అర్హులందరికీ పట్టా పాసు పుస్తకాలివ్వాలి

Wed,May 8, 2019 02:08 AM

-కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
-తాసిల్దార్లతో సమీక్ష
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: జిల్లాలో అర్హులైన రైతులందరికీ పట్టా పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన పట్టా పాసు పుస్తకాల పంపిణీ, భూరికార్డుల నిర్వహణపై తాసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కేసులు లేని భూసమస్యలను త్వరగా పరిష్కరించి పట్టా పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. పట్టాదారు చనిపోతే వారసులకు మ్యూటేషన్ చేయాలన్నారు. జిల్లాలో రైతుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం పూర్తి స్థాయిలో చేయాలన్నారు. గ్రామాల్లో భూసమస్యలకు సంబంధించి విచారణ త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఖాతాలను ధరణి వెబ్‌సైట్‌లో మార్కు చేయాలనీ, మ్యూటేషన్, పెండింగ్ మ్యూటేషన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. కంప్యూటర్‌లో వివరాల నమోదు వారం రోజులకు పైగా పెండింగ్ ఉంచవద్దని ఆదేశించారు. గ్రామాల వారీగా భూసమస్యలను గుర్తించి గ్రామసభలు నిర్వహించి పరిష్కరించాలన్నారు.

పెండింగ్‌లో ఉన్న డిజిటల్ సంతకాలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మండల పరిధిలోని గ్రామాల్లో భూసమస్యలు ఎక్కువగా పెండింగ్‌లో ఉంటే ఆయా మండలాలకు ప్రత్యేకాధికారులను కేటాయిస్తామని తెలిపారు. భూ సమస్యలు పెండింగ్‌లో పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీఓలు ఆనంద్‌కుమార్, చెన్నయ్య, మెప్మా పీడీ పవన్‌కుమార్, అన్ని మండలాల తాసిల్దార్లు, నాయబ్ తాసిల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

99
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles