ఎప్పుడడిగినా మూడ్రోజుల్లో పనైతది

Mon,May 13, 2019 03:49 AM

-ఏడాదిగా ఇదే సమాధానం
- 2.10 ఎకరాలకు ఎకరం26 గుంటలకే పట్టా
-తండ్రిపేరిట ఉన్న 1.16 గుంటలు, కొడుకు పేరిట ఉన్న 8 గుంటలు గల్లంతు
-రికార్డులో ఎక్కించాలని తాసిల్ చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
-అయినా అధికారులు పట్టించుకుంటలేరు
-రేపూమాపంటూ తిప్పుకుంటున్నరు
-ఇదీ కోనరావుపేటకు చెందిన బండి అమృతరావు, బాబు ఆవేదన
-సమస్య నాదృష్టికి రాలేదు: తాసిల్దార్ వెంకటేశ్వర్లు
కోనరావుపేట: 2 ఎకరాల 10 గుంటల భూమికిగాను రెవెన్యూ అధికారులు పాస్‌బుక్‌లో ఎకరం 26గుంటలనే నమోదు చేశారు. తండ్రి పేరిట ఉన్న 1.16 గుంటలను, కొడుకు పేరిట ఉన్న 8గుంటలను మాయం చేసిన్రు. ఇదే విషయమై ఏడాదిగా తాసిల్ చుట్టూ తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని మండల కేంద్రానికి చెందిన రైతులు బండి అమృతరావు, బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అడిగినప్పుడల్లా రెండు మూడురోజుల్లో పనవుతుందని సర్దిచెబుతూ పంపిస్తున్నారని వాపోతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చివరకు నమస్తే తెలంగాణ ధర్మగంటను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకున్నాడు.
బాధితుల కథనం ప్రకారం.. కోనరావుపేట మండల కేంద్రానికి బండి అమృతరావు పేరిట 228/1, 316/43/3, 386ఉ, 395ఈ/ఏ సర్వే నంబర్లలో ఉన్న మొత్తం 2 ఎకరాల 10 గుంటల భూమిని 20 సంవత్సరాల క్రితం వేరొకరి నుంచి కొనుగోలు చేశాడు. ఆ క్రయవిక్రయాలకు సంబంధించిన పత్రాలన్నీ సరిగానే ఉన్నాయి. నాటి నుంచి అమృతరావే ఆ భూమిని కాస్తు చేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది తెలంగాణ ప్రభుత్వం భూప్రక్షాళన కార్యక్రమం చేపట్టగా అమృతరావు తన పేరిట 1.16 గుంటలను పెట్టుకుని 1.34 గుంటలను కొడుకు బాబు పేరిటకు గిఫ్ట్ సెటిల్‌మెంట్ చేశాడు. ఆ భూమిని రికార్డులకు ఎక్కించాలని దరఖాస్తు పెట్టుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా రెవెన్యూ అధికారులు అమృతరావు పేరిట ఉన్న 1.16 గుంటల పట్టాకు ఎక్కించలేదు. బాబు పేరిటకు మార్పించిన 1.34 గుంటల భూమిలో కేవలం 1.26 గుంటలను మాత్రమే రికార్డులో నమోదు చేశారు. మిగతా 8 గుంటలను వారి పక్క సర్వేనంబర్‌లో ఉన్న రైతు పేరిట నమోదు చేశారు. దీంతో ఖంగుతిన్న అమృతరావు, ఆయన కుమారుడు బాబు వెంటనే రెవెన్యూ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో అధికారులు మరోసారి సర్వే చేశారు. అమృతరావుకు భూమిని అమ్మిన వారితో పాటుగా ఆయన పక్కనున్న రైతు వాగ్మూలం తీసుకున్నారు. ఆ భూమి అమృతరావుకు చెందిందేనని నిర్ధారించారు. కానీ ఏడాది గడిచినా రెవెన్యూ అధికారులు ఆ భూమిని పట్టా పాస్ పుస్తకంలో ఎక్కించకపోవడం గమనార్హం. నాటి నుంచి తాసిల్ చుట్టూ తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని బాధిత తండ్రీకొడుకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు వెళ్లి అడిగినా రెండు మూడురోజుల్లో పనవుతందని చెబుతున్నారే తప్ప భూమిని రికార్డులకు ఎక్కించడం లేదని వాపోతున్నారు. తాసిల్ కార్యాయలంలో సీనియర్ అసిస్టెంట్ రహిమ్ ఇదే విషయమై నిలదీయగా మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకుపో అంటూ దురుసుగా ప్రవర్తించాడని వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని, తమ భూమిని రికార్డులో నమోదు చేసి పాస్‌బుక్కు ఇప్పించాలని వారు కోరుతున్నారు.

సమస్య నా దృష్టికి రాలేదు.
ఇదే విషయమైన తాసిల్దార్ రమేశ్‌బాబును నమస్తే తెలంగాణ సంప్రదించగా కోనరావుపేట గ్రామానికి చెందిన బండి బాబు సమస్య తన దృష్టికి రాలేదని వెల్లడించారు. కింది స్థాయి అధికారులు వీఆర్వోలు, సిబ్బంది దరఖాస్తును తనకు అందించలేదని స్పష్టం చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తానని, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుంటే వెంటనే వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
-తేలగ రమేశ్‌బాబు, తాసిల్దార్ (కోనరావుపేట)

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles