రెవెన్యూలో కదలిక..

Mon,May 13, 2019 03:52 AM

- నేటి నుంచి మీ భూమి- మీ పత్రాలు
- హుజూరాబాద్‌లో ఇప్పటికే ప్రారంభం
- కరీంనగర్ డివిజన్‌లో నేటి నుంచి అమలు
- అన్ని తహసీల్ కార్యాలయాల్లో ఏర్పాట్లు
- అందుబాటులో అధికారులు
- గ్రామాల వారీగా షెడ్యూలు
- భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
- కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలు
ఎట్టకేలకు రెవెన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు జిల్లాలో సోమవారం నుంచి వచ్చే 20 వరకు మీ భూమి - మీ పత్రాలు పేరుతో రెవెన్యూ అధికారులు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూముల సమస్యలను అప్పటికపుడు పరిష్కరించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అన్ని తాసిల్దార్ కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. అయితే ఒక్కో గ్రామానికి ఒక రోజు కేటాయించి ఈ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. హుజూరాబాద్ డివిజన్‌లో ఇప్పటికే ప్రారంభం కాగా, కరీంనగర్ డివిజన్‌లో మాత్రం సోమవారం నుంచి ప్రారంభమవుతుందని ఆర్డీఓ ఏ ఆనంద్‌కుమార్ వెల్లడించారు.

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టినా జిల్లాలో అనేక మంది రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు. పైగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగంట శీర్షికతో ఇప్పటికే అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. నమస్తే తెలంగాణ ప్రచురించిన వరుస కథనాలపై కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ ఎప్పటికపుడు స్పందించి పలు సమస్యలకు పరిష్కారం కూడా చూపారు. అయితే ఇంకా అనేక సమస్యలు పాతుకుపోయి ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల అన్ని మండలాల తాసిల్దార్లతో సమావేశం నిర్వహించారు. లెక్కకు మించి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్ తక్షణ పరిష్కారం కోసం మీ భూమి - మీ పత్రాలు అనే కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. హుజూరాబాద్ డివిజన్‌లో వారం కిందనే ప్రారంభించారు. పరిషత్తు ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ డివిజన్‌లో వాయిదా వేశారు. సోమవారం నుంచి వచ్చే నెల 20 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్‌కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు.

తాసిల్ కార్యాలయాల్లోనే..
కరీంనగర్ డివిజన్ పరిధిలో గల పది మండలాల్లోని అన్ని తాసిల్ కార్యాలయాల్లో మీ భూమి - మీ పత్రాలు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఒక్కో గ్రామానికి ఒకటి లేదా రెండు రోజులు సమయం కేటాయిస్తున్నారు. ఇప్పటికే మండలాల వారీగా తాసిల్దార్లు షెడ్యూలు విడుదల చేశారు. ఆయా మండలాల్లో ఏ గ్రామానికి ఏ రోజు సమయం కేటాయించారనే విషయాన్ని సంబంధిత వీఆర్‌ఓలు, వీఆర్‌ఏల ద్వారా ప్రచారం చేయించారు. సెలవు రోజులు, మధ్యలో పార్లమెంట్, పరిషత్తు ఎన్నికల కౌంటింగ్ మినహాయిస్తే ప్రతి రోజు సంబంధిత గ్రామాల వీఆర్‌ఓలు మొదలుకుని తాసిల్దార్ వరకు ఆయా తేదీల్లో రైతులకు అధికారులు అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని భూ యజమానులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్‌కుమార్ కోరారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు సంబంధిత తాసిల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారని ఆర్డీఓ తెలిపారు.

తక్షణం పరిష్కరించే సమస్యలు
మీ భూమి - మీ పత్రాలు కార్యక్రమంలో భాగంగా అప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. రెవెన్యూ రికార్డుల శుద్ధిలో భాగంగా చేపట్టిన పట్టాదారు పాసు పుస్తకాల్లో దొర్లిన పొరపాట్లను తక్షణం పరిష్కరిస్తారు. సాదాబైనామాల ద్వారా కొనుగోళ్లు జరిపిన భూములు, విరాసత్ కోసం చేసుకుని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలిస్తారు. ఇలాంటి భూముల్లో ఎలాంటి వివాదాలూ లేనట్లయితే వెంటనే పరిష్కరిస్తారు. సర్వేలు, క్షేత్ర స్థాయిలో పరిశీలించే కార్యక్రమాలు ఏవైనా ఉంటే సంబంధిత రైతులకు గడువు ఇచ్చి ఆ మేరకు పరిశీలన జరుపుతారు. భూసమస్యలు ఎదుర్కొంటున్న రైతులు తమ పత్రాలు, ఆధార్ కార్డును తప్పకుండా తీసుకు రావాలని ఆర్డీఓ ఆనంద్‌కుమార్ కోరారు. కొత్తగా జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు సరిచేసేందుకు సదరు పాసు పుస్తకంతోపాటు ఆధారాలు కూడా తీసుకువెళ్లాలని ఆయన కోరుతున్నారు.

202
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles