సువిధ యాప్‌లో లోక్‌సభ ఫలితాలు

Sat,May 11, 2019 01:47 AM

-కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక నిపుణుడు మేఘం దౌల్తా
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈనెల 23వ తేదీన నిర్వహించే లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా ఫలితాలను సువిధ యాప్ ద్వారా ఈసీఐ వెబ్ పోర్టల్ ఆన్‌లైన్‌లో నమోదు చేసి వెంట వెంటనే ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్యూటీ డైరెక్టర్ మేఘం దౌల్తా (ఐటీ) వెల్లడించారు. శుక్రవారం ఆయన అన్ని రాష్ర్టాలు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సువిధ యాప్ పనిచేసే విధానం గురించి జిల్లాల ఎన్నికల అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయనీ, ఈవీఎంలను పకడ్బందీ పోలీసు బందోబస్తు మధ్య ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచినట్లు తెలిపారు. ఈనెల 23న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఓట్ల లెక్కింపు రోజు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉందన్నారు. సుమారు 28 రౌండ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరిగే అవకాశముందని తెలిపారు. ఇందుకోసం సువిధ యాప్ ద్వారా రౌండ్ల వారీగా ఫలితాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎప్పటికప్పుడు ఈసీఐ వెబ్‌సైట్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించారు. ఈనెల 21న ఎస్సారార్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి రిహార్సల్స్ నిర్వహిస్తామనీ, 23న ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రావీణ్య, కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారులు ఎస్ ఆనంద్‌కుమార్, బి చెన్నయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles