హత్యానేరంలో ఇద్దరికి పదేళ్ల జైలు

Fri,May 17, 2019 01:21 AM

కరీంనగర్‌ లీగల్‌ : కూతురును వేధింపులకు గురి చేసినందుకు అల్లున్ని కత్తితో హత్య చేసిన నేరంలో మామతో పాటు బావమరిదికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ మూడవ జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. కరీంనగర్‌ మండలం గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన నాగిరెడ్డి హరికృష్ణ వివాహం అదే గ్రామానికి చెందిన ఎర్ర ఏసురెడ్డి కుమార్తె లావణ్యతో సంఘటనకు ఐదేళ్ల క్రితం జరిగింది. భార్యాభర్తలు ఆరు నెలలు సంతోషంగా ఉన్నారు. అనంతరం హరికృష్ణ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అదనంగా వరకట్నం కావాలని భార్యను వేధించసాగాడు. దీనిపై లావణ్య కరీంనగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా భర్తతో పాటు అత్తింటి వారిపై కేసు నమోదైంది. కేసు రాజీపడినప్పటికీ హరికృష్ణ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. 2017 జూన్‌ 19న హరికృష్ణ భార్యను కొట్టడంతో ఆమె తీవ్రంగా ఏడ్చింది. పక్కింటిలోనే ఉంటున్న లావణ్య తండ్రి ఏడుపు విని వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. హరికృష్ణ కూడా వారి ఇంటికి వెళ్లగా మామ ఏసురెడ్డి, బావ మరిది రామకృష్ణలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఏసురెడ్డి ఇంట్లోంచి కత్తి తీసుకువచ్చి హరికృష్ణపై దాడి చేయగా రామకృష్ణ కదలకుండా పట్టుకున్నాడు. గొడవ జరుగుతుండగా ఇరువురు గ్రామస్తులు మల్లయ్య, నర్సయ్యలు అడ్డుకోగా వారికి కూడా గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన హరికృష్ణను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. పీపీ సంజీవరెడ్డి కోర్టులో సాక్ష్యులను ప్రవేశపెట్టగా సాక్ష్యాదారాలు పరిశీలించిన న్యాయమూర్తి గురువారం నిందితులు ఏసురెడ్డి, రామకృష్ణలపై కేసు రుజువైనందున ఒక్కొక్కరికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles