ప్రజా తీర్పు శిరోధార్యం

Fri,May 24, 2019 04:22 AM

-విద్యార్థి దశనుంచి రాజకీయాల్లోనే ఉన్నా..
-గడిచిన ఐదేళ్లలో కరీంనగర్ అభివృద్ధికి శాయశక్తులా పనిచేశా
-నేను చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసేవరకూ పనిచేస్తూనే ఉంటా..
-ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుంటా..
-కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ వెల్లడి..

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ;ప్రజా తీర్పును శిరోధార్యంగా భావిస్తున్నానని ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో గడిచిన ఐదేళ్లలో ఒక ఉత్తమ ఎంపీగా పేరు తెచ్చుకోవడమే కాదు.. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా పని చేశామన్నారు. గెలుపు ఓటములు సహజమనీ, అయితే తాను ఏ లక్ష్యంతో అయితే కరీంనగర్ లోకసభ నియోకవర్గ అభివృద్ధికోసం వివిధ ప్రాజెక్టులు తీసుకొచ్చానో? వాటిని పూరి ్తచేయించడానికి అదే స్ఫూర్తితో పని చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుంటానన్నారు.

పూర్తి చేసేందుకు శాయశక్తులా పనిచేస్తా..
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నాననీ, అయితే ప్రజాసామ్య వ్యవస్థలో గెలుపోటములు సహజమనీ, ఓటమి చెందినా.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా అహర్నిశలు పని చేస్తానన్నారు. కరీంనగర్‌ను ఒక సుందర సిటీగా మార్చి ప్రజలకు అంకితం ఇవ్వాలన్న లక్ష్యంతో.. స్మార్ట్‌సిటీ సాధించి తెచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆ పనులు అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం రూపు దిద్దుకుంటున్నాయనీ, ఇప్పటికే కొన్ని పనులు చేశానని చెప్పారు.

స్మార్ట్ సిటీలో భాగంగా జరగబోయే పనులపైనా ప్రజలు ఆశలు పెట్టుకున్నారనీ, అంతేకాదు, స్మార్ట్‌సిటీలో భాగంగా నిర్ణయించిన పనులను పూర్తి చేయాలన్న లక్ష్యం తనకు ఉందనీ, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకొని.. ఈ పనులను పూర్తి చేసేందుకు శాయశక్తులా పనిచేస్తానని స్పష్టం చేశారు. అలాగే కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే పనులు గడిచిన కొన్నేళ్లుగా ఎంత వేగంగా జరుగుతున్నాయన్నది ప్రజలందరికీ తెలిసిన విషయమేననీ, ఈ లైన్ పూర్తయితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు ఎన్నో రకాల సౌకర్యాలు సమకూరుతాయని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ఈ రైల్వే లైన్ పూర్తిచేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు.

దీంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో అనేక జాతీయ రహదారులు సాధించిన విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. ఆ మేరకు వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఒక్కసారి ఓటమి చెందినంత మాత్రాన మన లక్ష్యాలు, ప్రజల నుంచి దూరమయ్యే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు. ఓడినా.. గెలిచినా ప్రజల్లోనే, ప్రజలతోనే ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణ పడి ఉండడమేకాకుండా.. తన సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.

158
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles