రామగుండానికి ముఖ్యమంత్రి

Sat,May 18, 2019 01:16 AM

-నేడు సీఎం కేసీఆర్ పర్యటన
-రెండోసారి తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ పరిశీలనకు రాక
-జెన్‌కో, ఎన్టీపీసీ అధికారులతో సమీక్ష
-ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస
-19న ఉదయం కాళేశ్వరం దేవస్థానంలో పూజలకు..
-అక్కడి నుంచి కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు..
-ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్, సీపీ
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ జ్యోతినగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మొదటి రోజు శనివారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ నుంచి బయల్దేరి, రామగుండం ఎన్టీపీసీకి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా పూర్తిగా స్వరాష్ట్ర అవసరాల కోసం ఎన్టీపీసీలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎస్టీపీపీ)ను మరోసారి పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించి, ఎన్టీపీసీలోని జ్యోతి భవన్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఆదివారం ఉదయం కుటుంబసమేతంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలిస్తారు.

ఎస్టీపీపీకి రెండోసారి..
2017 డిసెంబర్8న మొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్టీపీపీ పనులను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన సందర్భంగా వచ్చారు. నేడు రెండోసారి విద్యుత్ ప్లాంట్‌ను సందర్శించడంతోపాటు జెన్‌కో, ఎన్టీపీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

ఏర్పాట్ల పరిశీలన..
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. శని, ఆదివారం రెండు రోజులూ జిల్లాలోనే ఉండడంతో జిల్లావ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన రెండు హెలీప్యాడ్‌లతోపాటు ప్లాంట్ నిర్మాణ పనులు, ముఖ్యమంత్రి బస చేసే జ్యోతి భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హెలీప్యాడ్ స్థలం, సమీక్షా సమావేశం హాల్, బస చే యనున్న వీఐపీ గెస్ట్‌హౌస్‌ను శుక్రవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. ఎన్టీపీసీ హెచ్‌ఆర్ అధికారులతో మాట్లాడి, అన్ని ఏర్పాట్లూ చేశారు. సీపీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని గెస్ట్, హెలీప్యాడ్ స్థలాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

సుందిళ్ల, అన్నారం వద్ద తనిఖీలు..
ముఖ్యమంత్రి కేసీర్ ఇతర ప్రాజెక్టులను పరిశీలించే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. మంథని మండలం సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంపుహౌస్‌ల వద్ద పోలీసులు, సీఎం సెక్యూరిటీ విభాగం అధికారులు తనిఖీలు చేశారు. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంథని సీఐ మహేందర్ ఆధ్వర్యంలో సుందిళ్ల బ్యారేజీ, కరకట్ట, అన్నారం పంపుహౌస్, చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించారు.

146
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles