కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Wed,May 22, 2019 03:10 AM

-రేపే లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-ప్రతీ నియోజకవర్గానికి హాల్‌లో 14 టేబుళ్లు
-ఉదయం 6 గంటలకు స్ట్రాంగ్ రూంల ఓపెన్
-ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
-జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్
-సీపీ, ఎన్నికల పరిశీలకులతో కలిసి ఎస్సారార్‌లో ఏర్పాట్ల పరిశీలన

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ);ఈనెల 23న ఎస్సారార్ డిగ్రీ కాలేజీలో జరిగే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకులతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సారార్ కాలేజీ కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాటు చేసిన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడికక్కడ పకడ్బందీగా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏ నియోజకవర్గానికి సంబంధించిన దారులు సిబ్బందికి, కౌటింగ్ ఏజెంట్లకు వేర్వేరుగా చేయాలన్నారు.

ప్రతి కౌంటింగ్ హాల్‌లో 14 కౌంటింగ్ టేబుళ్లు అమర్చాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6 గంటలకు, కౌటింగ్ ఏజెంట్లు ఉదయం 5.45 గంటల్లోగా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఉదయం 6 గంటలకు స్ట్రాంగ్ రూంలు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారనీ, ఓట్ల లెక్కింపు ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని సూచించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందనీ, కౌటింగ్ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి తెలపాలన్నారు.

ఏజెంట్లకు సెల్‌ఫోన్ అనుమతి లేదు
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్లు సెల్‌ఫోన్లను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకురావద్దని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టంచేశారు. సెల్‌ఫోన్లు డిపాజిట్ చేసుకునేందుకు కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదనీ, అందువల్ల కౌంటింగ్ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లో తమ సెల్‌ఫోన్లు తీసుకురావద్దన్నారు. సీపీ కమలాసన్‌రెడ్డి, ఎన్నికల ప్రత్యేకాధికారి ప్రావీణ్య, ఎన్నికల పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, డీఆర్‌డీఓ వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈఓ వెంకటమాధవరావు, కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్‌కుమార్, హుజురాబాద్ ఆర్డీఓ చెన్నయ్య పాల్గొన్నారు.

సమన్వయం పాటించాలి: ఆర్డీవో
స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 23న నిర్వహించనున్న కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చే వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు సమన్వయం పాటించాలని కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ, రికగ్నైజ్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలను ఉదయం 5.45 గంటలకే జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఎన్నికల పరిశీలకులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల సమక్షంలో తెరుస్తారని తెలిపారు. సంబంధిత కౌంటింగ్ ఏజెంట్లు ఆ సయయానికి కౌంటింగ్ కేంద్రానికి రావాలన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రంలోకి మొదటి అంతస్తులో గల రూం నెంబర్ 75లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందనీ, కౌంటింగ్ ఏజెంట్లు ఓపికగా ఉండి సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు మడుపు మోహన్, జమీల్ అహ్మద్, జీ రమేశ్, కన్నకృష్ణ, గందె మహేశ్, బండి సంపత్‌తో పాటు రికగ్నైజ్డ్ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థుల ఏజెంట్లు పాల్గొన్నారు.

98
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles