నగరంలో ఆధునిక దవాఖాన

Tue,April 16, 2019 02:29 AM

(కార్పొరేషన్, నమస్తే తెలంగాణ) కరీంనగర్‌లో కార్పొరేట్ తరహా సౌకర్యాలతో కూడిన అధునాతన దవాఖాన ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, పదిహేను రోజుల్లో పూర్తిస్థాయి డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పథకం అమలు, దవాఖాన ఏర్పాటుపై సోమవారం మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని సచివాలయంలోని ఆయన చాంబర్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ కింద జరుగుతున్న పనులపై ఆరా తీసిన మంత్రి, పనులను జెట్‌స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన పరిధిలో ఖాళీగా ఉన్న స్థలంలో అధునాతన సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయిలో దవాఖాన నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం స్మార్ట్‌సిటీ కింద 25 కోట్లు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 కోట్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 75 కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా నిర్మించడమే కాకుండా.. పేదలకు అన్ని సౌకర్యాలతో వైద్య సదుపాయాలను అందుబాటులో తేవాలని ఆదేశించారు.

ఈ దవాఖాన నిర్మాణానికి సంబంధించి పదిహేను రోజుల్లో పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డీపీఆర్‌ను ఎంత త్వరగా పూర్తిచేస్తే టెండర్ ప్రక్రియ అంత త్వరగా పూర్తిచేసి నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ భవనం పది అంతస్థులకు అనుకూలంగా ఫౌండేషన్ ఉండాలనీ, 8 అంతస్థులకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే నూతన భవనంలో వెలుతురు, గాలి పూర్తి స్థాయిలో ఉండే విధంగా ప్రణాళిక చేయాలన్నారు. ఈ విషయంలో సంబంధిత విభాగాలన్నీ కలసి పనిచేయాలని ఆదేశించారు. అంతిమ లక్ష్యం పేదలకు అన్ని సౌకర్యాలతో వైద్యం అందించడమేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నగర మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ అజయ్‌కుమార్, బల్దియా ఈఈ భద్రయ్య, స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ ప్రతినిధి రాజశేఖర్, తదితరులు పాల్గొనగా.. మంత్రి తీసుకున్న నిర్ణయంపై మేయర్ హర్షం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ కింద వచ్చే 25 కోట్లతో పాటు ప్రభుత్వం నుంచి మరో 50 కోట్లు విడుదల చేయడం వల్ల కరీంనగర్‌లో అద్భుతమైన దవాఖాన నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అంతే కాకుండా అన్ని హంగులతో వైద్యసదుపాయాలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ దవాఖాన యావత్తు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సేవలందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.

143
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles