విలీన గ్రామాలకు పూర్తి సేవలందిస్తాం

Wed,April 17, 2019 12:45 AM

* ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం
* గ్రామపంచాయతీ కార్యాలయాలను
నగరపాలక డివిజన్ ఆఫీసులుగా మర్చాం
* సమస్యలుంటే అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు
* మున్సిపల్ కార్యాలయానికి రానవసరం లేదు
* త్వరలోనే నోటీస్ బోర్డులపై అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు
* ఆన్‌లైన్‌లోనే నూతన భవన నిర్మాణాలకు అనుమతులు
* నమస్తే ఇంటర్య్యూలో బల్దియా కమిషనర్ కన్నం సత్యనారాయణ
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాలకు బల్దియా నుంచి పూర్తిస్థాయి సేవలందిస్తామని నగర కమిషనర్ కన్నం సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలను నగరపాలక డివిజన్ కార్యాలయాలుగా మార్చామనీ, ఆయా గ్రామాల ప్రజలు తమ పనుల కోసం అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వాటిని వెంటనే పరిష్కరించి ధ్రువీకరణ పత్రాలు అందిస్తామనీ, ఈ మేరకు ఎనిమిది గ్రామాలకు సంబంధించి ఇప్పటికే వివిధ విభాగాల అధికారులకు బాధ్యతలు ఇచ్చినట్లు చెప్పారు. విలీన గ్రామాల్లో బల్దియా ద్వారా అందే సేవలు, ఆయాచోట్ల ప్రజలకు తలెత్తుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారాలపై మంగళవారం నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.

నమస్తే : ఏయే గ్రామాలు విలీనమయ్యాయి?
కమిషనర్ : నగర శివారులోని పద్మనగర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లి, అల్గునూర్ గ్రామాలు విలీనమయ్యాయి. ఆ గ్రామాలను ఇప్పటికే వాటి సమీప డివిజన్లకు అనుసంధానం చేశాం. ఆయా డివిజన్లలో బల్దియా నుంచి వివిధ విభాగాల బాధ్యతలు చూస్తున్న అధికారులకు అప్పగించాం.

నమస్తే : పంచాయతీ సిబ్బంది ఎలాంటి పనులు చేపడుతున్నారు?
కమిషనర్ : ప్రస్తుతం విలీన గ్రామాల్లోని పంచాయతీ కారోబార్లను బల్దియా సిబ్బందిగానే వినియోగించుకుంటున్నాం. ఇప్పటి వరకు వారు గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ ప్రస్తుతం వారితోనే కొనసాగిస్తున్నాం.

నమస్తే : విలీన గ్రామల ప్రజలు తమ పనుల కోసం డివిజన్ కార్యాలయాలకు వెళ్తే ఇక్కడ ఏమీ లేదు.. బల్దియాకే వెళ్లాలని సూచిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీటిపై మీరేమంటారు ?
కమిషనర్ : ఇప్పటికే డివిజన్ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందికి స్పష్టంగా ఆదేశాలిచ్చాం. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి బల్దియా నుంచి ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదేశాలు జారీ చేశాం. ప్రతి పని కోసం నగరపాలక సంస్థ కార్యాలయానికి ప్రజలు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడి ప్రజలు అక్కడే డివిజన్ కార్యాలయాల్లో జనన, మరణ, ఓనర్‌షిప్, తదితర ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎవరైనా అభ్యంతరం చెబితే మాకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. డివిజన్ కార్యాలయాల్లోని సిబ్బంది ప్రజలకు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటాం.

నమస్తే : గ్రామాల్లో నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎక్కడ చేసుకోవాలి? ఎన్ని అంతస్థుల వరకు చేసుకోవచ్చు?
కమిషనర్ : ప్రస్తుతం విలీన గ్రామాల్లో నూతన భవన నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నగరపాలక సంస్థ లైసెన్స్ ఇంజినీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులను నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పరిశీలించి, అనుమతులు ఆన్‌లైన్‌లోనే మంజూరు చేస్తారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో మాత్రం ఎన్ని అంతస్థుల వరకు అయినా దరఖాస్తులు మాత్రం బల్దియాలోనే చేయాల్సి ఉంటుంది. వాటి పరిధిని అనుసరించి అవసరమైతే సుడాకు పంపించి అనుమతులు ఇస్తాం.

నమస్తే : ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయా?
కమిషనర్ : నగరపాలక సంస్థలో మాత్రం అన్ని సేవలనూ ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నాం. విలీన గ్రామాల విషయంలో మాత్రం ఇంకా అందుబాటులో లేవు. అందుకే మ్యాన్‌వల్‌గానే ఆయా గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తున్నాం.

నమస్తే : విలీన గ్రామాల్లో సమస్యలపై ఏ అధికారులకు ఫిర్యాదులు చేయాలో తెలియని పరిస్థితి ఉంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కమిషనర్ : ఇప్పటికే విలీన గ్రామాల్లోని డివిజన్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై త్వరలోనే పారిశుధ్యం, నీటి సరఫరా, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, అన్ని విభాగాలకు సంబంధించిన అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుతాం. ఈ విషయమై ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. ఇవి ఏర్పాటు చేస్తే ఆయా గ్రామాల ప్రజలు సేవలు పొందవచ్చు.

నమస్తే : ఈ వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
కమిషనర్ : నీటి ఇబ్బందులు రాకుండా గతంలో పంచాయతీల ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు చేపట్టారో ఇప్పుడు కూడా అదే తీరులో ప్రజలకు సేవలు అందిస్తాం. నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడా కూడ నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.

నమస్తే : గ్రామాల్లో పారిశుధ్యం కోసం తీసుకుంటున్న చర్యలేంటి?
కమిషనర్ : ఇప్పటికే అన్ని విలీన గ్రామాల్లోనూ పారిశుధ్యం కోసం అనుసంధానం చేసిన డివిజన్ల పారిశుధ్య విభాగపు అధికారులకు బాధ్యతలు అప్పగించాం. వారు స్థానికంగా పంచాయతీల్లో ఉన్న సిబ్బందితో పనులు సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించాం. మరింత మెరుగుపర్చేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటాం.
అలరించిన సయోనారా-2019
ముకరంపుర: నగరంలోని అపూర్వ కో ఎడ్యుకేషన్, మహిళా డిగ్రీ కళాశాలలో సయోనారా-2019 పేరుతో ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఫేర్‌వెల్ డే అలరించింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాలల చైర్మన్ పీ వేణు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగి సమాజానికి సేవ చేస్తూ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పీ అనిల్, ప్రిన్సిపాల్ వీవీ మనోహర్‌రెడ్డి, కే మనోహర్, వైస్ ప్రిన్సిపాల్స్ ఏ తిరుపతిరెడ్డి, రవీందర్‌రెడ్డి, ఏఓలు పీ శ్రీనివాస్, ఎన్ సత్యనారాయణ, డీన్ కే హరిప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
గరుడ వాహనంపై సీతారామచంద్రస్వామి

మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి వారు గరుడ వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాములకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారిని మంగళవాయిద్యాల మధ్య ఊరేగించగా, భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈవో గుజ్జ సుదర్శన్, అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరచార్యులు, సీతారామాచార్యులు, దేవాలయ సిబ్బంది రాజన్న, రవి, మోహన్, భక్తులు పాల్గొన్నారు.

92
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles