రైతుల బ్యాంకు ఖాతా నెంబర్లు సేకరించాలి

Wed,June 12, 2019 01:29 AM

-వ్యవసాయాధికారుల సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం జమ చేసేందుకు వీలుగా జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల నెంబర్లు సేకరించాలని ఇన్‌చార్జి కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో వ్యవసాయాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకం ద్వారా వానకాలం పంటలకు గాను లబ్ధిదారులకు ఎకరానికి రూ.5వేల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఉండేలా ప్రతి రైతు బ్యాంకు ఖాతా నెంబర్‌ను సేకరించాలని ఏవోలను ఆదేశించారు. డిజిటల్ సంతకాలైన పట్టాదారుల జాబితా (జూన్ 10 వరకు)కు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన రైతుల బ్యాంకు ఖాతాల నెంబర్లు తీసుకోవాలని సూచించారు. ఏదేనా కారణంతో ఇప్పటి వరకు ఖాతా వివరాలు ఇవ్వని రైతులు ఆయా మండలాల వ్యవసాయాధికారులను సంప్రదించి అందజేయాలని సూచించారు.

జిల్లాలో 1,63,970 మంది రైతులున్నారని, ఇప్పటి వరకు 1,42,666 మంది ఖాతా నెంబర్లు సేకరించామని ఇన్‌చార్జి కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ తెలిపారు. ఇంకా 21,304 మంది రైతుల ఖాతా నెంబర్లు సేకరించాల్సి ఉందన్నారు. వీటిని త్వరితగతిన సేకరించి ఆన్‌లైన్ చేస్తే రైతుబంధు నిధులు జమ చేసేందుకు వీలుంటుందని మండల వ్యవసాయాధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీ శ్రీధర్, సహాయ వ్యవసాయ సంచాలకులు, అన్ని మండలాల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

99
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles