జీలుగ సాగుతో భూసారం వృద్ధి

Sun,May 12, 2019 12:40 AM

-అందుబాటులో రాయితీ విత్తనాలు
-రూ.550కి ముప్పై కిలోలు
-ఏడీఏ దోమ ఆదిరెడ్డి
హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: జీలుగ సాగుతో భూమి సారవంతం అవుతుందనీ, తద్వారా దిగుబడులు పెరుగుతాయని హుజూరాబాద్ ఏడీఏ దోమ ఆదిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీపై జీలుగ విత్తనాలను అందిస్తున్నదనీ, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో రైతులకు సరఫరా చేస్తున్నారనీ, విత్తనాలు కావాలనుకున్న వారు వ్యవసాయశాఖ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. జీలుగ విత్తనాలు సాగు చేసిన 45 రోజుల తర్వాత మడిలో కలియ దున్నాలని పేర్కొన్నారు. వరి నాటు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ముందస్తుగా విత్తనాల సాగు చేపట్టాలన్నారు. వెనుకటి రోజుల్లో రైతులు భూమి సారవంతం చేసేందుకు పశువుల పేడ, చెరువు, కుంటలోని మట్టిని వేసవిలో జారగొట్టేవారనీ.. ఇప్పుడు పశువుల సంఖ్య తగ్గిపోవడం... పేడ కొని వాడాలన్నా ఖర్చుతో కూడుకొన్నది కావడంతో వాటికి బదులు జీలుగ సాగు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చని వివరించారు. కేవలం రూ.550 చెల్లిస్తే ముప్పై కిలోల విత్తనాలు వస్తాయనీ, వీటిని రెండెకరాల నుంచి మూడెకరాల వరకు ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. అదే పశువులు, కోడి ఎరువులకు ట్రాక్టర్ కిరాయితో కలుపుకొని ఒక ఎకరానికి దాదాపు రూ.3500 ఖర్చు అవుతుండగా, జీలుగ విత్తనాల సాగుతో తక్కువ ఖర్చుతో సత్ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. విత్తనాలు కావల్సిన రైతులు పట్టాదారు పాసు బుక్కులు, ఆధార్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles