ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి

Sun,May 19, 2019 01:53 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ);జిల్లాకేంద్రంలోని ఎస్సారార్ కాలేజీలో ఈ నెల 23న జరిగే లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన రెండో విడత శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ నియోజకవర్గంలో ఏ టేబుల్‌పైన ఓట్లు లెక్కిస్తారో ముందుగా తెలియదనీ, ర్యాండమైజేషన్ ద్వారా టేబుల్స్‌ను కౌంటింగ్ సిబ్బందికి కేటాయిస్తామని తెలిపారు. లెక్కింపు రోజు సిబ్బంది ఉదయం 5 గంటలకే కేంద్రానికి రావాలని ఆదేశించారు. కౌంటింగ్ టేబుల్‌పైకి ఏ పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన కంట్రోల్ యూనిట్ వచ్చిందో ముందుగా ఇచ్చిన షీటులో సరి చూసుకోవాలని సూచించారు. ఏ టేబుల్ పైకి ఏ పోలింగ్ స్టేషన్ కంట్రోల్ యూనిట్ కేటాయించామనే వివరాలు కౌంటింగ్ హాల్ డిస్‌ప్లేపై ప్రదర్శిస్తామన్నారు. టేబుల్‌పైకి వచ్చిన సంబంధిత పోలింగ్ స్టేషన్ కంట్రోల్ యూనిట్ అడ్రస్ ట్యాగ్, సీల్ సరిగా ఉన్నాయో? లేదో? సరి చూసుకోవాలన్నారు. కంట్రోల్ యూనిట్లలో బ్యాటరీ లో అయితే వెంటనే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి తెలపాలనీ, కొత్త బ్యాటరీని సమకూర్చుతారనీ, తర్వాత సీల్ తొలగించి ముందుగా టోటల్ బటన్ నొక్కాలని సూచించారు. అనంతరం రిజల్ట్ బటన్ నొక్కాలనీ, అభ్యర్థుల వారీగా పోలైన ఓట్ల వివరాలు కంట్రోల్ యూనిట్‌లో చూపిస్తుందన్నారు. ఈ ప్రక్రియను ఏజెంట్లకు చూపించాలనీ, పోలైన ఓట్లను అభ్యర్థులకు ఎదురుగా నమోదు చేసుకుని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి పంపించాలని సూచించారు. మైక్రో అబ్జర్వర్లు కూడా కౌంటింగ్ టేబుల్ వారీగా పోలైన ఓట్ల వివరాలను నమోదు చేస్తారన్నారు. టేబుల్ వారీగా, మైక్రో అబ్జర్వర్ల వారీగా నమోదైన ఓట్లు సరి చూసుకుని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రౌండ్ల వారీగా పోలైన ఓట్ల వివరాలను ఎన్నికల పరిశీలకుల సంతకంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపిస్తారన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి ఐదు పోలింగ్‌స్టేషన్ల వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కిస్తారనీ, నియోజకవర్గానికి 5 పోలింగ్ స్టేషన్లు లాటరీ ద్వారా ఎంపిక చేస్తారన్నారు. స్లిప్పులను కౌంటింగ్ అనంతరం తిరిగి సంబంధిత వీవీ ప్యాట్‌లోనే భద్రపర్చాలని సూచించారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles