బస్సులకు ఫిట్‌నెస్ తప్పనిసరి

Sun,May 19, 2019 01:53 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: విద్యా సంస్థల బస్సులకు ఫిట్‌నెస్ తప్పనిసరనీ, యాజమాన్యాలు జూన్ 1 లోగా తమ కళాశాలలు, పాఠశాలల బస్సులకు ఫిట్‌నెస్ చేయించుకోవాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ సూచించారు. శనివారం ఆయన రవాణాశాఖ కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు పాఠశాలలు తెరిచే సమయానికి ఫిట్‌నెస్ చేయించుకొని, నిబంధనల మేరకే నడిపించుకోవాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,897 విద్యాసంస్థల బస్సులున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్‌లో 959, పెద్దపల్లిలో 309, జగిత్యాలలో 460, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 169 బస్సులున్నట్లు వివరించారు. విద్యాసంస్థల బస్సుల గడువు మే 15తో ముగిసిందనీ, జూన్ 1 లోగా ఫిట్‌నెస్ చేయించుకోవాలని సూచించారు. ఫిట్‌నెస్ లేని బస్సులు రోడ్డుపై నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశాలను యాజమాన్యాలకు ముందుగానే కరపత్ర రూపంలో అందజేస్తున్నామన్నారు. ఈ అంశాల ప్రకారం ఉంటేనే ఫిట్‌నెస్ చేస్తామని స్పష్టం చేశారు. విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు, క్లీనర్లు పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు. వాహనం కండిషన్‌తోపాటు భద్రత చర్యలున్న వాటికే ఫిట్‌నెస్ చేస్తామని చెప్పారు.

విద్యా సంస్థల వాహనంలో ప్రథమ చికిత్స కిట్, అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరం, బస్సులకు ఇరువైపులా కిటికీలకు టై రాడ్స్ ఉండాలన్నారు. నిబంధనలు తెలుసుకొని ఆ మేరకు బస్సులను ఫిట్‌నెస్‌కు తీసుకురావాలని సూచించారు. రవాణాశాఖ అధికారులకు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. కరీంనగర్‌లో 252 బస్సులు ఫిట్‌నెస్ గడువు ముగిసి ఉన్నాయనీ, వీటిని కార్యాలయానికి తీసుకురాలేదనీ, వీటికి సంబంధించిన వివరాలు యాజమాన్యాలు తెలపాలన్నారు. 15 ఏళ్లు దాటిన బస్సులకు ఫిట్‌నెస్ చేయబోమనీ, వాటి వివరాలు కూడా తెలపాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజూ బస్సులకు సంబంధించిన డ్రైవర్, క్లీనర్లను గమనిస్తూ ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు టీఎస్ స్కూల్‌బస్సు యాప్‌ను వినియోగించి బస్సు వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

బస్సు ఫిట్‌నెస్ పరిశీలించిన డీటీసీ..
ఫిట్‌నెస్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వచ్చిన కళాశాలలు, పాఠశాలల బస్సులను డీటీసీ శ్రీనివాస్ స్వయంగా నడిపారు. ఫిట్‌నెస్‌ను పరిశీలించారు. బస్సు డ్రైవర్లకు పలు సూచనలు ఇవ్వడంతోపాటు ప్రతి బస్సులో సీట్లు, ఫైర్ సేఫ్టీ, అత్యవసర ద్వారం, సీటు బెల్ట్, తదితర వాటిని క్షుణ్నంగా పరిశీలించారు. విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్ విషయంలో కఠినంగా ఉంటామనీ, ఎవరైనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐలు రజినీదేవి, ఫారుక్ పాల్గొన్నారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles