సర్జ్‌పూల్ పరిశీలన సక్సెస్..

Tue,April 23, 2019 02:40 AM

ధర్మారం : కాళేశ్వరం ఆరో ప్యాకేజీలో భాగంగా నంది మేడారం వద్ద నిర్మించిన సర్జ్‌పూల్‌లో నీటి లీకేజీల పరిశీలన విజయవంతమైంది. మూడు రోజులుగా గజ ఈతగాళ్లలో శోధించిన అధికారులు, ఏడు గేట్ల వద్ద ఎలాంటి లీకేజీలు లేవని నిర్ధారించారు. దీంతో ప్రాజెక్ట్ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ పర్యవేక్షణలో ఎల్లంపల్లి జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి, రెండో దఫా నీటిని సర్జ్‌పూల్‌లోకి విడుదల చేశారు. అనంతరం సర్జ్‌పూల్ మొదటి గేట్ నుంచి నీటిని విడుదల చేసి, మొదటి పంప్‌లోకి పంపించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. పంప్‌లో పరీక్షలు పూర్తయిన అనంతరం వెట్న్ నిర్వహించి, నంది మేడారం రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాళేశ్వరం ఆరో ప్యాకేజిలోని మొత్తం పంప్‌హౌస్‌లోని ఏడు గేట్ల పంపుల కాంక్రీట్ పనులు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 17న ప్రాజెక్ట్ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి పర్యవేక్షణలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వేమునూరు రెగ్యులేటర్ గేట్ల ద్వారా సర్జ్‌పూల్‌లోకి నీటిని విడుదల చేశారు.

అనంతరం మూడు రోజుల పాటు గజ ఈతగాళ్లతో సర్జ్‌పూల్‌లో లీకేజీలను పరిశీలించారు. రెండు రోజుల్లో ఆరు గేట్లను శోధించిన ఈతగాళ్లు, సోమవారం చివరిదైన ఏడో గేట్‌ను కూడా తనిఖీ చేసి, ఎలాంటి నీటి లీకేజీలు లేవని నిర్ధారించారు. అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కాల్వలోకి వదిలినట్లు ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సర్జ్‌పూల్‌లో 124 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ మట్టం ఉండగా, 133 మీటర్లకు చేరగానే ఎల్లంపల్లి నుంచి నీటిని నిలిపివేస్తామని తెలిపారు. సర్జ్‌పూల్‌లో ఎక్కువ నీటిని నిల్వ ఉంచి, ఇంకా లీకేజీలను పరిశీలిస్తామని చెప్పారు. ఈ క్రమంలో సర్జ్‌పూల్‌లోని ఫస్ట్ గేట్ ద్వారా మొదటి పంపులోకి నీటిని పంపించే ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. సర్జ్‌పూల్ నుంచి పంప్‌లోకి సక్రమంగా నీరు వెళ్తుందా..? లేదా అనే విషయంతోపాటు పంప్ మోటార్ల పనితీరుపై మరో ప్రత్యేక పరీక్షలు చేస్తామని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. మొదటి పంప్ విజయవంతంగా నడిస్తే ఇక్కడి నుంచి వెట్న్ చేసి, నంది మేడారం రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేయడానికి ప్రాజెక్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంతా సక్రమంగా ఉంటే ఈ నెల 24న వెట్న్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

పూర్తయిన కాంక్రీట్ పనులు..
నంది మేడారం అండర్ టన్నెల్‌లోని పంప్‌హౌస్‌లో కాంక్రీట్ పనులు పూర్తయినట్లు నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. ఇక్కడి భూగర్భంలో మొత్తం ఏడు పంపులు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే ఐదు పంపుల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 6, 7 పంపుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవలే ఆరో పంపు వద్ద కాంక్రీట్ స్లాబ్ పనులు పూర్తికాగా, ఏడో పంప్ వద్ద సోమవారం కాంక్రీట్ స్లాబ్ వేశారు. పనులను ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు.

118
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles