అంబేద్కర్ స్టేడియాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Wed,June 12, 2019 01:30 AM

-కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్
-స్మార్ట్‌సిటీ నిధులు రూ.18 కోట్లతో పనులకు శంకుస్థాపన
కరీంనగర్ స్పోర్ట్స్ : జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా ఇప్పుటికే విడుదలైన రూ.18 కోట్లకు అదనంగా రాష్ట్రం, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ మరిన్ని నిధులు సాధిస్తామని తెలిపారు. మంగళవారం సాయంత్రం స్టేడియం ఆవరణలో స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టనున్న పనులను ఎంపీ బండి సంజయ్‌కుమార్ నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు వేదపండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ స్థాయికి చేరాక వచ్చిన నిధులతో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మైదానాలు, గదులు, వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రాంతాల అభివృద్ధి, క్రీడాకారులకు, అధికారులకు వేర్వేరు వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. స్టేడియం నిర్వహణ కోసం షాపింగ్ క్లాంప్లెక్స్‌లు, గదులను నిర్మించి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో నిర్వహణ చేపడుతామన్నారు. అధికారులు, క్రీడాకారులకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతాయన్నారు. ఈ పనులపై కేంద్రం, రాష్ర్టానికి చెందిన అధికారులతో త్వరలో సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ దేశంలో చిన్న నగరమైనా కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా తీసుకురావడంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విశేష కృషిచేశారన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న స్టేడియాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి కమిషనర్ భద్రయ్య, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, అడిషనల్ కమిషనర్ రాజేందర్, డీఈలు యాదగిరి, రామన్, ఆర్వో రాములు, ఇన్‌చార్జి డీవైఎస్‌ఓ నాగిరెడ్డి సిద్దారెడ్డి, కార్పొరేటర్ సాధినేని శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు సోహాన్‌సింగ్, మైఖల్‌శ్రీను, సత్తినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles