అన్ని స్థానాలనూ కైవసం చేసుకోవాలి

Sat,April 20, 2019 12:51 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో పని చేసే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని స్పష్టంచేశారు. తప్పటడుగు వేసి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎన్నో పదవులు ఉన్నాయని తెలిపారు. శుక్రవారం స్థానిక పద్మనాయక మినీ కల్యాణమండపంలో నియోజకవర్గంలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ప్రతి ఎంపీటీసీ స్థానానికి మండలాలవారీగా నగరానికి చెందిన నాయకులను పరిశీలకులుగా, సమన్వయ కర్తలుగా నియమించామని చెప్పారు. వీరు పార్టీ తరపున పోటీ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా ఉంటారే తప్ప ఎలాంటి పెత్తనం చేయరని స్పష్టంచేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వారిది ప్రచార ఆర్బాటం మాత్రమేననీ, పనులు చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 41 శాతం ఓట్లు వస్తే 2018 ఎన్నికల్లో 43.5 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్‌కుమార్ 2 లక్షల మెజార్టీతో గెలవడం ఖాయమని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌కున్న ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని తెలిపారు. ఈ స్థానిక ఎన్నికల్లోనూ ప్రభుత్వంలో ఉన్న పార్టీలకే ఓట్లు పడుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి, అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు జూన్ నాటికి మధ్య మానేరులోకి వస్తుందని తెలిపారు. ప్రజల చిరకాల వాంఛ ఇప్పుడు పూర్తి కానుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి బీడు భూమికి సాగునీరు అందించాలని తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వచ్చే సీజన్ నాటికి రైతులకు సాగునీటితోపాటు కరెంటుకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు జూన్ నాటికి కరీంనగర్‌కు వస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రెవెన్యూ, మున్సిపల్ విభాగాల సంస్కరణలకు 95 శాతం మంది ప్రజలు ఆమోదం తెలుపుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా కూడా రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు చర్యలు తీసుకోలేదనీ, కాని సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నారన్నారు. రైతులు, ప్రజలకు లాభం చేకూర్చాలన్న లక్ష్యంతోనే సీఎం చర్యలు చేపడుతున్నారని స్పష్టంచేశారు. మాయ మాటలు చెప్పే విపక్షాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీ నేతలను ఓడించే ప్రయత్నం చేయవద్దన్నారు. స్థానిక నాయకులే సమర్థవంతమైన, గెలుపు అవకాశాలు ఉన్నవారిని ఎంపిక చేసుకొని తమకు సూచించాలన్నారు. ఈ సారి అవకాశం రాలేదనీ, స్వార్థంతో ఓడించే ప్రయత్నాలు చేస్తే ఇబ్బంది పడుతారన్నారు. తప్పుదారిలో వెళ్లి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. పార్టీ కోసం పని చేస్తే తప్పనిసరిగా పదవులు వస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో అనేక పదవులు భర్తీచేయనున్నారనీ, పార్టీ కోసం పని చేసే నాయకులకు పదవులు వస్తాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని స్థానాలను గెలుచుకొని సీఎం కేసీఆర్‌కు కానుకగా అందిద్దామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను శిరసావహించాలని సూచించారు. సమావేశంలో మేయర్ రవీందర్‌సింగ్, ఎంపీపీ రమేశ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జమీలొద్దీన్, మండల నాయకులు కాశెట్టి శ్రీనివాస్, రాజేశ్వర్‌రావు, బాలయ్య, నగర నాయకులు చల్లా హరిశంకర్, ఏవీ రమణ, బండారి వేణు, శ్రీకాంత్, గందె మహేశ్, బుచ్చిరెడ్డి, వాల రమణారావు, కంసాల శ్రీనివాస్, పెద్దపల్లి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరికలు
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరిలో దావు ఎల్లయ్య, చెలుకల భూపతిరెడ్డి, వెంకటేశ్, అనిల్, కనుకుట్ల మహేశ్, కచ్చు వీరేశంతో పాటుగా 50 మందికి పైగా యువకులు గులాబీ కండువాలు కప్పుకున్నారు.

163
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles