పరిషత్‌పై గులాబీ నజర్

Mon,April 15, 2019 12:51 AM

- నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం
- దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్
- 15 జడ్పీటీసీ, 178 ఎంపీటీసీల గెలుపే లక్ష్యం
- జిల్లాలో జడ్‌పీ పీఠాల క్లీన్‌స్వీప్‌పై నేతల ప్రధాన దృష్టి
- మరోసారి సత్తాచాటేలా ముందుకు.. వ్యూహాత్మకంగా అడుగులు
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అధికార టీఆర్‌ఎస్ పార్టీ నిత్యం ప్రజల మధ్యన ఉంటూ, ప్రజల్లో మమేకమైపోతూ ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రతిపక్షాలకు పని లేకుండా చేస్తోంది. మామూలు కార్యకర్త మొదలు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి స్థాయి నాయకులు కూడా ప్రజా క్షేత్రంలో నిలిచి ప్రజల సమస్యలు పరిష్కరిస్తువస్తున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దూర దృష్టితో ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రెండోసారి అసెబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలకు అందనంత దూరంలో సత్తా చాటింది. పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటికీ వచ్చే నెల 23న ఫలితాలు వెల్లడవనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కూడా గులాబీ దళానికి ఎదురు లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సన్నద్దమవుతున్నారు..

అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా..
జిల్లాలో 15 జడ్పీ, 178 ఎంపీటీసీ స్థానాలున్నాయి. జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు దాదాపు అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటి వరకు జడ్పీలో టీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. గతంలో 57 జడ్పీ స్థానాలు ఉండగా జిల్లాల విభజన నేపథ్యంలో ఇపుడు 15 స్థానాలు మాత్రమే మిగిలాయి. మొత్తం స్థానాల్లో గెలిచి ప్రతిపక్షాల ఉనికి కూడా లేకుండా చేస్తేనే అభివృద్ధి సజావుగా సాగుతుందని టీఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలతో పాటు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ అసెంబ్లీలో మరో రెండు మండలాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ గెలుపు నల్లేరుపై నడకేనని ఆ పార్టీ భావిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత బలం
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎక్కడా టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయాయి. దీంతో ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారన్న సత్యాన్ని తెలుసుకున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరడం మొదలు పెట్టారు. జిల్లాలో టీడీపీ దాదాపు కనుమరుగవగా కాంగ్రెస్, బీజేపీల నుంచి ప్రధాన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదలైన చేరికలు ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ మరింత బలపడిందని చెప్పకతప్పదు. జిల్లాలో 313 పంచాయతీలు ఉంటే 216 పంచాయతీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 37, బీజేపీకి 13 స్థానాలు మాత్రమే దక్కాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సర్పంచులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో జరుగనున్న జిల్లా, మండల ప్రజా పరిషత్‌ల ఎన్నికల్లో తమ గెలుపు సునాయాసం అవుతుందని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. అయినా ప్రజల మద్దతు కూడగట్టడంలో ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యహరించరాదని టీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది.

నేడు అధినేత కేసీఆర్‌తో సమావేశం
పార్టీ గుర్తులపై నిర్వహిస్తున్న జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం 2.30 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతోపాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పరిషత్ ఎన్నికల్లో పార్టీ అనుసరించే వ్యూహాలు, ఎలా ముందుకు వెళ్లాలో ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 15 జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలతోపాటు 15 మండల ప్రజా పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు అధినేత ఎలాంటి సలహాలు, సూచనలు అందిస్తారనేది ఇప్పుడు పార్టీలో చర్చానీయాంశమైంది. జిల్లాలో ఆది నుంచి బలంగా ఉన్న టీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేరికలతో మరింత బలపడింది. అయితే పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదిర్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలో కూడా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన పరిస్థితిపై సీఎం కేసీఆర్ చర్చంచనున్నారని తెలుస్తోంది.

137
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles