విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

Fri,April 19, 2019 02:55 AM

రామడుగు: రెవెన్యూ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ ఆనంద్‌కుమార్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఉదయం ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి ప్రస్తుతం 530 పట్టా పాసు పుస్తకాలు వచ్చినట్లు తెలిపారు. సంబంధిత వీఆర్వోలు గ్రామాల్లోకి వెళ్లి గానీ, మండల కేంద్రంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి శనివారంలోగా రైతులకు అందజేయాలన్నారు. గత ఆరునెలలుగా అధికారులందరూ ఎన్నికల విధుల్లో ఉన్నందున రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేయడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. రైతులకు సంబంధించిన దరఖాస్తులను తమ వద్ద ఉంచుకున్న వీఆర్వోలకు మెమోలు అందించాలని తహసీల్దార్‌కు సూచించారు. కాగా ఇప్పటి వరకు మండలానికి 12,502 పాసు పుస్తకాలు వచ్చాయనీ, సమస్యలు లేని 11,519 పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. సాంకేతిక కారణాలతో 453 పాసు పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. మరో వెయ్యి 59 ఖాతాలకు సంబంధించిన పాసు పుస్తకాలు రైతులకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. సీనియర్ అసిస్టెంట్ అశోక్, ఆర్‌ఐ తారాదేవి, వీఆర్వోలు పాల్గొన్నారు.

భూసమస్యల పరిష్కారానికి కృషి
గంగాధర: పెండింగ్‌లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్డీఓ ఆనంద్‌కుమార్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు సరి చేసిన భూముల వివరాలు, రైతులకు అందజేసిన పట్టా పాసుపుస్తకాలు, పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో మండలంలోని తాడిజెర్రి, గట్టుభూత్కూర్, గర్షకుర్తి, హిమ్మత్‌నగర్, చిన్నాచంపల్లి గ్రామాల రైతులు భూసమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆర్డీఓ ఆనంద్‌కుమార్ రైతులతో మాట్లాడారు. సమస్యలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిష్కారానికి కృషిచేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. తహసీల్దార్ కవిత, డిప్యూటీ తహసీల్దార్ విశాలి, ఆర్‌ఐలు కనుకరాజు, రహీం, వీఆర్వోలు పాల్గొన్నారు.

73
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles