వలస జీవికి అండగా గవర్నర్, కేటీఆర్

Thu,May 9, 2019 12:55 AM

-ఎడారి దేశంలో చిత్రహింసలు పడుతున్న తిమ్మాపూర్ మండలం మక్తపల్లి వాసి
-వీడియో చూసి స్పందించిన నరసింహన్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా భరోసా
-బాధితుడిని రప్పించేలా సాయం చేయాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తి

తిమ్మాపూర్ రూరల్: పొట్టకూటి కోసం అరబ్బు దేశం వెళ్తే.. కపిల్స్ హింస భరించలేక ఇబ్బందులు పడుతున్న వలసజీవిని రప్పించేందుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ స్పందించారు. వివరాల్లోకి వెళితే.. తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య వ్యవసాయంతో పాటు ఇతర పనులు చేసుకుంటూ భార్య విజయ, కుటుంబ సభ్యులను పోషించుకునేవాడు. గతంలో అరబ్ దేశాలకు వెళ్లిన అనుభవం ఉండడంతో మరోసారి సౌదీ వెళ్తే త్వరగా అభివృద్ధి చెందవచ్చనే ఉద్ధేశంతో చిగురుమామిడి మండలం ఒగులాపూర్ గ్రామానికి చెందిన యాదగిరి అనే బ్రోకర్‌ను సంప్రదించాడు. అతనికి రూ.1.30 లక్షలు ముట్టబెట్టి 2 సంవత్సరాల నెల15 రోజుల క్రితం సౌదీలో ఒంటెలు కాసే పనికి వెళ్లాడు. వెళ్లిన ప్రారంభం నుండి యజమాని నిత్యం హింసిస్తున్నా అప్పులు తీర్చేందుకైనా అక్కడే అణగిమనిగి ఉన్నాడు.

తల్లి చనిపోయిందన్నా కూడా..
ఈ క్రమంలో నెలన్నర క్రితం వీరయ్య తల్లి మృతి చెందడంతో తనను పంపించాలని యజమానిని వేడుకున్నాడు. నువు వెళ్తే.. ఒంటెల పాలు పితికేవారు లేరనీ, వేరే కూలీ దొరికాక పంపిస్తాననీ, అప్పటి వరకు వెళ్లడానికి వీలులేదని యజమాని నిరాకరించాడు. ఈ క్రమంలోనే ఓ ఒంటె చనిపోవడంతో సహనం కోల్పోయిన యాజమాని.. తల్లి చనిపోయి బాధలో ఉన్నాడనే సోయి లేకుండా వీరయ్యపై ఇష్టారీతిన దాడికి పాల్పడ్డాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన వీరయ్య సమీపంలోని అక్కడి పోలీసులను ఆశ్రయించగా, స్వదేశానికి తిరిగి పంపించమని యాజమానికి చెప్పి పోలీసులు అక్కడ నుండి పని చేసే చోటుకు పంపించారు.

ఆ సమయంలో 10 రోజులకు పంపిస్తానని పోలీసులకు హామీ ఇచ్చిన యాజమాని.. వెంట తీసుకెళ్లి వీరయ్య వద్ద ఉన్న రెండు ఫోన్లను లాక్కుని పని చేయాలని మళ్లీ హింసించినట్లు ఇతరుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఇక అప్పటి నుండి వీరయ్యకు కుటుంబ సభ్యులకు మధ్య సంబంధం తెగిపోయింది. ఫోను లేకపోవడంతో ఎలాంటి సంప్రదింపులూ లేక ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నాడో అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అప్పటి నుండి బ్రోకర్‌ను గానీ, అధికారులను కానీ సంప్రదించినా ఎలాంటి స్పందనా లేదని వీరయ్య కొడుకు హరీశ్ వాపోతున్నాడు.

ఆవేదనతో వీడియో..
వీరయ్య తనకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదనతో తీసిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. తన యాజమాని తనను పెడుతున్న హింసను వీడియో రూపంలో తీసి వాట్సాప్ ద్వారా పంపించాడు. నెలన్నర నుండి తన తండ్రి ఆచూకీ లభించకపోవడంతో ఇప్పుడు అసలు ఎలా ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

స్పందించిన గవర్నర్, కేటీఆర్
అరబ్ దేశంలో యాజమాని పెడుతున్న బాధను వీడియో తీసి పంపిన వీరయ్య గురించి తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్, టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యాలయాల నుండి వీరయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వీరయ్యను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే వీరయ్య వివరాలను కనుక్కుని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేలా సాయం చేయాలని కేంద్రమంత్రి సుష్మస్వరాజ్‌ను కోరారు.

129
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles