రూ.5కే రైతుకు భోజనం

Sun,May 12, 2019 12:40 AM

-మార్కెట్‌కు వచ్చిన ప్రతి అన్నదాతకుసౌకర్యం
-ఈ నెల 15న పసుపు మార్కెట్ ప్రారంభం
-ఉప మార్కెట్ కమలాపూర్ యార్డులో రూ.2కోట్లతో అభివృద్ధి పనులు
-జమ్మికుంటలో కొత్త కార్యాలయ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు
-అంశాలన్నీ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన పాలకవర్గం
-వినతి పత్రం అందజేత.. గ్రీన్ సిగ్నలిచ్చిన అమాత్యుడు
జమ్మికుంట: జిల్లాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో అన్నదాతకు అన్ని రకాల సౌకర్యాలు, వసతులు అందించేందుకు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పొనగంటి శారద ఆధ్వర్యంలో పాలకవర్గం సిద్ధమవుతున్నది. పాలకవర్గం సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆరుగాలం కష్టించి పంటను మార్కెట్‌కు తెచ్చిన రైతులకు ఇబ్బంల్లేకుండా చూసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు కేవలం రూ.5కే భోజన సౌకర్యం అందించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మౌలిక వసతుల రూపకల్పన చేస్తున్నది. ఉప మార్కెట్ కమలాపూర్ యార్డులో రూ.2కోట్ల 6లక్షలతో అభివృద్ధి పనులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా 40వేల సామర్థ్యంగల వాటర్ ట్యాంకు నిర్మాణం, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, ప్లాట్‌ఫాంలు, కవర్డ్ షెడ్స్, తదితర పనులు చేపట్టనున్నారు.

జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో, దాని స్థానంలో కొత్త భవనం నిర్మాణం, యార్డు ప్రహరీ వెంట షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక మార్కెట్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధిని పొందుతున్నారు. అయితే ఇటీవల మార్కెట్‌లో క్రయవిక్రయాలు తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పాలకవర్గం పసుపు కొనుగోలు మార్కెట్ ప్రారంభించేందుకు కసరత్తు చేశారు. పలు మార్కెట్లను సందర్శించారు. వ్యాపారులు, అడ్తిదారుల వినతులతో ఈ నెల 15న పసుపు మార్కెట్ ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టారు. కాటన్, పసుపులను నిల్వ చేసుకునేందుకు యార్డులో కోల్డ్ స్టోరేజీ నిర్మాణాలు చేపట్టేందుకు పూనుకున్నారు. మార్కెట్‌లో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి పనులపై మంత్రి ఈటల రాజేందర్‌కు వివరించేందుకు శనివారం చైర్ పర్సన్ శారద ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ మల్లారెడ్డి, డైరెక్టర్ల బృందం హైదరాబాద్‌కు వెళ్లారు. మంత్రిని కలిశారు. మార్కెట్ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అమాత్యుడికి వినతి పత్రం సైతం అందజేశారు. మార్కెట్‌లో అభివృద్ధి పనులు, రైతులకు సౌకర్యాలు, పసుపు మార్కెట్ ప్రారంభం తదితర అంశాలపై మంత్రి రాజేందర్ స్పందించారు. పనులకు గ్రీన్ సిగ్నలిచ్చారు. పసుపు మార్కెట్‌ను ప్రారంభించేందుకు వస్తాననీ హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో చైర్ పర్సన్ శారదతో పాటు వైస్ చైర్మన్ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, డైరెక్టర్లు సయ్యద్ ముజీబ్ హుస్సేన్, సంతోష, బుచ్చయ్య, సారయ్య, అశోక్, రాజు, శ్రీనివాస్‌రెడ్డి, బాబుశెట్టి, మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య, తదితరులు ఉన్నారు.

163
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles