నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు

Fri,May 17, 2019 01:21 AM

-గుట్టుచప్పుడు కాకుండారైస్‌మిల్లులో దందా
-60 క్వింటాళ్ల పత్తి విత్తనాల స్వాధీనం
-వివరాలు వెల్లడించిన సీపీ కమలాసన్‌రెడ్డి
హుజూరాబాద్‌, నమస్తే తెలంగాణ/ హుజూరాబాద్‌రూరల్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని ఓ రైస్‌ మిల్లులో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న నకిలీ పత్తి విత్తనాల దందా బయటపడింది. గురువారం పక్కా సమాచారం మేరకు టౌన్‌ సీఐ మాధవి ఆధ్వర్యంలో ఈ గుట్టును రట్టు చేశారు. అయితే బుధవారం రాత్రి హుజూరాబాద్‌ పోలీసులు నకలీ దందా సాగుతున్న రైస్‌ మిల్లును తనఖీ చేసి, అందులో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులకు సమాచారం అందించగా ఈ మేరకు వారు తెల్లవారుజామున రెవెన్యూ అధికారులతో కలిసి రైస్‌మిల్లులో నిల్వ ఉంచిన నకలీ పత్తి విత్తనాలను పరిశీలించారు. ఈ దందాపై కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. “శంకరపట్నం మండలం అముదాలపల్లికి గాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ గత నాలుగు సంవత్సరాల నుంచి నకిలీ విత్తనాల దందా చేస్తున్నాడనీ, హుజూరాబాద్‌లోని బొబ్బల రాజిరెడ్డి అనే సీడ్‌ వ్యాపారికి చెందిన రైస్‌ మిల్లును లీజ్‌కు తీసుకొని అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నాడని చెప్పారు. రైస్‌ మిల్లులో మొత్త 60 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోగా, అందులో 9 క్వింటాళ్ల 20 కిలోల (బీటీ) నకిలీ విత్తనాలు, దాని పక్కనే ఉన్న మరో గదిలో 50 సంచుల్లో 20 క్వింటాళ్ల (నాన్‌ బీటీ) ప్యాకింగ్‌ చేసిన విత్తనాలతో పాటు మరో 30 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

వీటితో పాటు ప్యాక్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్న పది వేల ప్లాస్టిక్‌ కవర్లు, మూడు ప్యాకింగ్‌ మిషన్లు, తూకం వేసే మిషన్లను కూడా సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నకిలీ విత్తనాల విలువు సుమారు రూ.70 లక్షల వరకు ఉంటుందని వివరించారు. ఈ విత్తనాలను మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోని అదిలాబాద్‌, మంచిర్యాల, వరంగల్‌, తదితర ప్రాంతాల్లో విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. అమాయక రైతులకు అమ్ముతూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఈ సందర్భంగా డీఏఓ వాసిరెడ్డి శ్రీధర్‌ మాట్లాడుతూ ఈ విత్తనాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపిస్తామనీ, పరీక్షల అనంతరం బీటీ-3 అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నకిలీ విత్తనాల తనిఖీ కోసం జిల్లాలో మూడు టాస్క్‌ ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశామనీ, ఇవి నిరంతరం గస్తీ తిరుగుతున్నాయని చెప్పారు. గతంలో నకిలీ విత్తనాలు తయారు చేస్తూ పట్టుబడ్డ వారిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అంతకు ముందు రైస్‌ మిల్లులో నిల్వ ఉంచిన విత్తనాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌, ఏసీపీ కృపాకర్‌ పరిశీలించారు. ఏడీఏ ఆదిరెడ్డి, ఏవోలు సునీల్‌కుమార్‌, గోవర్ధన్‌రెడ్డి, అర్‌ఐ ప్రసాద్‌, వీఅర్వో రామారావు పంచనామా నిర్వహించగా, ఆ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, టాస్స్‌ ఫోర్స్‌ సీఐ జనార్ధన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

హుజూరాబాద్‌ టూ మహారాష్ట్ర
శంకరపట్నం మండలం అముదాలపల్లి గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్‌ గతంలో సీడ్‌ వరి (అడ మగ) వ్యాపారం చేసేవాడు. దీంతో పాటు క్రషర్‌లో భాగస్వామిగా ఉన్నాడు. వాటన్నింటికీ స్వస్తి పలికి గత నాలుగేళ్ల నుంచి నకిలీ పత్తి విత్తనాల దందా చేస్తున్నాడు. హుజూరాబాద్‌ రైస్‌మిల్లులో దొరికిన ప్యాకెట్లపై ఎస్‌ఆర్‌, రజనీ సీడ్‌ పేరిట శ్రీనివాస్‌ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. ఈ ప్యాకెట్లపై హైదరాబాద్‌లోని రామంతపూర్‌, మేడ్చల్‌ చిరునామా ముద్రించబడి ఉన్నాయి. ఈ నకిలీ దందా చేసేందుకు జిన్నింగ్‌ మిల్లులో నుంచి శ్రీనివాస్‌ పత్తి గింజలను సేకరించే వాడు. రైతులకు అనుమానం రాకుండా ఉండేందుకు విత్తన శుద్ధి మాదిరిగా వివిధ రంగులను కలిపి ప్యాక్‌ చేసి విక్రయించేవాడు. హైదరాబాద్‌లో 15 రోజుల క్రితం ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి శ్రీనివాస్‌కు చెందిన కోల్డ్‌ స్టోరేజీలో దాచి ఉంచిన విత్తనాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అ కోల్డ్‌ స్టోరేజీలో ఉన్న విత్తనాలు గత సంవత్సంర అక్రమ వ్యాపారంలో మిగిలినవేనని పోలీసులు తేల్చారు.

ఈ కేసు విషయంలో శ్రీనివాస్‌ సోదరుడు జైలుకు వెళ్లగా, శ్రీనివాస్‌ ముందస్తు బెయిల్‌ తీసుకున్నట్లు సమాచారం. హుజూరాబాద్‌లో ప్యాక్‌ చేసిన విత్తన ప్యాకెట్లను మహారాష్ట్రలో విక్రయించే ప్రయత్నంలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం డీసీఎం వ్యాన్‌లో మహారాష్ట్రకు తరలిస్తుండగా అక్కడి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టబడ్డాయి. అనుమానం వచ్చిన మహారాష్ట్ర పోలీసులు డ్రైవర్‌ను విచారించగా మొత్తం గుట్టు వీడింది. మహారాష్ట్ర పోలీసులు ఈ సమాచారాన్ని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డికి తెలిపారు. బుధవారం రాత్రి మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ పోలీసుల అనుమతితో డ్రైవర్‌ను హుజూరాబాద్‌కు తీసుకువచ్చారు. హుజూరాబాద్‌ సీఐ మాధవి సహకారంతో అదే రోజు రాత్రి రైస్‌ మిల్లును పరిశీలించగా నకిలీ దందా సాగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. గత నాలుగేండ్ల నుంచి చేస్తున్న నకిలీ పత్తి విత్తనాల అక్రమ దందా మొత్తం బయటపడింది. నకిలీ పత్తి విత్తనాలతో పాటు మక్క, వరి, కూరగాయల విత్తనాల అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు రైస్‌మిల్లు పరిసర ప్రాంతాలను బట్టి చూస్తే తెలుస్తున్నది. రైస్‌ మిల్లులో ఓ మూలకు ఎస్‌అర్‌ సీడ్‌ పేరిట పది కిలోల వరి విత్తనాల సంచి ఉండడమే కాకుండా, మరో వందల కొలది ఇటువంటి సంచులు ఉన్నాయి. కాగా, మహారాష్ట్రకు తరలించే మొత్తం ఈ దందాలో శ్రీనివాస్‌ దగ్గరి బంధువైన బెజ్జంకికి చెందిన ఓ వ్యక్తి పాలు పంచుకోగా వ్యాన్‌ కూడా ఇతనిదేనని తెలిసింది.

134
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles