ప్రత్యేకతలతో పెనవేసుకున్న ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ ఇక విడిపోనున్నది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో జడ్పీ విభజన కూడా అనివార్యమైంది. ఎందరో రాజకీయ ఉద్దండులను అందించిన ఈ స్థానిక సంస్థ ఇప్పుడు నాలుగు జడ్పీలుగా విస్తరించబడింది. 1959లో ఏర్పడిన ఈ జడ్పీ 60 ఏండ్లపాటు సేవలందించింది. ప్రస్తుతం సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లిలో జిల్లా ప్రజా పరిషత్‌లు ఏర్పడబోతుండడం.. ఇప్పటికే ఎన్నికైన కొత్త పాలక వర్గాలు జూలై మొదటి వారంలో కొలువుదీరబోతున్న నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షురాలు తుల ఉమ అధ్యక్షతన బుధవారం ఆఖరి ఉమ్మడి జిల్లా జడ్పీ సమావేశం జరగనున్నది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ హాజరుకానుండగా, ఈ చివరి సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది.


కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్‌కు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. జడ్పీకి ప్రాతినిథ్యం వహించిన ఎందరో రాష్ట్రస్థాయి రాజకీయాల్లో రాణించారు. దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. 1959లో ఏర్పడిన జడ్పీకి మొదటి అధ్యక్షులుగా జువ్వాడి చొక్కారావు ఎన్నికయ్యారు. 1959 నుంచి 1962 వరకు తిరిగి 1964 నుంచి 1967 వరకు ఆయన రెండు పర్యాయాలు జడ్పీకి ప్రాతినిథ్యం వహించారు. కరీంనగర్ జడ్పీకి రెండు సార్లు ఎన్నికైన ఏకైక నాయకుడు ఈయనే. చొక్కారావు పలు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికై రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. అలాగే 1983 నుంచి 1986 వరకు జడ్పీ అధ్యక్షులుగా పనిచేసిన కేతిరి సాయిరెడ్డి 1989లో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1987 నుంచి 1992 వరకు జడ్పీ చైర్మన్‌గా పని చేసిన సుద్దాల దేవయ్య అనంతరం నేరెళ్ల శాసనసభ్యుడిగా పలుసార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన చొప్పదండి ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. 2006 నుంచి 2009 వరకు జడ్పీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆరెపల్లి మోహన్ అనంతరం మానకొండూర్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 1985లో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన జీ రాజేశం గౌడ్ 1995లో జడ్పీ అధ్యక్షులుగా ఎన్నికై 2000 వరకు పని చేశారు. ఇలా కరీంనగర్ జడ్పీకి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు.

-గ్రామీణాభివృద్ధిలో కీలకం
కరీంనగర్ జడ్పీకి హేమాహేమీలు ప్రాతినిథ్యం వహించారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించి మంచి పేరు తెచ్చుకున్నారు. జడ్పీకి ప్రాతినిథ్యం వహించిన వారిలో రాజకీయాల్లో స్థిరపడిన వారే చాలా మంది ఉన్నారు. జడ్పీ అధ్యక్షులుగా మంచి సేవలు అందించిన నేపథ్యంలో వీళ్లు భవిష్యత్తు రాజకీయాల్లో ఎదగడానికి దోహద పడిందని విశ్లేషకులు భావిస్తుంటారు. ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్‌కు మొదటి అధ్యక్షులుగా ఉన్న చొక్కారావు మొదలుకుని చివరి అధ్యక్షురాలిగా ఉన్న తుల ఉమ వరకు జిల్లా అభివృద్ధికి ఎవరి ప్రయత్నాలు వారు చేయగలిగారు. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధిలో జడ్పీ కీలకంగా వ్యవహరించింది. పంచాయతీరాజ్ రోడ్లు, తాగు నీటి వనరుల కల్పనలో జడ్పీకి పెద్ద మొత్తంలో నిధులు వచ్చేవి. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా కేటాయించే నిధులతో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించిన జడ్పీలు.. చివరి నాలుగేళ్లలో కేంద్ర నుంచి నేరుగా వచ్చే ఆర్థిక సంఘం నిధులు నిలిచి పోవడంతో నీరసించిపోయాయి. ఫలితంగా అభివృద్ధి కుంటుబడిందనే అభిప్రాయం ప్రస్తుత పాలకవర్గంలో బలంగా ఉంది. అయినప్పటికీ ప్రస్తుత అధ్యక్షురాలు తుల ఉమ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు సందర్భాల్లో నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు.


-కొత్త జిల్లాలతో మారిన స్వరూపం
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 57 మండలాలు ఉండేవి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలుగా విభజించడమే కాకుండా కొత్తగా ఏర్పడిన భూపాల్‌పల్లి, వరంగల్ అర్భన్, సిద్దిపేట జిల్లాలకు మరి కొన్ని మండలాలను చేర్చారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌లో 16, జగిత్యాలలో 18, సిరిసిల్లలో 12, పెద్దపల్లిలో 13 మండలాలలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇవే మండలాలుగా ప్రస్తుతం జిల్లా ప్రజా పరషత్‌లు ఏర్పాటు చేశారు. 2016 అక్టోబర్‌లో కొత్త జిల్లాలు ఏర్పడినా 2014 జూలై 5న ప్రస్తుతం కొనసాగుతున్న పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయడంతో జడ్పీ సమావేశాలు ఉమ్మడిగానే నిర్వహించారు. గత నెల 6, 10, 14న ఉమ్మడి జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 8న ఉమ్మడి పరిధిలోని నాలుగు జిల్లాల్లో జడ్పీ పాలక వర్గాలను ఎన్నుకున్నారు. జూలై 5 వరకు కొనసాగనున్న ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలం ముగియగానే కొత్త పాలక వర్గాలు కొలువుతీరనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ అధ్యక్షతన బుధవారం ఉమ్మడి జడ్పీ చివరి సారిగా సమావేశం అవుతోంది.

-నేటి సమావేశానికి మంత్రులు
ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ చివరి సర్వ సభ్య సమావేశానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు ఉమ్మడి జిల్లా మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ హాజరవుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు ఉన్న 57 మంది జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరు కానున్నారు. అన్ని జిల్లాల అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. చివరిసారిగా అందరు కలుసుకునే సన్నివేశం ఈ సమావేశంలో ఆవిస్కృతం కానుంది. ఈ సందర్భంగా జడ్పీలో రూ.5 కోట్లతో నిర్మించిన నూతన జడ్పీ భవనాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు. అలాగే జడ్పీ క్వార్టర్స్‌లో నిర్మించిన డీపీఆర్ భవనాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. జడ్పీటీసీ, ఎంపీపీలను ఘనంగా సన్మానించే అవకాశాలు ఉన్నాయి.

93
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles