రెవెన్యూ నిర్లక్ష్యం ఆ కాలనీకి శాపం

Wed,May 15, 2019 01:28 AM

-అధికారుల అలసత్వంతో పట్టా జాగా సర్కారు భూమిగా మార్పు
n ఒక సర్వే నంబర్‌కు బదులు మరోటి పడడంతో తిప్పలు
-బ్యాంకు లోన్లు, ఇంటి పర్మిషన్లు రాక వంద కుటుంబాల ఆవేదన
-పన్నెండేళ్లుగా గాంధీనగర్‌వాసుల అవస్థలు
-కలెక్టర్‌కు నివేదించినా తీరని సమస్య
సుల్తానాబాద్‌: ఓ రెవెన్యూ అధికారి చేసిన చిన్న పొరపాటు, ఆ కాలనీ వాసులందరికీ శాపంగా మారింది. సర్కారు భూముల వివరాలు తెలపాలనీ 2007లో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగా, సుల్తానాబాద్‌లో అప్పటి తాసిల్దార్‌ ఎలాంటి పరిశీలన చేయకుండానే అసలు సర్వే నంబర్‌కు బదులు మరో నంబర్‌ పంపించడంతో పట్టా భూములన్నీ ప్రభుత్వ భూములుగా నమోదవ్వాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పట్టణంలోని గాంధీనగర్‌ కాలనీ భూములకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్వే నంబర్‌ 909/1/అ లో ముస్త్యాల లక్ష్మయ్యకు 8.34ఎకరాల భూమి, 909/1/ఉ లో ముద్దసాని రమణారెడ్డికి 20 గుంటలు, 909/1/2/ఈ లో రాంచందర్‌రావుకు 1.20 ఎకరాల భూమి ఉంది. అలాగే 909/2లో 4.25 ఎకరాలు, ఖరుజు ఖాతా ప్రభుత్వానికి చెందిన భూమి ఉంది. అయితే ప్రభుత్వ భూములు వివరాలు తెలపాలని రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి 2007లో ఉత్తర్వులు వచ్చాయి.

దీంతో ఇక్కడి రెవెన్యూ అధికారులు ఎలాంటి విచారణా, పరిశీలన చేయకుండానే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 909/2 సర్వే నంబర్‌లో 4.25 ఎకరాలు ఖరుజు ఖాతా ప్రభుత్వానికి చెందిన భూమి ఉండగా, దానికి బదులు సర్వే నంబర్‌ 909లో రక్బా 4.25 ఎకరాలు ప్రభుత్వానికి చెందినదనీ నివేదించారు. ఇక్కడే రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటు స్పష్టంగా కనిపిస్తున్నది. 909 సర్వే నంబర్‌లో ఏబీసీడీలుగా పట్టా భూములు, ప్రభుత్వ భూములు వేర్వేరుగా ఉన్నప్పటీకీ రెవెన్యూ అధికారులు 909 సర్వే నంబర్‌ ప్రభుత్వానికి చెందినదని నివేదికలో పంపించడంతో ఆ సర్వే నంబర్‌కు అనుబంధంగా ఏవైతే పట్టా భూములున్నాయో.. అవన్నీ ప్రభుత్వ భూముల జాబితాలోకి వెళ్లి తీరని సమస్యగా మారింది. 2007కు ముందు భూములకు పట్టాలు కలిగి ఉండి, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఇళ్లు నిర్మించుకున్న ఆ కాలనీ వాసులు, పట్టా భూములు ప్రభుత్వ భూముల జాబితాలోకి వెళ్లడంతో తర్వాత అక్కడి భూములకు ఇంటి అనుమతులు, బ్యాంకు లోన్లు రాక, భూములకు విలువ తగ్గిపోయి, కొనేవారు ముందుక రాక తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తమ పట్టా భూములను ప్రభుత్వ భూములుగా ఎలా నివేదిక పంపారనీ, వెంటనే పట్టా భూములుగా మార్చాలని కాలనీవాసులుంతా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు.

లోకాయుక్తకు ఫిర్యాదు..
కాగా, ఈ విషయమై మాదిగ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెపల్లి జితేందర్‌ అప్పట్లో లోకాయుక్తలో ఫిర్యాదు చేయగా, లోకాయుక్త స్పందించింది. భూముల వివరాలు పంపాలని ఎల్‌ఆర్‌, డీఐఎస్‌ నంబర్‌ 2822/ 2016/ బీ1/ లోకాయుక్తా/ 9492/ 2016 లేఖ ద్వారా అప్పటి కలెక్టర్‌ అలుగు వర్షిణిని కోరింది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు విచారణ చేసి కేవలం 909/2 సర్వే నంబర్‌లో మాత్రమే 4.25 ఎకరాలు ప్రభుత్వానికి చెందినదనీ, మిగితావి పట్టా భూములని తేల్చి లోకాయుక్తకు లేఖ నంబర్‌ ఇ2/98/2016 ద్వారా తేదీ 2/12/2016 రోజున నివేదించారు.

కానీ, ఇప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకు హైదరాబాద్‌లోని మియాపూర్‌లోని సర్కారు భూములకు సంబంధించి అవకతవకలు జరగడంతో ప్రభుత్వం సైతం జీవో 22/ఏ ద్వారా నిషేధిత భూముల వివరాలను పంపాలని ఆదేశాలు జారీ చేయగా, అప్పటి కలెక్టర్‌ వర్షిణి విచారణ చేసి 909 సర్వే నంబర్‌లో పట్టా భూములు ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయనీ, ఆ భూములను సవరించాలని లేఖ నంబర్‌ ఇ/1/279/2016 ద్వారా నివేదించినా ఫలితం లేదు. ఈ క్రమంలో ఇటీవల సుల్తానాబాద్‌ మండలం కదంబాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌, న్యాయవాది కోడం అజయ్‌ సైతం ‘ది ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ హైదరాబాద్‌'కు అప్పటి రెవెన్యూ అధికారులు చేసిన తప్పులను వివరిస్తూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. నిషేధిత భూముల లిస్టులో ఉన్న గాంధీనగర్‌ భూములను తొలగించాలనీ అధికారులను కోరినప్పటికీ సమస్య పరిష్కారంలో పురోగతి సాధించలేదు. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా మారడంతో ఇబ్బందులు పడుతున్నామనీ, అధికారులు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని పలువురు ధర్మగంటతో గోడు వెల్లబోసుకున్నారు.

223
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles