ఢిల్లీ నుంచి గల్లీదాకా గులాబీమయమే

Tue,April 23, 2019 02:40 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ఢిల్లీ నుంచి గల్లీదాకా గులాబీ నీడలో గెలిచిన ప్రజా ప్రతినిధులే అధికారంలో ఉండాల్సిన అవసరముందని ఎంపీ బీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రతిమ మల్టీప్లెక్స్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలను చూస్తే గత ఎన్నికల్లోనే తాను 2.05 లక్షల భారీ మెజార్టీతో గెలిచాననీ, ఇపుడు తన రికార్డును తానే బద్దలు కొడుతూ మరింత ఎక్కువ మెజార్టీతో గెలువబోతున్నానని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో ఇప్పటి వరకు రెండు విడతల్లో పార్లమెంట్ ఎన్నిలు జరిగాయనీ, ఈ నెల 23న మూడో విడత ఎన్నికలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న తన సహచర ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తకు పరిచయం ఉన్న అధికార యంత్రాంగంతో, పత్రికా రంగంలో పని చేస్తున్న కొందరు మిత్రులతో మాట్లాడితే దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేశారన్నారు.

తిరిగి బీజేపీ అధికారంలోకి రాదనీ, అధికారంలోకి వచ్చే స్థాయికి కాంగ్రెస్ పుంజుకోలేదని అభిప్రాయపడ్డారు. పలు మీడియాలు నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో కూడా ఇప్పటి వరకు ఇదే విషయం స్పష్టమైందని వివరించారు. కాంగ్రెస్, బీజేపేతర పార్టీలవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి, ఒడిశాలో నవీన్‌పట్నాయక్, బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, అఖిలేశ్‌యాదవ్ వీళ్లు కాంగ్రెస్‌తోగానీ, బీజేపీతోగానీ పొత్తుపెట్టుకోకుండా పోటీ చేసిన నాయకులనీ, వీళ్ల నేతృత్వంలోని పార్టీల ప్రాబల్యం పార్లమెంట్‌లో చాలా పెద్ద ఎత్తున ఉండబోతున్నదన్నారు. కేంద్రంలో పరిపాలన చేసే సామర్ధ్యం, శక్తి ఈ పార్టీలకు ఉంటుందనే స్పష్టత వస్తున్నదన్నారు. ప్రధాని మోదీ తనకు అనుకూలంగా చేసుకుంటున్న ప్రచారం నీటి బుడగ అని తేలిపోయిందనీ, బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేవన్నారు. మోదీగానీ, రాహుల్‌గానీ ఈ దేశాన్ని వాళ్ల మీద వాళ్లు నిలబడి పాలించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణ వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించబోతున్నదని పేర్కొన్నారు. 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాబోయేది మంచి కాలమేనన్నారు. కేంద్రంలో తెలంగాణకు ప్రధాన పాత్ర ఉంటదనీ, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించుకుంటామని స్పష్టం చేశారు.

వరుసగా వచ్చిన ఎన్నికల కారణంగా కోడ్ అమలులో ఉండి పాలన ముందుకు సాగలేక పోతున్నదనీ, ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపంతో పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులే అధికారంలో ఉండబోతున్నామని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగానైతే టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారో అదే విధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ కేంద్రంలోనే ఓటమి చవిచూస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏమీ చేయలేదనీ, మే 23న ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే 24న ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయక తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కే అవకాశమే లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో తామే దిక్కు అని అనుకునే రాహుల్, మోదీలకు దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ వినోద్‌కుమార్ వెంట ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, నాయకులు వై. సునీల్‌రావు, బండారి వేణు, తదితరులున్నారు.

115
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles