అయ్యో.. రామయ్యా

Mon,April 22, 2019 01:13 AM

- అధికారుల నిర్వాకంతో ఆగమైన రైతన్న
- కొత్త పాసుపుస్తకంలో భూమి నమోదు కోసం అగచాట్లు
- 3.31 ఎకరాలుంటే.. 1.11 ఎకరాలకే జారీ
- మిగతా భూమి కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
- కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోని అధికారులు
- ధర్మగంటతో గోడు వెల్లబోసుకున్న రామయ్య
- చిగురుమామిడి మండలం రేకొండలో రెవెన్యూ లీలలు
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొత్త పాసు పుస్తకాలు వస్తున్నయని సంబురపడ్డ వేలాది మంది రైతుల్లో చిగురుమామిడి మండలం రేకొండకు చెందిన గండ్రతి రామయ్య ఒకరు. కానీ, ఆ పుస్తకం అతని చేతిలో పడగానే సంబురం మటు మాయమైంది. అధికారులు చేసిన నిర్వాకం చూసి బిత్తర పోవాల్సి వచ్చింది. గిదేంది సారు.. నాకు 3.31 ఎకరాలుంటే 1.11 ఎకరాలకే పాసుపుస్తకం ఇచ్చిన్రు.. మిగతా భూమి ఏమైంది? అని నెత్తీ నోరు మొత్తుకున్నాడు. అయినా అతని గోడు పట్టించుకున్న వారు లేరు. రోజులు గడుస్తున్న కొద్దీ రామయ్యలో ఆందోళన పెరిగింది. మిగతా భూమి తన పాసు పుస్తకంలో నమోదు చేయాలని రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. నమస్తే తెలంగాణ మోగించిన ధర్మగంట విషయం తెలుసుకున్న రామయ్య కరీంనగర్‌లోని కార్యాలయానికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యాడు.

భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రెవెన్యూ అధికారులు చేసిన తప్పులకు చిగురుమామిడి మండలం రేకొండకు చెందిన గండ్రతి రామయ్యలాంటి ఎందరో రైతులు ఇపుడు అష్టకష్టాలు పడుతున్నారు. మానసికంగా కుంగి పోతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు వంటి పథకానికి దూరమవుతున్నారు. ఇలా జరిగిందేమిటని అధికారులను అడిగితే పొరపాటుగా నమోదైంది.. పునరుద్దరిస్తామంటారేగానీ పని చేయకుండా నెలలపాటు తిప్పుకుంటున్నారు.

రామయ్య భూమి ఏమైపోయింది..
గండ్రతి రామయ్యకు సర్వే నంబర్ 866లో 3.15 ఎకరాల భూమి ఉండేది. ఇందులో 1.20 ఎకరాల భూమి ఇదే గ్రామానికి చెందిన మరో రైతుకు విక్రయించి సర్వే నంబర్ 875/సీలో సాదాబైనామా ద్వారా మరో రైతు వద్ద ఎకరం భూమి కొన్నాడు. అయితే సర్వే నంబర్ 866లో తన పేరట ఇంకా మిగిలి ఉన్న 1.35 ఎకరాలు పహాణీ, 1బీ రిజిస్ట్రార్లలో వస్తోంది. అంటే రామయ్యకు సర్వే నంబర్ 866లో 1.35 ఎకరాలు, సర్వే నంబర్ 875/సీలో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన మరో ఎకరం భూమి ఇంకా అతని పేరిట ఉన్న 830/బీ/ఏలో 6 గుంటలు, 867/ఏ/సీలో 20 గుంటలు, 907/ఏ/ఏలో 10 గుంటలు కలిపి మొత్తం 3.31 ఎకరాలు పట్టాదారు పాసు పుస్తకంలో రావాల్సి ఉంది. కానీ, రామయ్య పేరిట 1.11 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు కొత్త పాసు పుస్తకం జారీ చేశారు. 3.31 ఎకరాల్లో కబ్జాలో ఉన్న రామయ్యకు సంబంధించిన మరో 2.20 ఎకరాల భూమిని రికార్డుల్లో తారుమారు చేశారు. కేవలం రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల కారణంగానే రామయ్యకు అన్యాయం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అధికారులు రామయ్య పట్ల చేసిన తప్పు కారణంగా రెండుసార్లు అతనికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పథకం కింద పెట్టుబడి సహాయం అందలేదు. దీనికి బాధ్యులు ఎవరనే ప్రశ్న సర్వత్వా ఉత్పన్నమవుతోంది.

కన్నీటి పర్యంతమైన రామయ్య..
రామయ్య తనకు రెవెన్యూ అధికారులు చేసిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు నమస్తే తెలంగాణ ధర్మగంటకు వచ్చాడు. తాను ఏవిధంగా నష్టపోయానో..? ఈ సందర్భంగా వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. గతంలో తన పేరిట ఉన్న భూమికి మోకాపై ఉన్నానని, పహాణీ, 1బీ రిజిష్ర్టాల్లో కూడా తన పేరిటనే భూమి ఉన్నదనీ, అయినా రెవెన్యూ అధికారులు కొత్త పట్టాదారు పాసు పుస్తకంలో తకు కేవలం 1.11 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల చుట్టూ తిరిగీ తిరిగి విసిగి వేసారి పోయిన తాను ఓ అధికారికి రూ.10 వేలు కూడా ముట్టజెప్పాననీ, అయినా తన పని కావడం లేదని వాపోయాడు. తన పేరిట ఉన్న భూమిని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని మరో ఇద్దరు వ్యక్తుల పేరిట రాశారని రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వద్దకు వెళ్తే పొరపాటు జరిగింది.. సరి చేస్తాంఅని చెప్పడమే తప్పితే తన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. సర్వే నంబర్ 866లో తన పేరిట పహాణీలో 1.35 ఎకరాలు ఉంటే 0.15 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు దిద్దినట్లు కూడా రామయ్య చెబుతున్నాడు. ఈ విషయమై గత జనవరి 21న సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌ను కలిసి తన గోడు వెల్లబోసుకున్నాననీ, విచారణ కోసం ఆయన కింది స్థాయి అధికారులను ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదనీ, సమస్య పరిష్కారం కాలేదని వాపోయాడు. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నాడు.

* మొదటి విడత : ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, సైదాపూర్, వీణవంక, మానకొండూర్ మండలాలు
* ఎన్నిక జరిగే స్థానాలు : 7 జడ్పీటీసీ, 89 ఎంపీటీసీ
* నామినేషన్లు స్వీకరించే సమయం : ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు

369
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles