కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Sun,May 12, 2019 12:42 AM

-23న కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు
-ఉదయం ఎనిమిది గంటల నుంచే పోస్టల్ బ్యాలెట్..
-ఎనిమిదిన్నర నుంచి ఈవీఎంలు..
-ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు
-ప్రతి నియోజకవర్గంలో ర్యాండమ్‌కు ఐదు పోలింగ్ కేంద్రాల వీవీ ప్యాట్‌ల స్లిప్పులు లెక్క
-28 రౌండ్లలో రిజల్ట్స్ వెల్లడి
-మీడియా కంటే ముందే సువిధలో అప్‌లోడ్
-అధికారిక ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి
-ఏజెంట్ల నియామకానికి 15లోగా దరఖాస్తు చేసుకోవాలి
-విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ:ఈ నెల 23న నిర్వహించే కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు. లెక్కింపునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందని చెప్పారు. ఈ నెల 23న శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాలలో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపడుతామనీ, ఉదయం 8 గంటలకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ జరిగే హాల్‌లో లెక్కిస్తామన్నారు. ఈ లెక్కింపు కొనసాగుతుండగానే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎనిమిదిన్నర గంటల నుంచి ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుందని చెప్పారు.

ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ ఏర్పాటు చేశామనీ, ఆయా నియోజకవర్గాల నుంచే వచ్చే ఫలితాలన్నింటినీ కలిపి లోక్‌సభ రౌండ్ వారీగా ప్రకటిస్తామన్నారు. 28 రౌండ్లలో ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఫలితాలను మీడియాకు వెల్లడించే ముందే ఈసీ ఏర్పాటు చేసిన సువిధ యాప్‌లో అప్‌లోడ్ చేస్తామని తెలిపారు. దేశంలోని ఎక్కడి ప్రజలైనా లోకసభ రౌండ్ వారీగా ఫలితాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కౌంటింగ్ సమయంలో ఏదేని కారణాల వల్ల కంట్రోల్ యూనిట్ డిస్‌ప్లే కాకపోతే సదరు కంట్రోల్ యూనిట్‌ను ఆర్‌వో అండర్‌లో పెడుతామనీ, అందుకు సబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని వెల్లడించారు. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఐదు పోలింగ్ కేంద్రాలను ర్యాండమ్‌గా ఎంపిక చేసి వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కిస్తామనీ, ఈవీఎంకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు మధ్య తేడా వస్తే వీవీ ప్యాట్ స్లిప్పుల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఏదేని సాంకేతిక లోపాలుంటే.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

* 15లోగా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తు చేసుకోవాలి
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి ఈ నెల 15లోగా ఫారం-8లో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. విలేకరుల సమావేశానికి ముందు ఆయన ఆయా పార్టీలకు చెందిన ప్రతినిధులతో మాట్లాడారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఏడు హాళ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారని తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 5.45 గంటలకే కౌంటింగ్ కేంద్రాల్లో ఉండాలని పార్టీప్రతినిధులకు సూచించారు. స్ట్రాంగ్ రూంలను ఉదయం 6 గంటలకు ఎన్నికల పరిశీలకులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరుస్తామని చెప్పారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందనీ, ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ల లెక్క ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపునకు ప్రతి నియోజకవర్గానికీ ప్రతి హాల్‌లో 14 టేబుళ్లు ఉంటాయనీ, ఒక్కో రౌండ్‌లో 14 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తామమని చెప్పారు.

ప్రతి హాల్‌కు 14 టేబుళ్లకు 14 మంది కౌంటింగ్ ఏజెంట్లు, ఆర్‌వో టేబుల్ వద్ద ఒక ఏజెంట్ మొత్తం ఒక నియోజకవర్గానికి 15 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని తెలిపారు. కౌంటింగ్ హాళ్లకు సెల్‌ఫోన్లు నిషేధమని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒక్కో నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాలను లాటరీ ద్వారా ఎంపిక చేసి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామన్నారు. కౌంటింగ్ సమయంలో కంట్రోల్ యూనిట్‌లో పనిచేయని మిషన్‌లను పక్కకు పెట్టి, చివరన అందుకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ వీవీ ప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కిస్తామని తెలిపారు. 23న జరిగే కౌంటింగ్ విజయవంతం అయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రావీణ్య, జిల్లా రెవెన్యూ అధికారి బిక్షానాయక్, జడ్పీ సీఈవో, చొప్పదండి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వెంకటమాధవరావు, పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రతినిధులు, టీఆర్‌ఎస్ ప్రతినిధి టీ రవీందర్‌రావు, బీజేపీ ప్రతినిధి బీ సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మోహన్, స్వతంత్ర అభ్యర్థుల తరుపున ఏ ప్రసన్న, పీ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

190
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles