పత్తి పంట కాలాన్ని పొడిగించవద్దు

Thu,May 16, 2019 01:15 AM

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పత్తి సాగు చేసే రైతులు పంట కాలాన్ని పొడిగించవద్దనీ, గులాబీరంగు కాయ తొలుచు పురుగును అరికట్టేందుకు సమగ్ర నివారణ చర్యలు పాటించాలని జాయింట్‌ కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌ రైతులకు సూచించారు. బుధవారం జేసీ చాంబర్‌లో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయాధికారులు, రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

పత్తి విత్తడానికి ముందు, తర్వాత గులాబీ రంగు కాయ తొ లుచు పురుగు నివారణ కోసం రైతులు ముం దుగా తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకుని సకాలంలో విత్తుకోవాలని సూచించారు. పత్తి పంట దగ్గరలో బెండ చేను చుట్టూ తుత్తుర బెండ లాంటి కలుపు లేకుండా చూసుకోవాలని, విత్తిన 45 రోజుల నుంచి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించేందుకు ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను అమర్చి సస్య రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

పురుగు నివారణకు రసాయన మందుల పిచికారి ఉదయం 6 నుంచి 10 గంటల్లోపు, సాయంత్రం 4 నుంచి 7 గంటల్లోపు పిచికారీ చేయాలన్నారు. పత్తి పంట కాలాన్ని 180 నుంచి 200 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. పత్తి తీసిన చేన్లలో గొర్రెలు, మేకలు, పశువులను మేపడం ద్వారా గులాబీ రంగు పురుగు నివారించే అవకాశముందన్నారు. మండలాల వారీగా రైతు సదస్సులు ఏర్పాటు చేసి పత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వీ శ్రీధర్‌, ఆత్మ పీడి ప్రియదర్శిని, ఏరువాక కోఆర్డినేటర్‌ అరుణశ్రీ, వ్యవసాయశాఖ ఏడీఎ అంజనీ, మోన్‌శాంటో కంపెనీ ప్రతినిధి దేముడు నాయుడు, సిర్సపల్లి ఉత్తమ రైతు వంగల వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles