చకచకా సాగు సమగ్ర సర్వే

Wed,April 17, 2019 12:47 AM

- జిల్లాలో 1,53,646 మంది రైతులు
-వచ్చే నెల 15 వరకు పూర్తి చేయాలని ఆదేశాలు
-గ్రామాల్లో పర్యటిస్తున్న వ్యవసాయ అధికారులు
-పరిషత్ ఎన్నికల్లో వ్యవసాయ శాఖకు మినహాయింపు
-పంట కాలనీల ఏర్పాటుపై ప్రభుత్వ దృష్టి
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేసేందుకు పంట కాలనీలను ఏర్పాటు చేయాలనీ, తద్వారా సాగు విధానంలో సమతుల్యతను రైతులకు అలవర్చాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ప్రధానంగా పంట కాలనీల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు సాగు సమగ్ర సర్వే చేపట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు స్థానిక అవసరాలు, డిమాండ్‌ను గుర్తించి సంయుక్తంగా బేరీజు వేసేందుకు ఈ సర్వే ఉపయుక్తం కాబోతోంది. పంటల రకాల్లో సమతుల్యం సాధించేందుకు కూరగాయలు, పండ్ల తోటల సాగుతో పాటు ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ సర్వే ద్వారా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఆయా గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల అవసరాలకు సరిపడా ఆహారధాన్యాలు, కూరగాయలు ఆయా గ్రామాల్లోనే పండించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సర్వే చేపడుతున్నారు. ఇందుకు ముందుగా రైతులు, భూముల సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలను సేకరించేందుకు 39 అంశాలను సర్వే పత్రాల్లో పొందుపర్చారు. క్షేత్ర స్థాయి అధికారులు వీటిని రైతుల వ్యక్తిగత వివరాలు, వారు సాగు చేస్తున్న పంటల వివరాలను సేకరిస్తున్నారు.

* వేగంగా సమగ్ర సర్వే
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు గత డిసెంబర్‌లో ప్రారంభించి ఈ ఏడాది మార్చి వరకు పూర్తి చేయాలని సిద్ధపడ్డారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ సర్వేను తాత్కాలికంగా నిలిపి వేశారు. ఆ తర్వాత పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆలస్యం జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొంటూనే వ్యవసాయ శాఖ అధికారులు సాగు సమగ్ర సర్వే నిర్వహిస్తూ వచ్చారు. సోమవారం నుంచి శాఖ అధికారులు పూర్తిగా సమగ్ర సర్వేలోనే ఉండాలని శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో సోమవారం నుండి ముమ్మరం చేశారు. జిల్లాలో మొత్తం 1.62 లక్షల మంది రైతులు ఉండగా, రెవెన్యూ శాఖ పట్టాదారు పాసు పుస్తకాలు పొంది, ఆన్‌లైన్‌లో నమోదైన రైతుల సంఖ్య మాత్రం 1,53,646 మందిగా ఉంది. జిల్లాలో 1,58, 755 హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూములు ఉండగా 1,23,414 హెక్టార్లలో ఆహార, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ఏ ప్రాంతంలో ఏ రైతులు ఎలాంటి పంటలు సాగు చేస్తున్నారు? అనే విషయాలపై సాగు సమగ్ర సర్వేను వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు నిర్వహించబోతున్నారు. 39 అంశాలతో కూడిన ఫారాలను స్థానికంగానే ముద్రిస్తున్నారు. ఈ ఫారాలు ముద్రించిన వెంటనే సర్వే ప్రారంభించనున్నారు. మే 15 వరకు సర్వే పూర్తి చేసి జిల్లాలో ఎలాంటి పంటలు పండిస్తారు?, స్థానిక అవసరాలు ఏ విధంగా ఉన్నాయనే విషయంలో స్పష్టత వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు..

* గ్రామాల్లో వ్యవసాయ అధికారులు
వ్యవసాయ అధికారులు సోమవారం నుంచే గ్రామాల్లో ముమ్మరంగా పర్యటించి సాగు సమగ్ర సర్వే చేపట్టారు. దాదాపు అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వేను ముమ్మరం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ కూడా సర్వేను పర్యవేక్షించారు. ఆయన స్వయంగా రామడుగు మండలం కొరటపల్లి, గంగాధర మండలం న్యాలకొండపల్లి, ఇల్లందకుంట మండలం మల్యాల, సీతంపేట పర్యటించి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి సర్వేను ముమ్మరం చేశామని చెప్పారు. 39 అంశాలతో కూడిన సర్వేను వచ్చే నెల 15 వరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో 1,53,646 మంది రైతులు ఉండగా, 57 క్లష్టర్లుగా విభజించి సర్వే చేపట్టినట్లు తెలిపారు. రైతుల వారీగా పంటల సాగు, సాగునీటి వసతి, అందుబాటులో ఉన్న వనరులు, మార్కెటింగ్ సదుపాయాలు, తదితర ముఖ్యమైన సమాచారం ఈ సర్వే ద్వారా తెలుస్తుందని జిల్లా వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు..

187
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles