ప్రొసీడింగ్ ఇచ్చారు..ఆన్‌లైన్ మరిచారు!

Sat,May 11, 2019 01:49 AM

-రెవెన్యూ కార్యాలయం చుట్టూ రైతు ప్రదక్షిణలు
-రేపు మాపు అంటూ ఏడాదిగా సతాయింపు
-ఆన్‌లైన్ కోసం అవస్థలు
-రైతుబంధు కోల్పోయిన బాధితుడు
-ధర్మగంటను ఆశ్రయించిన అమ్మనగుర్తి రైతు తిరుపతి

హుజూరాబాద్, నమస్తే తెలంగాణ ;సైదాపూర్ మండలం అమ్మనగుర్తికి చెందిన లంకదాసరి కొంరయ్యకు నలుగురు కొడుకులు. వీరందరికీ కొంరయ్య భూ పంపకాలు చేశాడు. అయితే ముగ్గురు కొడుకులకు పట్టాలు కాగా, మూడోవాడైన తిరుపతికి కాలేదు. ఇతనికి గ్రామపరిధిలోని సర్వే నంబర్ 22/ఏ లో ఎకరం 25 గుంటలు, 16 సర్వే నంబర్‌లో 0.08గుంటలు వ్యవసాయ భూమి వచ్చింది. 2017 అక్టోబర్‌లో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా భూ మార్పిడి చేయాలని రెవెన్యూ అధికారులకు తిరుపతి వినతి పత్రం సమర్పించాడు. అతని పని చిన్నదే అయినా రెవెన్యూ అధికారులు తమ పాత పద్ధతి మరవలేదు. దరఖాస్తు వెంట వారసత్వంగా వచ్చిన భూ పత్రాలను జత చేశాడు. పని కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ మూడు నెలలు తిరిగాడు. అయితే అన్నదమ్ములుతో అభ్యంతరం లేదని అఫిడవిట్ చేసి తీసుకు రావాలని రెవెన్యూ అధికారులు సెలవు ఇచ్చారు. దీని కోసం అన్నదమ్ములను ఒప్పించి అఫిడవిట్ చేసి వారం రోజులలోపే అందజేశాడు. మళ్లీ రెండు మూడు నెలలు తిప్పించుకున్నారే తప్ప, పని మాత్రం చేయలేదు.

దీంతో విసిగి వేసారిన తిరుపతి ఓ మోస్తారు పేరున్న నాయకుడితో రెవెన్యూ అధికారులకు చెప్పించాడు. అయినా మళ్లీ కొన్ని రోజులు తిప్పించుకొని 2018 చివరలో ప్రొసీడింగ్ అందజేశారు. దీంతో సంతోష పడ్డ తిరుపతి భూమి తన పేరుమీద మార్పిడి జరిగిందనీ, 1బీ తీసుకునేందుకు ఆనందంతో మీసేవకు వెళ్లాడు. అక్కడ తన భూమి వివరాలు మీ సేవ నిర్వాహకుడికి చెప్పగా ఆన్‌లైన్‌లో వెతికాడు. అయితే ఆ భూమి వివరాలు ఆన్‌లైన్‌లో కనబడడం లేదని తిరుపతికి చెప్పడంతో ఆందోళనలో పడ్డాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి దాకా తిరుపతి ఆన్‌లైన్ కోసం రెవెన్యూ అధికారులకు కలువడం.. షరామాములుగానే రేపుమాపు చేద్దామని బదులు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు రెండు దఫాలుగా నష్టపోయాడు.

అధికారుల నిర్లక్ష్యంతోనే రైతుబంధు నష్టపోయా
సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి కోసం ఇచ్చే రైతు బంధును కేవలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే నష్టపోయా. ఇప్పటి వరకు రెండు పసళ్లకు రూ.14,600లు వచ్చేవి. గీ చిన్న పని కోసం రెండేండ్లుగా ఎందుకు తిప్పించుకుంటున్నారో సమజ్ అయితలేదు. వీఆర్‌వోను కలిస్తే తాసిల్దార్ దగ్గరికి వెళ్లాలనీ, అక్కడికి పోతె వీఆర్‌వో దగ్గరికి పొమ్మని చెబుతున్నారే తప్ప పని మాత్రం చేస్తలేరు. ఇప్పటికైనా జర నా మీద దయ ఉంచి పని చేయాలని వేడుకుంటున్నా.
- లంకదాసరి తిరుపతి, రైతు, అమ్మనగుర్తి

104
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles