ప్లాస్టిక్‌పై బల్దియా పోరు

Mon,May 13, 2019 03:47 AM

-వారం రోజులుగా కొనసాగుతున్న తనీఖీలు
-కమిషనర్ ఆదేశాలతో కఠినంగా చర్యలు
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగరంలో ప్లాస్టిక్ నిషేధంపై నగరపాలక అధికారులు దృష్టి పెట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఆదేశాలు జారీ చేయగా, అధికారులు చర్యలు మొదలు పెట్టారు. ప్లాస్టిక్ వినియోగం విషయంలో గతంలోనే నగరంలోని వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఆదేశాలిచ్చారు. గతంలోనూ అడపదడపగా తనీఖీలు చేసిన అధికారులు ఈసారి మాత్రం కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నగరంలో పెద్ద సంఖ్యలోనే దాడులు చేస్తుండడంతో వ్యాపారవర్గాల్లో అలజడి మొదలైంది. పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేసేందుకు వెళ్తున్న నగరపాలక సిబ్బందిని స్థానిక వ్యాపారులు అడ్డుకుంటుండడంతో పోలీసుల సహకారం తీసుకునేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నగరంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ కవర్లు లేకుండా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
జోరుగా దాడులు.. ప్రత్యేక బృందాలు
నగరంలో వారం రోజులుగా నగరపాలక అధికారులు ప్లాస్టిక్ నిషేధానికి ఆకస్మిక దాడులు మొదలుపెట్టారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగం లేకుండా చేసేందుకు వీలుగా దాడులు చేసేందుకు నగరపాలక సంస్థలో ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బృందంలో 15 మందిని నియమించారు. వీరు వారికి అప్పగించిన డివిజన్లలో తిరుగుతూ ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుకాణదారులు, షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆయా షాపుల్లోని కవర్లను సీజ్ చేయడంతో పాటు వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటికే సుమారుగా రూ. 60 వేలకు పైగానే జరిమానాలు విధించారు.
అన్ని వర్గాలవారీగా అవగాహనలు..
నగరంలోని వాణిజ్య, వ్యాపార వర్గాలవారీగా నగరపాలక కమిషనర్, అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఆయా వర్గాల అసోసియేషన్, సంఘాల నాయకులతో కమిషనర్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. నగరంలో ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుతున్నారు. ఇప్పటికే కూరగాయల వ్యాపారులు, చిన్న తరహా దుకాణదారులు, ఇతర వ్యాపార సంస్థల సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సహకరించాలని కోరుతున్నారు. ఒక వేళ సహకరించకుండా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే కఠినంగా వ్యవహరించడంతోపాటు చట్టప్రకారం క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నగరంలోని కూరగాయలు, కిరణాషాపులు, మటన్, చికెన్ సెంటర్లు, ఇతర అన్ని వ్యాపార కేంద్రాలపై ప్రత్యేకంగా అధికారులు దృష్టి సారిస్తున్నారు. తనీఖీల్లో మొదటిసారిగా ప్లాస్టిక్ కవర్లు దొరికితే జరిమానాలు విధిస్తున్న అధికారులు.. మరోసారిపట్టుబడితే జరిమానాలతోపాటు కేసులను కూడా నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి ప్రజలందరూ సహకరిస్తే తప్పనిసరిగా ప్లాస్టిక్‌ను నిషేధించే దిశగానే అధికారులు చర్యలు చేపడుతున్నారు.

137
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles