ప్లాస్టిక్ రహిత నగరానికి సహకరించాలి

Wed,May 8, 2019 02:05 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర ఇన్‌చార్జి కమిషనర్ భద్రయ్య కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ప్లాస్టిక్ కవర్లు, బ్యాగుల నిషేధంలో భాగంగా బుధవారం నుంచి ఆకస్మిక తనిఖీలు చేపడుతామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు విక్రయిస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మూడు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీరితో పాటు డివిజన్ల వారీగా పారిశుధ్య విభాగం ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ కవర్లు వాడిన వారిని గుర్తించి జరిమానా విధిస్తారని వెల్లడించారు. అవసరమైతే ప్లాస్టిక్ కవర్లు విక్రయించే వారిపై చట్టపరంగా కేసు నమోదు చేస్తామన్నారు. నగరంలో ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఇంటింటా సేకరిస్తున్న చెత్తలోనూ ప్లాస్టిక్ కవర్లు వేరు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.

ఈ విషయంలో ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు డంపింగ్ యార్డుకు రాకుండా చూడాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. దీని కోసం సేకరించిన చెత్త నుంచి ప్లాస్టిక్‌ను వేరు చేసి డీఆర్‌సీ కేంద్రాల వద్ద విక్రయిస్తున్నామనీ, ట్రాక్టర్లలోనూ ప్లాస్టిక్ కవర్లను వేరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ కవర్లు, బ్యాగుల నిషేధం విషయంలో వ్యాపారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. వేసవిలో నల్లాలకు మోటార్లు బిగిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. నల్లాలకు మోటార్లు బిగించడంతో చివరి ప్రాంతాల్లోని ప్రజలకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles