విజయం మాదే

Fri,April 12, 2019 01:35 AM

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో విజయం సాధిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విష ప్రచారాలు చేసినా ప్రజలు వారిని తిరస్కరించి, తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా నిలిచారన్నారు. కరీంనగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఈసారి ప్రత్యేకంగా లోకసభ ఎన్నికలు జరిగినప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో మంచి పోలింగ్‌శాతం నమోదైందన్నారు. ఎండను లెక్క చేయకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని, మరోసారి ఈ ప్రాంత ప్రజలు తమ చైతన్యాన్ని చాటుకున్నారని కొనియాడారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలు తమపై విషప్రచారం చేశాయని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్‌కు సంబంధం ఏమిటనీ, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన తదుపరి మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు గెలిపించాలంటూ రకరకాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.

అయితే, ప్రజలు మాత్రం ఆ మాటలను ఏమాత్రం ఖాతరు చేయకుండా మరోసారి గులాబీ జెండాకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలిచారని తెలిపారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేననీ, అందులో ముఖ్యమంత్రి ముందుగా చెప్పినట్లుగానే వినోద్‌కుమార్ కేంద్రంలో మంత్రి హోదాలో ఉంటారని పేర్కొన్నారు. సంకీర్ణ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పాత్ర కీలకంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే మంచి మెజార్టీతో వినోద్‌కుమార్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో ఎంపీ వినోద్‌కుమార్‌ను గెలిపించేందుకు కుల, మతాలకతీతంగా అందరూ ఏకోన్ముఖులై కదలి వచ్చారని పేర్కొన్నారు. ఎవరికి వారే స్వచ్ఛందంగా వచ్చి వారి మద్దతును ప్రకటించారన్నారు. అలాగే, కరీంనగర్ నియోజకవర్గంలో ప్రచార సరళి కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగిందని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో పూర్తిగా సఫలీకృతులు అయ్యారన్నారు. ఈ ఎన్నికల్లో వినోద్‌కుమార్ గెలుపుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌జెండాను గెలిపించేందుకు కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

మంత్రి ఈటల నేతృత్వంలో ముందుకెళ్తాం: ఎంపీ వినోద్‌కుమార్
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారనీ, భవిష్యత్‌లోనూ ఆయన నేతృత్వంలోనే ముందుకుసాగుతామని ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న మంత్రి ఈటల పార్టీ నాయకత్వాన్ని ఒక్కతాటిపై నడిపించడంతోపాటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు అహర్నిషలు కృషి చేశారని తెలిపారు. నెల నుంచి మంత్రి పని చేసిన తీరు అందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్‌కు వంద సీట్లు వస్తాయో రావో అంటూ గతంలో తాను మాట్లాడితే కొంత మంది ఆ పార్టీ నాయకులకు కోపం వచ్చిందనీ, కానీ గురువారం జరిగిన ఎన్నికలను చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి అందరికి అర్థమైందని ఎద్దేవా చేశారు. చివరకు కాంగ్రెస్ వాళ్లు బీజేపీకి ఓట్లు వేయించే పరిస్థితి కనిపించిందన్నారు. కేవలం లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిగినప్పటికీ సుమారు 70 శాతం వరకు పోలింగ్ నమోదు కావడం హర్షణీయమన్నారు. మంచి మెజార్టీతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ఎంపీ.. ఫలితాలు వచ్చిన తదుపరి భవిష్యత్ రాజకీయాలు, ఇతర అంశాలపై మాట్లాడుతామని తెలిపారు. ఈటల నేతృత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలతోపాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ప్రతిఒక్కరికీ కృతజతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతోపాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

159
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles