భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం

Fri,May 10, 2019 02:43 AM

-నగరంలో అక్రమ భూదందాలపై పోలీస్‌శాఖ సీరియస్
-కబ్జారాయుళ్లపై కఠినంగా వ్యవహరించేందుకు కసరత్తు
-పరిషత్ ఎన్నికల తర్వాత ప్రత్యేక సెల్, బృందం ఏర్పాటు
-ఇప్పటికే వ్యవస్థీకృత ముఠాల వివరాల సేకరణ
-నిజమైన హక్కుదారులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పని
-ఎస్‌వోపీ విధానానికి లోబడి పరిష్కరించే దిశగా అడుగులు
-ధ్రువీకరించిన పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి
నగర కార్పొరేషన్ పరిధిలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్‌శాఖ యంత్రాగం సిద్ధమవుతున్నది. ఇప్పటికే నలుగురు వ్యక్తులపై పీడీయాక్టు కింద కేసులు నమోదు కాగా, ఇక ముందు మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకోసం కమిషనర్ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో ఒక ప్రత్యేక సెల్, టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయబోతున్నది. ఇటు సెల్ ప్రారంభించే నాటికే భూ ఆక్రమణదారుల సమస్త సమాచారం తమ వద్ద ఉండాలని భావిస్తున్న కమిషనర్, ఇప్పటికే వ్యవస్థీకృత ముఠాలుగా ఏర్పడి అదే పనిగా భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యక్తుల వివరాలను సేకరించే పనిని కొంతమంది పోలీసులకు అప్పగించారు. తమ దృష్టికి వచ్చే సమస్యలను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) విధానానికి లోబడి పరిష్కరించే విధంగా సంబంధిత పోలీసులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) :కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న భూ అక్రమణలపై ఉక్కు పాదం మోపేందుకు పోలీసు యంత్రాగం సిద్ధమవుతోంది. ఇప్పటికే నలుగురు వ్యక్తులపై పీడీయాక్టు కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇక ముందు మరింత కఠినంగా వ్యవహరించేందుకు కావాల్సిన కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కమిషనర్ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక సెల్, టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు రంగమంతా సిద్ధం చేసింది. ఎన్నికల అనంతరం ఈ కార్యక్రమానికి అంకురార్పరణ చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే నగరంలో వ్యవస్థీకృత ముఠాలుగా ఏర్పడి అదే పనిగా భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యక్తుల వివరాలను సేకరించే పనిని కొంత మంది పోలీసులకు అప్పగించారు. సెల్ ఆరంభం చేసే నాటికే భూ ఆక్రమణదారుల సమస్త సమాచారం పోలీసుల వద్ద ఉండేలా చర్యలు చేపడుతున్న కమిషనర్.. పోలీసుల దృష్టికి వచ్చే సమస్యలను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) విధానానికి లోబడి పరిష్కరించేలా సంబంధిత పోలీసులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

కరీంనగర్ వైపు చూపు
కరీంనగర్‌లో ఉన్న సౌకర్యాలు, సదుపాయాలు, ఇతర అవసరాల దృష్ట్యా పూర్వ ఉమ్మడి జిల్లాకు చెందిన చాలా మంది కరీంనగర్‌లో భూములు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇల్లు కట్టుకునేందుకు కొంత మంది, అవసరమున్నప్పుడు అమ్ముకునేందుకు మరి కొంతమంది పైసాపైసా పోగుచేసి ఒకటి నుంచి మూడు నాలుగు గుంటల స్థలాన్ని కొని పెట్టుకుంటున్నారు. సింగరేణి, ఎన్టీపీసీలో పనిచేసే ఉద్యోగులతోపాటు వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, ఇటీవలి కాలంలో రైతు కుటుంబాలు కూడా కడుపు కాల్చుకొని జమ చేసిన సొమ్ముతో కొంత ఆస్తిని కొంటున్నారు. నిజానికి జిల్లాలు వేరైనా కరీంనగర్‌లో భూ క్రయవిక్రయాల్లో ఏమాత్రం మార్పు లేదు. రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే నగరం నలుదిశలా విస్తరిస్తున్నది. అంతేకాదు, స్మార్ట్‌సిటీకి ఎంపికైన తర్వాత భూముల ధరలు మరింత పెరగడమే కాకుండా, అపార్ట్‌మెంట్ కల్చర్ కూడా పెరుగుతూ వస్తున్నది. అధికారుల అంచనా ప్రకారం.. ఉత్తర తెలంగాణవాసుల్లో ఎక్కువ మంది భూమిపై పెట్టుబడులను హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్‌లోనే వెచ్చిస్తున్నారు.

* వ్యవస్థీకృత ముఠాలు..
రెక్కలు ముక్కలు చేసుకొని, పైసాపైసా కూడబెట్టుకొని కొనుగోలు చేసిన భూములకు రక్షణ కరువవుతున్నది. ప్రధానంగా కొంత మంది వ్యవస్థీకృత (ఆర్గనైజ్డ్) ముఠాగా ఏర్పడి భూదందాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆక్రమణదారులు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తదుపరి రెండోసారి మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి కిరికిరి సృష్టించడం, వారిని మోఖాపైకి రాకుండా అడ్డుకోవడంలాంటివి చేస్తున్నారు. అలాగే చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకొని సదరు భూమిలో లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల వాళ్లు కొనుగోలు చేసిన స్థలాలపై కన్నేసి వారు రాని సమయంలో చిన్న చిన్న షెడ్స్‌వేసి మోఖాపైకి వెళ్లి తమదే భూమి అని గొడవలు పెడుతున్నారు. మరికొంత మంది నకిలీ దస్ర్తాలను సృష్టించి ముప్పు తిప్పులు పెడుతున్నారు. భూ క్రయవిక్రయాల్లో ఉండే చిన్న చిన్న లొసుగులను ఆధారంగా చేసుకొని నిజమైన యజమానులను ఇబ్బంది పెడుతున్నారు. వివాదాలు సృష్టించి మానసికంగా దెబ్బతీయడం, ఆపై బేరాలకు దిగి సెటిల్‌మెంట్ చేయడం, అడిగింది ఇవ్వకపోతే దాడులకు పాల్పడడం, లేదంటే యజమానుల వద్దకు వెళ్లి ఏదో ఒక సాకుతో బెదిరింపులకు దిగుతున్నారు. కొంత మంది కులాల పేరుతో భయపెట్టిస్తున్నారు. ఈ తరహా వ్యవస్థీకృత ముఠాలకు కొంతమంది న్యాయపరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కొంతమంది కలిసి ఒక వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి ఈ దందాలను కొనసాగిస్తున్నారు. ఈ విధానం వల్ల నిజమైన యజమానులకు అన్యాయం జరగడమే కాదు, నగరంలో భూమి కొంటే రక్షణ లేదన్న అపనమ్మకం ఏర్పడే ప్రమాదమున్నది. దీంతో నగరం ఇమేజ్ తగ్గే ప్రమాదముంటుంది.

ఉక్కుపాదం..
కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కమిషనర్ నేతృత్వంలోనే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు, పోలీసుల దృష్టికి వచ్చే కేసులను నిబంధనలకు లోబడి పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. సర్వీసులో మంచి రికార్డు ఉన్నవారికి ఈ బృందంలో చోటు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. నిజానికి భూ వివాదం అనగానే అది సివిల్ కేసు, పోలీసులకు సంబంధం లేదన్న చర్చ ఉంది. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) విధానాన్ని అమలు చేయనున్నారు. ఎలాంటి భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవచ్చు, ఏ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీలులేదు, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి? ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చు? అన్న వివరాలు ఎస్‌ఓపీలో స్పష్టంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే భూ ఆక్రమణదారుల పని పట్టేందుకు ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్‌తోపాటు ఎంపిక చేసిన కొంతమంది పోలీసులకు దీనిపై శిక్షణ ఇవ్వనున్నారు. భూ వివాదం అనగానే పోలీసులు జోక్యం చేసుకోరన్న విషయంతో కొంతమంది ఆక్రమణదారులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కమిషనర్ గతంలో జరిగిన కేసులు, కబ్జాలు, ఆక్రమణదారులను అనురిస్తున్న పంథాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నారు. వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి అదే పనిగా భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తుల వివరాలను ప్రస్తుతం సేకరిస్తున్నారు. సెల్ ఏర్పాటు చేసే నాటికే ఒక ఐడియాకు రావడానికి వీలుగా కావాల్సిన కసరత్తు చేస్తున్నారు.

కఠినంగా వ్యవహరిస్తాం : కమలాసన్‌రెడ్డి
భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడిన వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. గురువారం తన చాంబర్‌లో విలేకరులతో జరిగిన ఇష్టాగోష్టిలో పలు అంశాలపై మాట్లాడారు. కొంతమంది ఆక్రమణదారులు అనుసరిస్తున్న మార్గాల వల్ల నగరంలోని భూములకు రక్షణ లేదన్న అపనమ్మకం ఉత్పన్నమేయ్యే ప్రమాదం ఉంటుందనీ, దీనిని కట్టడిచేయడమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. అయితే భూ వివాదాల కేసుల విషయంలో పోలీసులు ఏయే విషయాల్లో జోక్యం చేసు కోవచ్చన్న అంశంపై స్పష్టత నిచ్చేందుకు ఎంపిక చేసిన పోలీసులకు శిక్షణ ఇస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులు, ముఠాలపై పీడీ యాక్టు పెట్టేందుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. అలాగే, భూ వివాదాల్లో కేసులు పెట్టాల్సి వస్తే.. అందుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు పూర్తిగా తీసుకుంటామనీ, ఇప్పటికే నలుగురి వ్యక్తులపై పీడీయాక్టు కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.

90
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles