ఆహా.. బెల్లం లడ్డూ

Sun,May 26, 2019 03:27 AM

-రాజన్న సన్నిధిలో అందుబాటులోకి బెల్లం ప్రసాదం
-మొన్నటి నుంచే ప్రారంభం
-ఇప్పటికే గుడాన్న పొంగళి విక్రయం
-ఇష్టంగా ఆరగిస్తున్న భక్తజనం

వేములవాడ కల్చరల్ ;రాజన్న సన్నిధిలో బెల్లం ప్రసాదం ఆహా అనిపిస్తున్నది. సరికొత్త రుచితో నోరూరిస్తున్నది. దేవాదాయ శాఖ బెల్లం ప్రసాదాలను అందుబాటులోకి తెచ్చింది.ఈ నెల 5న గుడాన్న పొంగళిని, శుక్రవారం నుంచి బెల్లం లడ్డూలను 20కే విక్రయిస్తుండగా, భక్తజనం ఇష్టంగా ఆరగిస్తున్నది.

దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో బెల్లం ప్రసాదాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఒకే పరిమాణం.. ఒకే ధరతో అందించబోతున్నారు. అందులో భాగంగా వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ నెల 5 నుంచి గుడాన్న పొంగళిని, శుక్రవారం నుంచి బెల్లం లడ్డూలను అందిస్తున్నారు. స్వామివారికి అన్నపూజ ప్రత్యేకమైన మొక్కుబడి పూజావిధానం కాగా, అమ్మవారు గుడాన్న ప్రీతి మానస అనే పేరుతో పిలువబడుతున్నందున భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల ప్రసాదంగా గుడాన్న పొంగళిని ఇస్తున్నారు.

అమ్మవారికి శ్రేష్ఠమైన బియ్యం, నెయ్యి, బెల్లంతోపాటు కాజూ, కిస్మిస్, యాలకులు, పచ్చ కర్పూరంతో ఈ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. సిల్వర్ కవర్లలో ప్యాక్ చేస్తున్నారు. ఇందులో స్పూన్ ఇస్తారు. 200 గ్రాముల పొంగళి ప్యాక్‌ను ప్రసాదాల కౌంటర్‌లో 20కే విక్రయిస్తున్నారు. శుక్రవారం నుంచి బెల్లం లడ్డూలను కూడా భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. నెయ్యి, బెల్లం, శనగపిండి, కాజు, కిస్మిస్, యాలకులు, పచ్చకర్పూరం, జాజికాయ లాం టి సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తున్నారు. 80 గ్రాముల లడ్డూను 20కే అందిస్తుండగా, భక్తులు సంతోషంగా కొనుగోలు చేస్తున్నారు. ఎంతో ఇష్టంగా ఆరగిస్తున్నారు. తిరుపతి, విజయవాడ, భద్రాచలం, యాదాద్రి లాంటి పుణ్యక్షేత్రాలలో లభించే ప్రసాదాలను త్వరలోనే రాజన్న ఆలయంలో అందిస్తామని ఈవో దూస రాజేశ్వర్ వెల్లడించారు.

సంతృప్తి వ్యక్తం చేసిన అల్లోల..
రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ప్రసాదాల తయారీపై శనివారం హైదరాబాద్‌లోని బొగ్గులకుంట కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయ ఈవో దూస రాజేశ్వర్ రాజన్న ప్రసాదాలను కమిషనర్ అనిల్‌కుమార్‌కు, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అందజేశారు. ప్రసాదాల తయారీ గురించి ఈవో వివరించగా, మంత్రి, కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

112
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles