ప్రాణం తీసిన చెరువుల పంచాయితీ

Sat,April 20, 2019 12:51 AM

కరీంనగర్ రూరల్: ఓ చేపల చెరువు పంచాయతీ నిండు ప్రాణం తీసింది. 20 ఏండ్లుగా సాగుతున్న ఈ గొడవ చివరికి మత్స్య పారిశ్రామిక సంఘం గ్రామాధ్యక్షుడు బొజ్జ తిరుపతి (45) ప్రాణం తీసింది. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ హత్య జిల్లాలో కలకలం రేపింది. కరీంనగర్ రూరల్ పోలీసులు, హతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. చామనపల్లిలోని అప్పన చెరువు, రాజసముద్రం చెరువులున్నాయి. వీటి పరిధిలో ఏర్పడిన మత్స్య పారిశ్రామిక సహకారం సంఘానికి బొజ్జ తిరుపతి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే, 20 ఏళ్లుగా ఈ చేపల చెరువుల విషయంలో గ్రామంలోని బొజ్జ, మేకల వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చెరువుల్లో చేపలు పట్టుకునే విషయంలో గొడవలు పడుతూ, పలుసార్లు పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు పెట్టుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం పెరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు గ్రామంలోని అప్పన చెరువు ఒక వర్గం వారికి, రాజసముద్రం చెరువు మరో వర్గానికి కేటాయించాలని నిర్ణయం జరిగింది. గ్రామంలో మరో మత్స్య సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనకు అధ్యక్షుడు బొజ్జ తిరుపతి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు సద్దుమణుగుతాయని అంతా భావించారు. ఈ క్రమంలో మత్స్య సహకార సంఘం ద్వారా అప్పన చెరువులో చేపలు పెంచుతున్నారు.

చెరువులో నీరు లేక చేపలు చనిపోతున్నాయని శుక్రవారం సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో చెరువు పక్కన ఉన్న ప్రతాప్‌రెడ్డి వ్యవసాయ బావి నుంచి చెరువులోకి పైపులైన్ ద్వారా చేపలకు నీరు పెట్టేందుకు తిరుపతి అక్కడికి వచ్చాడు. చెరువు మత్తడి ప్రాంతంలో పైపులైన్ పనులు చేస్తుండడం గమనించిన మేకల వర్గీయులు కొందరు తిరుపతి దగ్గరకు వచ్చారు. ఆయనను అంతమొందించేందుకు ఇదే సరైన సమయంగా భావించి కొందరు ముందుగా అతడిపై దాడికి దిగారు. మేకల వర్గీయుల దాడిలో గాయపడిన తిరుపతిని అతడి వెంట ఉన్న కొందరు ద్విచక్ర వాహనంపై దవాఖానకు తరలించే ప్రయత్నం చేస్తుండగా మేకల వర్గీయులు మరోసారి దాడికి పాల్పడ్డారు. వాహనం పై నుంచి కిందికి లాగి, తిరుపతి మెడను రుమాలుతో చుట్టి కొంత దూరం లాక్కుపోయారు. అక్కడ పడేసి దగ్గరలో ఉన్న బండ రాళ్లతో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చేపల చెరువు విషయంలో జరుగుతున్న గొడవల కారణంగానే తిరుపతి హత్య జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలాన్ని కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి, రూరల్ ఏసీపీ ఉషారాణి పరిశీలించారు. మృత్యుడి భార్య విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిని హత్య చేసిన వారు 15 నుంచి 20 మంది ఉంటారని స్థానికులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

299
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles